శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 08, 2020 , 00:29:47

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం

యాదాద్రి పాతగుట్ట అపర వైకుంఠాన్ని తలపించింది...పండు వెన్నెలలో శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీనారసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేదపండితులు జరిపారు. అంతకుముందు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. పండితుల వేదఘోష, భక్తజనం జేజేల మధ్య శుక్రవారం రాత్రి 8. 15 గంటలకు మొదలైన కల్యాణ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగింది. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకుడు బట్టర్‌ సురేంద్రచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ వేడుకను చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

  • వైభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణ వేడుక
  • యాదాద్రి పాతగుట్టకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
  • పట్టువస్ర్తాల సమర్పణ..ఆకట్టుకున్న ప్రదర్శనలు
  • అర్చకులు..వేదపండితుల వేదమంత్రాల హోరులో భక్తుల తన్మయత్వం
  • మార్మోగిన ఆలయ ప్రాంగణం

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : పాతగుట్ట అపర వైకుంఠాన్ని తలపించింది.. పండు వెన్నెలలో శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా జరిగింది. తుల లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున శ్రీనారసింహుడు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని అర్చకులు, వేదపండితులు వైభవంగా జరిపారు.  అంతకుముందుకు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. పండితుల వేదఘోష, భక్తజనం జేజేల మధ్య శుక్రవారం రాత్రి 9.15 గంటలకు మొదలైన కల్యాణ వేడుక అర్ధరాత్రి వరకు సాగింది. కల్యాణ వేడుకను చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన చేసి స్వస్తి పుణ్యాహవాచనం చేసి సంప్రోక్షణ చేశారు. ఆలయ అనువంశికధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తి, ఈవో ఎన్‌.గీతలకు కంకణ ధారణ చేశారు. స్వామి వారికి బంగారు యజ్ఞోపవీతధారణ చేశారు.

స్వామి, అమ్మవార్లకు మధ్య తెరపత్రం ఉంచి జీలకర్ర బెల్లం ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూలమాలల దండలను మార్పిడి చేశారు. ప్రవరలను చెప్పి, నూతన వధూవరకులకు కన్యాదానం చేశారు. వేదపండితులు, అర్చకబృందం, పారాయణికులు వేదఘోష నడుమ పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక కొనసాగింది. భక్తులు భాగ్యోత్సవాలుగా భావించే శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కల్యాణతంతును వీక్షించడానికి అశేష భక్తజనం పాతగుట్టకు తరలివచ్చారు. పెండ్లికొడుకు, పెండ్లి కూతురుగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ధన, కనక, వజ్ర, వైడూర్యాల ఆభరణాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామి వారిని అలంకరించారు. జైజై నారసింహ.. జైజై లక్ష్మీనరసింహ అంటూ భక్తుల కోలాటాల మధ్య గజవాహన సేవ ఆసక్తిగా నడిచింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో బ్యాండు మేళాలు, కోలాట నృత్యాల నడుమ గజవాహనంపై స్వామి, అమ్మవార్లు ఆధ్యాత్మిక వాతావరణంలో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సురేంద్రచార్యులు ఆధ్వర్యంలో వేడుక జరిగింది. 


శ్రీవారి అనుగ్రహం..

శ్రీవారి తిరుకల్యాణమహోత్సవం తిలకించిన భక్తులకు శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్కంధపురాణంలో స్పష్టం చేసిన విషయాన్ని కల్యాణోత్సవ వ్యాఖ్యాత టీకే రాఘవన్‌ వివరించారు. సమస్త ప్రాణకోటికి, ప్రకృతిమండలానికి శ్రీలక్షీనృసింహుడి అనుగ్రహం.. సకల ఆయురారోగ్యాలు కలుగుతాయని వేదాలు, ఇతిహాసాలలో కూడా పేర్కొనబడి ఉందని ఆయన తెలిపారు. స్వయంభూ పాంచరాత్రాగమ శాస్ర్తానుసారం కల్యాణోత్సవం నిర్వహించడం విశేషమని తెలిపారు.

పారాయణాలు, నిత్యహవనములు..

