రథోత్సవ వైభవం..

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన రథోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీలక్ష్మీ అమ్మవారిని ముప్పైమూడు కోట్ల దేవతల సాక్షిగా వివాహమాడిన నరసింహస్వామిని దివ్యవిమాన రథోత్సవంపై ఊరేగే తంతును ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు ఘనంగా నిర్వహించారు. ఎదురులేని దొరను ఎదురేగి పిలిచేము అంటూ కల్యాణమూర్తులు రథంలో తరలివస్తుండగా భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. అంతకుముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపక, మల్లిక వంటి పుష్పాలతో, చంద్రహారం, ముత్యాలు, మువ్వలు, వగడాలు, వివిధ కంఠాభరణాలతో అలకరించారు. రథంలోని ఆ పరమాత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. రథం ఒక శరీరం, ఆ రథంలోని 24 అరలు మన ఇంద్రియాల వంటివని, రథంలో స్వామి అమ్మవార్లను అధిష్టించిన అర మన హృదయం వంటిందని ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే భగవంతుడు దర్శనమవుతారని పురాణాలు చెబుతున్నాయని ఆలయ అర్చకులు వివరించారు.
శుక్రవారం అర్ధరాత్రి శ్రీలక్ష్మీ అమ్మవారితో వివాహం జరుపుకున్న శ్రీలక్ష్మీనరసింహుడు అమ్మవారితో కలిసి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వడమంటే వివాహం తరువాత జరిగే “బరాత్” వేడుకను రథోత్సవంగా భక్తజనంగా నిర్వహించుకోవడమే. నరసింహుడు నవవధువు లక్ష్మీతో కలిసి తిరువీధుల్లో తరలిరావడమంటే అపర వైకుంఠంగా పాతగుట్ట పుణ్యక్షేత్రం మారిందని రథోత్సవ వ్యాఖ్యాతలు వినిపిస్తుండగా రథోత్సవం జరిగింది. యాదగిరివాసా గోవిందా.. గోవిందా అంటూ జయజయ ధ్వనాలు చేశారు. అర్ధరాత్రి వేళ వరకు జరిగిన రథోత్సవ సరంభం భక్తులను ఎంతగానో పుణీతులను చేసింది. ఆనందపరవశులైన భక్తులు నరసింహుడిని కొలుస్తూ ముందుకు సాగారు. నరసింహుడిని కొలుస్తూ భక్తులు ఆనంద తన్మయులయ్యారు. రంగురంగుల పుష్పాల, రుత్వికుల పారాయణాలు, విద్యుద్దీపాల వెలుగులు.. కంటికింపును కలిగించాయి. రథంపైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని అదిష్టింపజేయగానే లక్ష్మీనృసింహ.. గోవిందా.. గోవిందా నామస్మరణలతో పాతగుట్ట ప్రాంత పరిసరాలు మార్మోగిపోయాయి. విశ్వశాంతి లోకకల్యాణార్థం శ్రీలక్ష్మీనరసింహుడు జరుపుకునే రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవాయిద్యాల నడుమ భక్తులు భజనలు చేస్తూ కోలాటాలు వేశారు. జై నారసింహ.. జయజయ నారసింహ అంటూ స్మరించుకుంటూ రాత్రి వేళ తిరువీధుల వెంట ఊరేగించారు. భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు.
శ్రీవారిని దర్శించి తన్మయులైన భక్తులు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమాన రథోత్సవంలో శ్రీవారిని దర్శించుకుని తరించాలని తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు ఆనంద తన్మయులయ్యారు. పట్టుపీతాంబరాలు... మెరిసిపోతున్న వజ్రవైడూర్యాలతో మెరిసిపోతుండగా శ్రీవారిని రథంపైన అధిష్టింపజేశారు. అంతకుముందు విశ్వక్సేనుడిని ఆరాధించి పూజలు చేశారు.తరలివస్తున్న శ్రీలక్ష్మీనరసింహుడిని భక్తులు దర్శించుకున్నారు.
రథాంగ హోమం..
శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్య ఆరాధనలు నిర్వహించిన తరువాత సాయంత్రం 5 గంటలకు రథాంగహోమం జరిపారు. రథబలి యాజ్ఞీకులచే నిర్వహించారు. శ్రీస్వామి వారి, అమ్మవారి ఉత్సవ మూర్తులను దివ్యవిమాన రథంపై వేంచేపు చేసి ఆరాధనలు గావించారు. భక్తుల దర్శనార్థం శ్రీస్వామి, అమ్మవార్లను అలంకరించి రథారూఢులను గావించి తిరువీధిలో ఊరేగింపు సేవను నిర్వహించారు. భక్తుల మంగళ హారతులు.. నామ సంకీర్తనలతో కోలాటముల మధ్య దివ్యవిమానరథోత్సవం కనులపండువగా సాగింది.
రథోత్సవ వైభవం..
రథస్తం కేశవం దృష్టా పునర్జన్మన విద్యతే అని లోక ప్రమాణం. బ్రహ్మాది దేవతలతో పాటు సకల జీవరాశి దర్శించి పరవశించే తీరు ఈ దివ్య విమాన రథోత్సవం సూచిస్తుంది. దివ్యవిమాన రథారూఢుడైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరువీధిలో ఊరేగడాన్ని 33 కోట్ల దేవతలు సైతం వరుసలో నిలబడి దర్శించుకుంటారని భక్తుల నమ్మకం. శ్రీస్వామి వారి దివ్యరథమునకు శ్తెబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అనే నాలుగు గుఱ్ఱములను అమర్చి పీతాంబర ధారి, ధవళ చత్రములో, గరుడధ్వజములతో, ఇంద్ర ధనస్సు వంటి మెరుపు తీగల మధ్య గల మేఘము వలె శ్రీస్వామి వారు రథాముపై విహరిస్తారని వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యానంలో వినిపించారు. రథంపై ఊరేగేతున్న స్వామిని దర్శించిన జన్మ, జరా, ధుఃఖ రహితులవుతారని పురాణాల్లో పేర్కొనబడింది.
సాంస్కృతిక కార్యక్రమాలు..
సాయంత్రం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు యాదగిరిగుట్ట గాయత్రి భజన మండలి వారిచే భజన, 5.45 గంటల నుంచి 6.30 వరకు బొమ్మ భాగ్యలక్ష్మి భజనమండలి వారిచే భజన, 6.30 నుంచి 7.15 గంటల వరకు శ్రీమార్కండేయస్వామి భజన మండలి వారిచే భజన, రాత్రి 7.15 నుంచి 8.00 గంటల వరకు నేహ బృందముచే కూచిపూడి నృత్య ప్రదర్శన, రాత్రి 8గంటల నుంచి కానుగు పాపయ్య బృందంచే రథం ముందు చెక్క భజన నిర్వహించారు.
తాజావార్తలు
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!