ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 10, 2020 , 00:28:11

శ్రీచక్రతీర్థలో ఆనందకేళి

శ్రీచక్రతీర్థలో  ఆనందకేళి
  • శ్రీదేవి,భూదేవిలతో మంత్రపూర్వక స్నాన మాచరించిన శ్రీవారు
  • ఘనంగా మహా పూర్ణాహుతి
  • శ్రీపుష్పయాగం
  • మొక్కులు చెల్లించుకున్నభక్తులు




యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చక్రతీర్థస్నానం జరిపించారు. కల్యాణం.. రథోత్సవంతో అలసిపోయిన స్వామివారిని చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగారడోలోత్సవానికి సిద్ధం చేశారు. అంతకుముందు ఆలయంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు తమ మనస్సు, తనువును ఒక్కటి చేసి శ్రీనారసింహ.. జై నారసింహ అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి శ్రీచక్రాళ్వార్‌కు జరిపించిన శ్రీచక్రతీర్థమహోత్సవాన్ని తిలకించారు.  శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీలక్ష్మీనరసింహస్వామివారు శ్రీచక్రాళ్వార్‌తో కలిసి మంత్రపూర్వక స్నానం గావించారు. ‘శ్రీచక్ర తీర్థాన శ్రీధరుడే ఆడగా కలియుగమే శిరమొంచి ప్రణమిల్లగా అన్నట్లుగా భక్తులు శ్రీవారిని స్మరిస్తూ పుష్కరిణిలో ఆనందతాండవం చేశారు. ఒకవైపు వేదపండితుల వేదఘోష, పారాయణికుల పారాయణాలు సందడిలో  తరలి వచ్చిన భక్తుల ఆనందహేళలో భక్త జనులు ఆనందపరవశులయ్యారు. అంతకుముందు ఆలయంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. స్థ్ధానిక భజనమండలి సభ్యుల భజన నిర్వహించారు. ఆలయంలో వేదపారాయణాలు జరిపారు. 


శ్రీపుష్పయాగం.. 

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో ఆదివారం రాత్రి శ్రీపుష్పయాగం, డోలారోహణం, దేవతా ఉద్వాసన వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుడి ఉత్సవాలకు ఆహ్వానించిన ఆయా దేవతలను ఆయా మంత్రముల చేత ఆహ్వానించిన పిదప తిరిగి వారి స్వస్థలలాలకు సంప్రదాయంగా పంపించే వేడుకను దేవతా ఉద్వాసనగా పేర్కొంటారు. భగవానుడి నామాలతో అర్చన వేడుకలు నిర్వహించే ప్రక్రియను శ్రీపుష్పయాగంగా పేర్కొంటారు. సహస్ర నామాలతో అమ్మవారిని, భగవానుడిని పుష్పాలతో ఆరాధించారు. భగవానుడికి ప్రితీ కలిగే రాగ, లయబద్ధంగా యజ్ఞాచార్యులు, అర్చకబృందం వేడుకగా జరిపారు. 


డోలారోహణం ప్రత్యేకత..

స్వామివారికి, అమ్మవార్లకు ఏకంతసేవలో నిర్వహించే శృంగారడోలోత్సవాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ విశిష్టుడైన పరమాత్మను దర్శించాలన్న సాక్షాత్కార రూపమే డోలారోహణమని స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు వివరించారు. కార్యక్రమంలో యాదాద్రి ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త నర్సింహామూర్తి, ఏఈవో జూశెట్టి కృష్ణగౌడ్‌, సూపరిండెంట్‌ బలరామ్‌సింగ్‌యాదవ్‌,  లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 


చక్రతీర్థ ప్రత్యేకత..

బ్రహ్మోత్సవ వేడుకల ముగింపు సూచికగా శ్రీచక్రస్వరూపుడైన శ్రీహరి చక్ర స్వరూపమును అర్చించి వైదిక విధులను అనుసరించి శ్రీస్వామి వారి స్నపన బింబములను పుష్కరిణికి తెచ్చి స్నానోత్సవం నిర్వహించును. దీనినే అవభృథ స్నానం అని అంటారు. దీక్షాన్తోఅవభృథోయజ్ఞే అని అమరం. అవభృథ స్నానమనేది యజ్ఞాంతమందలి చేసే  విశిష్టప్రక్రియ. శ్రీ చక్రాత్తాళ్వార్‌ను (సుదర్శన చక్రాన్ని) శ్రీస్వామి వారి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. శ్రీసుదర్శన చక్రస్నానం వల్ల అత్యంత పవిత్రత పొందిన పుష్కరిణి జలాల్లో భక్తులు కూడా శిరస్నానం చేస్తారు. దీని వలన సర్వపాప ప్రక్షాళన గావించును. శ్రీస్వామి వారి సుదర్శన ఆయుధాన్ని  ఒక విశిష్టదైవవతంగా అన్ని కష్టాల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షించే మహాశక్తాయుధంగా విశ్వసించి పూజించడం ప్రత్యేకత. నిత్యారాధనల అనంతరం శ్రీస్వామి వారి ఆలయంలో రాత్రి 7.00 గంటలకు దేవత ఉద్వాసన, శ్రీ పుష్పయాగము, డోలారోహణం, ప్రధానార్చక బృందం, యజ్ఞాచార్యులు వేడుకలను నిర్వహించారు.


శ్రీపుష్పయాగం ప్రత్యేకత..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారి సన్నిధిలో ఎంతో మనోహరముగా శ్రీ పుష్పయాగం నిర్వహించారు. పుష్పహాస అని భగవానుడికి నామం కలదు. లక్ష్మీదేవి నివసించు ఎనిమిది స్థానములో పుష్పమునకే అగ్రస్థానం దక్కినది. పుష్పములు భిన్నభిన్న రూపములో ఉన్న వాటిలోని పరిమళము ఒకే విధంగా ఉండుట రూపాంతరములెన్ని స్వీకరించిన అంతర్గతమైన లక్ష్మీతత్తము ఒక్కటే అని పురాణ ప్రశస్తి. లక్ష్మీదేవికి నిత్యనివాస స్థ్ధానాలు కమలాలు కనుక కమలాలయ అని అమ్మవారికి నామము. భగవానుడికి అత్యంత ఇష్టురాలైన అమ్మవారు నివసించు పుష్నములచే శ్రీ పుష్పయాగం నిర్వహించుట ఎంతో శుభప్రదమైనది.పాతగుట్టలో నేడు..నేడు అష్టోత్తర శతఘటాభిషేకం, మహదాశీర్వచనం, పండిత సన్మానం నిర్వహిస్తారు.


VIDEOS

logo