శనివారం 06 మార్చి 2021
Yadadri - Feb 16, 2020 , 00:26:33

తీర్పు ఏకపక్షమే !

తీర్పు ఏకపక్షమే !
  • సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌
  • కారు జోరుతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సంబురాలు
  • ఆత్మకూర్‌(ఎం)లో కీలకంగా మారిన బీఎస్పీ నేత
  • భువనగిరి మండలం చందుపట్ల ఒక్కటే కాంగ్రెస్‌ ఖాతాలోకి..
  • 79 ఏకగ్రీవాలతో కలుపుకుని 237 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం
  • 21 పీఏసీఎస్‌లలో 20 చైర్మన్‌ పదవులను గెలుచుకునే అవకాశం
  • సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకున్న రైతన్నలు
  • జిల్లా అంతా గులాబీమయం

సహకార ఎన్నికల్లో రైతులు  ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలిచారు. కారు ఎవరూ  అందుకోలేనంత స్పీడుగా దూసుకుపోయింది. జిల్లాలో మొత్తం 21 పీఏసీఎస్‌లలో 273 వార్డులు ఉండగా 79 ఏకగ్రీవాలతో ఉద్యమపార్టీ  సరికొత్త చరిత్రను లిఖించుకున్నది. శనివారం ఎన్నికలు జరిగిన 194 వార్డుల్లో 158 స్థానాలను గులాబీపార్టీ కైవసం చేసుకొని సత్తాచాటింది.  జిల్లాలో 21 సహకార సంఘాలు ఉండగా 20 సంఘాలను టీఆర్‌ఎస్‌  కైవసం చేసుకునే మెజార్టీని సాధించింది. ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దేనని అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెబుతున్నట్లుగానే ఫలితాలు వస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందంతో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. 


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సహకార సమరంలో రైతన్నలు తమ అభిమాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడి వైపు నిలబడి ఏకపక్షంగా తీర్పును కట్టబెట్టారు. సహకార పోరులో కారు ఎవరు అందుకోలేనంత స్పీడుగా దూసుకుపోయింది. పీఏసీఎస్‌ సమరంలో 79 ఏకగ్రీవాలతో సరికొత్త చరిత్రను లిఖించుకున్న ఉద్యమపార్టీ ఎన్నికలు జరిగిన 194 స్థానాల్లో కూడా ఊహించనంత  ఫలితాలు సాధించింది. సహకార సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను గెల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. జిల్లాలో మొత్తం 21 పీఏసీఎస్‌లలో 273 వార్డులు ఉండగా  ఇందులో 79 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 194 వార్డుల్లో ఎన్నికలు జరుగగా 158 వార్డులను టీఆర్‌ఎస్‌ కైసవం చేసుకున్నది. జిల్లా వ్యాప్తంగా 21 పీఏసీఎస్‌లో 273 వార్డుల్లో 970 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు.  ఏకగ్రీవాలతో కలుపుకుని 237 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. జిల్లాలో 21 సహకార సంఘాలు ఉండగా 20 సంఘాలను టీఆర్‌ఎస్‌  కైవసం చేసుకునే మెజార్టీని సాధించింది.


ఆలేరు నియోజకవర్గంలో ఏడు సంఘాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. ఆత్మకూర్‌ (ఎం) మండలానికి సంబంధించిన సహకార సంఘంలో 13 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ ఆరు గెల్చుకోగా బీఎస్పీ నుంచి విజయం సాధించిన డైరెక్టర్‌ ఎటు ఓటేస్తే ఆ పార్టీ అభ్యర్థి చైర్మన్‌ గెల్చుకునే అవకాశాలున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి, పోచంపల్లి, వలిగొండ, అరూరు. సూలూరు సంఘాల్లో గులాబీ జెండా ఎగిరింది. బీబీనగర్‌లో టీఆర్‌ఎస్‌ బహిష్కృత నాయకులు నలుగురు విజయం సాధించారు. వారు తాము టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తామని ప్రకటించారు. దాంతో బీబీనగర్‌ కూడా టీఆర్‌ఎస్‌ వశం కానున్నది. మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట, సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌లోని ఐదు సంఘాల్లో కారు దూసుకుపోయింది. చైర్మన్ల ఎన్నిక ఇక లాంఛనం కానున్నది. భువనగిరి నియోజకవర్గంలోని ఒక్క చందుపట్ల పీఏసీఎస్‌లో మాత్రమే కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దేనని అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు చెబుతున్నట్లుగానే ఫలితాలు వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందంతో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన విజయ పరంపర ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ సమరం వరకు ఏకపక్ష తీర్పును కట్టబెడుతూ వచ్చిన ఓటర్లు సహకార పోరులో ఎవరు ఊహించని విధంగా టీఆర్‌ఎస్‌కు విజయం అందించారు. 

మిన్నంటిన సంబురాలు

సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ప్రభుత్వానికి  రైతన్నలు ఇచ్చిన చేయుతగా నాయకులు పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో చైర్మన్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న రాంరెడ్డితో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఏడు సంఘాల్లో  అపూర్వమైన విజయం నమోదు చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. 

ఎన్నికల పర్వాన్ని పర్యవేక్షించిన అధికారులు

ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ అనితారమచంద్రన్‌ పలు పోలింగ్‌ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి పర్యవేక్షించారు. అడిషనల్‌ కలెక్టర్లు జి. రమేశ్‌, ఖీమ్యానాయక్‌లు కూడా పలు కేంద్రాలను సందర్శించారు. డీసీవో టి. వెంకట్‌రెడ్డి యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, భువనగిరి ప్రభుత్వ పాఠశాలలోని కేంద్రాలను తనిఖీ చేశారు. భువనగిరి ఆర్‌డీవో భూపాల్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఆర్‌డీవో సూరజ్‌కుమార్‌తో పాటు ఏడుగురు జోనల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన రూట్లలో పర్యటించారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్లలో బందోబస్తును పర్యవేక్షించారు. ఏసీపీలు భుజంగరావు, కోట్ల నర్సింహారెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, ఏఆర్‌ ఏసీపీ కిష్టయ్యలు బందోబస్తును పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఓటు ఎవరికి వేశాననే విషయం బహిర్గతం                              చేసిన వ్యక్తిపై కేసు నమోదు 

యాదగిరిగుట్టలోని ప్రాథమిక సహకార సంఘంలో  7వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో 115 నెంబర్‌ గల బ్యాలెట్‌పై ఓటేసి తాను ఏ పార్టీకి ఓటేశాననే విషయమై ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. యాదగిరిగుట్ట సీఐ పాండురంగారెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

VIDEOS

logo