నేడే పోలింగ్

సహకార ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం ఏడుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు సరిపడా బ్యాలెట్ పేపర్లు, బాక్సులను సమకూర్చడంతో పాటు 684 మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం ఎన్నికల సామగ్రిని కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని 21 పీఏసీఎస్‌లలో 79 వార్డులు ఏకగ్రీవం కాగా 194 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 45,225 మంది రైతులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట చవరకు పోలింగ్ జరుగనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో సొసైటీ ఎన్నికలు జరుగనున్నాయి. బ్యాలెట్ పేపర్లు, బాక్సులను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. శుక్రవారం సాయంత్రం ఎన్నికల సామగ్రితో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. సొసైటీ ఎన్నికల దృష్ట్యా శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
194 పోలింగ్ కేంద్రాలు..
వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ బూత్‌కు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఒక ఇతర ప్రిసైడింగ్ అధికారిని నియమించారు. 194 వార్డుల్లో 257 మంది పీవోలు, 430 ఏపీవోలను ఎన్నికల నిర్వహణకు నియమించారు.
45,225 మంది ఓటర్లు..
జిల్లాలోని 21 పీఏసీఎస్‌ల్లో 273 వార్డులున్నాయి. ఇందులో 79 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగతా 194 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 45,225 మంది రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 684 మంది సిబ్బందిని నియమించాం. ఇప్పటికే సామగ్రితో సహా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టర్ అనితారామచంద్రన్, అడిషనల్ కలెక్టర్ రమేశ్ సూచనల ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నాం. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏసీపీలు భుజంగరావు, కోట్ల నర్సింహారెడ్డి, సత్తయ్యలు తగిన ఫోర్స్‌ను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
-డీసీవో వెంకట్‌రెడ్డి
పోలింగ్ కేంద్రం పరిశీలన
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : సహకారం సంఘాల ఎన్నికలకు చౌటుప్పల్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీవో సూరజ్‌కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రిని సంబంధిత అధికారులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. చౌటుప్పల్‌లో 13 వార్డులకు గాను 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయాలని సూచించారు. వాహనాల్లో ఓటర్లను తరలించవద్దని సూచించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..
- గోల్డెన్ రేజర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న సెలూన్ ఓనర్
- ఈ శుక్రవారం విడుదలవుతున్న 9 సినిమాలు ఇవే!