నిత్యపూజల అనంతరం సాయంత్రం 6 గంటలకు పారాయణాలు, నిత్యహవనములను ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చకబృందం, పారాయణీకులు పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ అలంకార సేవ గజవాహనముపై ఆస్థాన మండపానికి వేంచేయగా ప్రధానార్చకబృందం పర్యవేక్షణలో యాజ్ఞిక బృందం, అర్చక బృందం, వేదపండితులు సుముహుర్తములో శ్రీ స్వామి వారి అమ్మవారి కల్యాణమహోత్సవ వేడుక నిర్వహించారు. కల్యాణ విశేషములను ప్రధానార్చకులు, వేదపండితులు వివరించారు. శ్రీస్వామి వారి, అమ్మవారి వైభవాన్ని తెలియజేసే మహామంత్ర పుష్పపఠనం, చతుర్వేద పారాయణాలు మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం కల్యాణ దంపతులగు శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకార సేవ భక్తుల భజన, కోలాటములతో బ్యాండు మేళతాళముల మధ్య వేడుకగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..

సాయంత్రం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజనమండలి, యాదగిరిగుట్ట వారిచే భజన కార్యక్రమం జరిగింది. 5.45 గంటల నుంచి 6.30 గంటల వరకు నెమ్మానికి చెందిన భక్తభజనమండలి వారు భజన నిర్వహించారు. అనంతరం 6.30 గంటల నుంచి 7.15 గంటల వరకు డీఎస్‌ శ్రీదేవి బృందం వారిచే భక్తి సంగీతం జరిగింది. 7.15 నుంచి 8.00 గంటల వరకు యాదాద్రి డ్యాన్స్‌ అకాడమి వారిచే కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన జగిని హరీశ్‌ బృందంలోని అతని సభ్యులు నిహారిక, రుతిక, అక్షయ తదితర బాలికలు చేసిన నృత్యాలు భక్తులను రంజింపజేశాయి. కార్యక్రమంలో  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహామూర్తి, ఆలయ ఏఈవోలు జూశెట్టి కృష్ణాగౌడ్‌, దోర్భల భాస్కర్‌, ఆకుల చంద్రశేఖర్‌, వేముల రామ్మోహన్‌, మేడి శివ, సూపరింటెండెంట్లు బలరామ్‌సింగ్‌యాదవ్‌, గజవెల్లి రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

గజవాహన సేవ ప్రత్యేకత.. 

‘ఐరావతం గజేంద్రాణాం’ అని భగవానుడు గీతలో అన్నాడు. శ్రీవారు సామాన్యమైన గజంపై కాక దిగ్గజం అయిన ఐరావతముపై ఊరేగుతాడు. ఏనుగు శరీరం పెద్దది, కండ్లు మాత్రం చాలా చిన్నవి. కానీ ఎంత చిన్న వస్తువు అయినా వాటి కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇదొక గొప్ప దృష్టి విన్యాసం. అంటే పరమాణువులో కూడా పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించే ఉన్నత స్థితికి చేరుకోమంటుంది ఏనుగు. గజవాహనం శేవ ద్వారా దివ్యసందేశాన్ని గ్రహించే అవకాశం భక్తులకు కలుగుతున్నది. భగవత్‌ స్మృతి కలిగి ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే తప్పక రక్షణ లభిస్తుందనే శరణాగత సిద్ధాంతాన్ని గజేంద్రమోక్షం కథ నిరూపిస్తుంది. జగద్రక్షకుడైన శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం లోకకల్యాణర్థమేనని పురాణ ప్రసిద్ధి. బ్రహ్మాది దేవతలు ఆనాడు  శ్రీస్వామి వారికి నిర్వహించిన కల్యాణ సంబురాలే ఆగమశాస్ర్తానుసారంగా బ్రహ్మోత్సవాల్లో నిర్వహించడం నేటికి ఆనవాయితి.  కల్యాణోత్సవం జరుపుకున్న వేళ శ్రీవారు ఎంతో ప్రసన్నతతో ఉంటారని అందువల్ల అమ్మవారితో కూడిన భగవానుడిని సేవించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.

హనుమంత వాహన సేవ ప్రత్యేకత.. 

దాస్య భక్తికి ప్రతీక ఆంజనేయస్వామి వారు భగవంతుడి గుణ తత, రహస్య ప్రభావాదులను తెలుసుకొని శ్రద్ధపూర్వకంగా ఆయన సేవలు చేయడం, ఆయన ఆజ్ఞలు శిరసావహించడం దాస్య భక్తి అవుతుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి క్షేత్రపాలకుడిగా శ్రీ స్వామి వారికి సేవలందిస్తూ  వారి ఆశీస్సులను భక్తకోటికి అందజేసే నిరంతర కైంకర్యం నిర్వహిస్తుంటారు. అందువల్ల హనుమంత వాహనముపై స్వామికి చేసే నమస్కారం శ్రీ స్వామివారికి వారి వాహనమైన హనుమంతుడికి ఒకేసారి చేరి భక్తులు అనుగ్రహ పాత్రులు అవుతారని నమ్మకం.

VIDEOS

logo