శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Feb 11, 2020 , 23:42:41

దొరికినట్టే దొరికి..

దొరికినట్టే దొరికి..

రాజాపేట : ఏడేళ్ల కిందట తప్పిపోయిన తమ కుమారుడి ఆచూకీ సోషల్‌ మీడియా ద్యారా లభ్యమయిందనుకునేలోపే పోలీసుల పూర్తి వైఫల్యంతో తిరిగి కనిపించకుండాపోయాడని తల్లిదండ్రుల ఆరోపించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి పద్మమ్మాపెంటయ్యలకు ఇద్దరు సంతానం కొడుకు, కూతురు ఉన్నారు. మూగవాడయిన ఖాసీమ్‌ ఏడు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. తప్పిపోయిన కుమారుడి కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతకని చోటు లేదు.. మొక్కని దేవుళ్లు లేరు... అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్న కొడుకు ఖాసీమ్‌ అసలు బతికి ఉన్నాడో? లేక చనిపోయాడో? అని.. ఆందోళనతో తరుచూ బాధపడే వారు. మూడు రోజుల కిందట మండలం చల్లూరు గ్రామానికి చేరుకున్న ఖాసీమ్‌ను చూసిన అక్కడి స్థానిక యువకులు అతని వివరాలు అడిగినా చెప్పకపోవడంతో మూగవాడిగా గుర్తించారు. దీంతో వారు టిక్‌టాక్‌ ద్వారా ఖాసీమ్‌ వివరాలను తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఖాసీం వీడీయోను తలకొండపల్లి గ్రామస్తులు చూసి గుర్తించిచారు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో కొడుకును వీడియోలో చూసిన వారి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. 


కొడుకు కోసం మంగళవారం ఉదయం చల్లూరు గ్రామానికి వచ్చిన వారికి సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. గ్రామస్తులను అడుగగా సోమవారం రాత్రికే ఖాసీంను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఖాసీమ్‌ తల్లితండ్రులకు.. పోలీసులు ఇచ్చిన సమాధానంతో నివ్వెరపోయారు. మీ కుమారుడిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన విషయం నిజమే..! కానీ ఉదయం టీఫిన్‌ చేసి వస్తానని వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు జవాబు ఇచ్చారు. ఈ సమాధానంతో హతాశులైన తల్లిదండ్రులు.. కొడుకు ఆచూకీ తెలిసిందనుకునే తరుణంలోనే.. తిరిగి కన్పించకపోవడంతో నిరాశకు గురయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తన కొడుకును దూరం చేసిన పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. తప్పిపోయిన కొడుకు ఆచూకీ ఎలాగైనా కనిపెట్టి.. తమకు అప్పగించాలని ఆ తల్లిదండ్రులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.


logo