బుధవారం 03 జూన్ 2020
Yadadri - Feb 11, 2020 , 23:50:27

ప్రచారం షురూ...

ప్రచారం షురూ...

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : పీఏసీఎస్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇక అభ్యర్థుల లెక్క తేలడంతో పాటు ఎన్నికల అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. జిల్లాలో మొత్తం 273 వార్డుల్లో 79 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన 194 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో తాము సైతం గెలువాలన్న దృఢ సంకల్పంతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటు హక్కు కలిగిన రైతుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ తమకు మద్దతుగా నిలువాలని వేడుకుంటున్నారు. అంతేకాక నమూనా బ్యాలెట్‌ను తయారు చేయించి మరీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ దుమ్ము లేపుతున్నారు. 


ప్రత్యేక వ్యూహంతో ముందుకు..

గులాబీ పార్టీ ప్రచారంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నది. టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తేనే సహకార సంఘాలు బలోపేతం అవుతాయని ముఖ్య నేతలు వివరిస్తున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూనే మరోవైపు రాబోయే రోజుల్లో సహకార సంఘాల్లో చేసే అభివృద్ధి పనులను రైతులకు విడమరిచి చెబుతున్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేసి టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని వేడుకుంటున్నారు. 


సహకారంలో టీఆర్‌ఎస్‌దే హవా.. 

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వాహ కొనసాగుతున్నది. అన్ని ఎన్నికల మాదిరిగానే సహకార ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కు జనం జై కొడుతున్నారు. జిల్లాలో 17 మండలాల్లో 21 పీఏసీఎస్‌లు ఉండగా 273 వార్డులు ఉన్నాయి. ఇందులో మొత్తం 79 వార్డుల్లో పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో యాదగిరిగుట్టలో 7 వార్డులు, వంగపల్లిలో 10 వార్డులు, రేణికుంటలో 10 వార్డులు, తుర్కపల్లిలో 7 వార్డులు, బొమ్మలరామారంలో 5 వార్డులు, భువనగిరిలో 4 వార్డులు, ఆలేరులో 2 వార్డులు, నారాయణపూర్‌లో 2 వార్డులు, జులూరులో 10 వార్డులు, రామన్నపేటలో 3 వార్డులు, అడ్డగూడురులో 3 వార్డులు, పోచంపల్లిలో 9 వార్డులు, బీబీనగర్‌లో 2 వార్డులు, మోత్కురులో 3 వార్డులు, గుజ్జలో 2 వార్డులు ఉన్నాయి. ఇకపోతే మొత్తం 273 వార్డుల్లో 79 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన 194 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 


విజయమే లక్ష్యంగా.. 

 సహకార పోరులో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రజాప్రతినిధులు, జిల్లా నేతలు రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని సహకార సంఘాలపై గులాబీ జెండా ఎగురేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు.    మంగళవారం రాజాపేటలో టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. అంతేకాక భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారాన్ని షురూ చేసేందుకు నడుం బిగిస్తున్నారు.  


సమరోత్సాహంతో.. 

చౌటుప్పల్‌ పీఏసీఎస్‌ బరిలో దిగిన టీఆర్‌ఎస్‌ బ లపరిచిన డైరెక్టర్లను గెలిపించుకునేందుకు పార్టీ ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి సమరోత్సాహంతో ప్రచార సరళి ని రూపొందిస్తున్నారు. గత ఆరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించేలా కార్యాచరణ చేపడుతున్నారు. మోత్కూరు పరిధిలో డైరెక్టర్ల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పని చేస్తున్నారు. 


logo