శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 07, 2020 , 00:47:13

సహకార నామినేషన్లు షురూ..

సహకార నామినేషన్లు షురూ..

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సహకార సంఘాల్లో మొదటి రోజున 70 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉప సంహరణ అనంతరం అదేరోజు తుదిజాబితా విడుదల చేస్తారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. జిల్లాలో 21 సహకార సంఘాల్లో 273 వార్డులున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మద్దతు కూడగట్టుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన అనతికాలంలోనే సర్కార్ సహకార ఎన్నికలకు శంఖారావం మోగించడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు సభ్యులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. శుక్ర, శనివారాల్లో నామినేషన్లను స్వీకరించేందుకు ఆయా సొసైటీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. 

మొదటి రోజు 70 నామినేషన్లు..

సహకార ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభమైంది. ఆయా సహకార సంఘాల కార్యాలయాల వద్ద ఎన్నికల అధికారులకు డైరెక్టర్లుగా బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. వంగపల్లి పీఏసీఎస్ 3వ వార్డు డైరెక్టర్ పదవికి టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 

గ్రామస్థాయి నాయకుల ప్రయత్నాలు..

సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో నిరాశకు గురైన వారు ఈ అవకాశం అందిపుచ్చుకునేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. 

VIDEOS

logo