శనివారం 06 మార్చి 2021
Yadadri - Feb 11, 2020 , 00:13:44

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా మన కట్టా శేఖర్‌రెడ్డి

రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా మన కట్టా శేఖర్‌రెడ్డి

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ  : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో కీలక పదవిని కేటాయించారు. జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కట్టా శేఖర్‌ రెడ్డిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా బాధ్యతల్లో ఉన్న కట్టా శేఖర్‌ రెడ్డి స్వస్థలం మాడ్గులపల్లి మండల కేంద్రం పరిధిలోని మర్రిగూడెం గ్రామం. రైతు దంపతులైన కట్టా మల్లారెడ్డి, జానకమ్మ సంతానంగా 1961 డిసెంబర్‌ 5న జన్మించిన శేఖర్‌రెడ్డి.. మాడ్గులపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేశారు. నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌, ఎన్జీ కాలేజీలో డిగ్రీ, నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ కాలేజీలో బీఈడీ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో ఎంఏ, లెనినిస్ట్‌ విద్యా తాత్వికతపై ఎంఫిల్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగానూ కట్టా.. పలు బాధ్యతలు నిర్వహించారు. 1985లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హ్యుమానిటీస్‌ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, సెనేట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 


1987వ సంవత్సరం నుంచి  పత్రికారంగంలో సేవలు...

చదువులు పూర్తిచేసిన వెంటనే 1987లో ఉద యం దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా కట్టా శేఖర్‌రెడ్డి జర్నలిస్టు ప్రస్థానం మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత పాత ఆంధ్రజ్యోతి పత్రికలో చేరి పదేళ్లకు పైగా వివిధ హోదాలలో పని చేశారు. ఆ తర్వాత రీడిఫ్‌.కామ్‌, వార్త పత్రికల్లోనూ కొద్ది రోజులు కొనసాగారు. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వెలుగు ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌గా 2002లో పని చేశారు. ఆంధ్రజ్యోతి పత్రి క పునఃప్రారంభ సమయంలో ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆరేళ్లు పనిచేశారు. వందల మంది పాత్రికేయులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్లపా టు మహాటీవీలో ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించిన కట్టా శేఖర్‌రెడ్డి.. 2010లో నమస్తే తెలంగాణ దినపత్రిక ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వ్యవస్థాపక సీఈఓగా వ్యవహరించారు. 2014 నుంచి నమస్తే తెలంగాణ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ అధినేత కేసీఆర్‌కు పత్రిక పరం గా చేయూతనిస్తూ కీలకపాత్ర పోషించారు. శేఖర్‌రెడ్డి మార్గదర్శకత్వంలో జర్నలిస్టులు సైతం తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించారు. కట్టా సంపాదకత్వంలో వెలువడిన జర్నలిస్టు కరదీపిక పుస్తకం వర్ధమాన, యువ జర్నలిస్టులకు కరదీపికగా ఉపయోగపడుతోంది.

VIDEOS

logo