ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Feb 10, 2020 , 00:25:42

ముగిసిన పరిశీలన పర్వం

ముగిసిన పరిశీలన పర్వం
  • జిల్లాలో 94 నామినేషన్ల తిరస్కరణ
  • ఏకగ్రీవం కానున్న జిల్లాలోని ఆరు వార్డులు
  • 971 నామినేషన్లు సరైనవిగా గుర్తింపు
  • నేడు బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబితా
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం షురూ

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సహకార సమరంలోని ప్రధాన ఘట్టం ముగిసింది. పీఏసీఎస్‌లకు ఈ నెల 15న జరగబోయే డైరెక్టర్ల స్థానాల ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన  ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని 21 పీఏసీఎస్‌ పరిధిలోని 273 వార్డులకు  1065 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 94 తిరస్కరణకు గురికాగా ఇందులో 971 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. జేసీ జి.రమేశ్‌ ఆదివారం పలు పీఏసీఎస్‌లను సందర్శించి నామినేషన్ల పరిశీలనలు ఎలా జరుగుతున్నాయని తనిఖీలు చేశారు. జిల్లా సహకార అధికారి టి.వెంకట్‌రెడ్డి  జేసీకి వివరాలు అందించారు. ఉపసంహరణలకు ఈ రోజు చాన్స్‌ ఉన్నది. అనంతరం గుర్తులను కేటాయించనున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 


జిల్లాలో 94 నామినేషన్ల తిరస్కరణ

 జిల్లాలోని 21 పీఏసీఎస్‌లో 273 వార్డులున్నాయి. ఇందులో ఆలేరు, ఆత్మకూరు(ఎం), భువనగిరి, బీబీనగర్‌, చందుపట్ల, వంగపల్లి, యాదగిరిగుట్ట, రేణికుంట, తుర్కపల్లి, పోచంపల్లి, జులూరు, బొమ్మలరామారం, రామన్నపేట, అరూరు, వలిగొండ, అడ్డగూడురు, ఆత్మకూరు(ఎం), మోత్కురు, గుండాల, చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గుజ్జ పీఏసీఎస్‌లో కలిపి  1065 నామినేషన్లు దాఖలు కాగా 94 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 971 నామినేషన్లు సరైనవిగా గుర్తించామని సహకార సంఘం జిల్లా అధికారి టి.వెంకట్‌రెడ్డి తెలిపారు.


జూలూరులో మూడు వార్డులకు ఒకే నామినేషన్‌

పోచంపల్లి మండలంలోని జూలూరు ప్రాథమిక సహకార సంఘంలో మూడు వార్డులు ఏకగ్రీవం కానున్నాయి. ఏడో వార్డు వుడుత పున్నయ్య, 13వ వార్డు అందెల జ్యోతి, మూడో వార్డు సురుగూరి భారతమ్మ ఒకే నామినేషన్‌ దాఖలు అయింది. దాంతో ఉపసంహరణలు ముగిసిన తర్వాత ఏకగ్రీవం అయినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి 13వ వార్డు టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ఉపేందర్‌నాయక్‌, బొమ్మలరామారం పీఏసీఎస్‌ నుంచి 13వ వార్డు కోసం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మైలారం చంద్రమ్మ, నారాయణపూర్‌ మండలంలోని గుజ్జ పీఏసీఎస్‌లో 6వ వార్డులో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి సీపీఎం అభ్యర్థి కెసిరెడ్డి యాదిరెడ్డి ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం ఆరు వార్డులు ఏకగ్రీవం కానున్నాయని అధికారులు తెలిపారు. 


నేడు ఉపసంహరణకు గడువు

జిల్లాలోని 21 పీఏసీఎస్‌లో మొత్తం 971 నామినేషన్లు సరైనవి గుర్తించిన అధికారులు నామినేషన్లు ఉప సంహరణకు తుది గడువును ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు ఉపసంహరించుకునే వీలును కల్పించారు. అనంతరం తుది జాబితాను విడుదల చేసి గుర్తులను కేటాయించనున్నారు. 


ప్రచారం షురూ

ఈ నెల 15న జరుగబోయే సహకార ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతోపాటు అధికారులు నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. దీంతో జిల్లాలో నేడు ఉప సంహరణ, తుది జాబితా విడుదలతో పాటు గుర్తులను సైతం కేటాయించడంతో ఇక ప్రచారం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.  ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రతి ఓటరు కలుసుకుని తమ వైపు తిప్పుకోవాలని అభ్యర్థులు రంగలోకి దిగుతున్నారు.


టీఆర్‌ఎస్‌కు అనుకూలం

వరుసగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ సహకార ఎన్నికలు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే పలు వార్డులు ఏకగ్రీవంగా చేసుకోగా ఆయా పీఏసీఎస్‌ పరిధిలోని వార్డుల్లో గెలిచి తీరాలని పావులు కదుపుతున్నారు. జిల్లాలో 21 సహకారం సంఘాలుంటే, వీటిలో 273 వార్డులున్నాయి. ప్రతి సొసైటీలో 13 వార్డుల్లో ఈ నెల 15న పోలింగ్‌ జరుగనున్నది. ఓటర్ల మద్దతు కూడ గట్టుకోవడం కోసం అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వ్యవసాయంపై ఆధారపడి, రైతులకు అండగా నిలబడే సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచేందుకు సన్నాహలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన పథకాలు అభ్యర్థుల గెలుపు కోసం బాటలు వేసేలా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌, తదితర పథకాలకు రైతులు ఆకర్షితులయ్యారు.

VIDEOS

logo