మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 05, 2020 , 00:08:08

పాతగుట్టలో మొదలైన బ్రహ్మోత్సవాలు

పాతగుట్టలో మొదలైన బ్రహ్మోత్సవాలు

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: తెలంగాణకు తలమానికమై విరాజిల్లుతున్న యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవ సంరంభానికి మంగళవారం ఉదయం శ్రీకారం జరిగింది. ఉదయం 9. 30 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని ప్రారంభించారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకోవడమే స్వస్తివాచనం. పారాయణీకులచే మూలమంత్ర, భాగవత, రామాయణ, వేద ప్రబంధ పారాయణములు గావించారు. విశ్వశాంతికై లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న వేడుకలలో విశ్వక్సేనారాధన, స్వస్త్తివాచనము ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 33 కోట్ల దేవతలు, పద్నాలుగు లోకముల సమస్తప్రాణకోటి, చరాచర జగత్తు అంతా భగవానుడి కటాక్షముతో శుభములు పొందాలని స్వస్తివాచన మంత్రములతో, విశ్వక్సేన ఆరాధనతో ప్రార్థించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆలయాన్ని విశేష పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. అర్చకులు స్వామి, అమ్మవారల విగ్రహాలను ఆలయం ముఖపమండపంలో ప్రత్యేక పీఠంపై ప్రతిష్టించి పూజలు చేశారు. అగ్నిదేవుడికి హోమం నిర్వహించారు. 


రక్షాబంధనం..

ఉత్సవంలో శ్రీవారికి, అమ్మవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం గావించి దీక్షపరులను చేయడం కోసం రక్షాబంధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పారాయణీకులు, రుత్వికులకు ఈవో గీత దీక్షావస్ర్తాలను అందజేశారు.  పూజించిన జలంతో అర్చకులు ఆలయ పరిసరాలను శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పంచామృత కలశాలకు వేదమంత్రాలతో దర్భాలు (గరక)లతో పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు. తిరువీధుల్లో వేదసూక్త మంత్ర పఠనములతో తీర్థ ప్రోక్షణ చేశారు. మంత్ర జలములను మూలవరులకు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రోక్షణ గావించారు. 


అంకురారోపణము,  మృత్సంగ్రహణము..

బ్రహ్మోత్సవాల్లో అంకురారోపణ, మృత్స్యంగ్రహణ వేడుకలను ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. మృత్తిక అనగా పుట్ట మన్ను. సర్వవిధ దోషములను తొలగించి సర్వవిధ సంపదలను అనుగ్రహించే తత్వాన్ని మృత్తికకు ఉండేవిధంగా భగవానుడు అనుగ్రహించినందున మృత్సంగ్రహణము గావించి పాలికలలో నవధాన్యాలతో క్షీరధారలతో నింపారు. ఉత్సవాలు ముగిసేంత వరకు నిత్యము ఆరాధనలు చేస్తారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, బట్టర్‌ సురేంద్రాచార్యులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఏఈవో జూశెట్టి కృష్ణాగౌడ్‌, పర్యవేక్షకులు బలరామ్‌సింగ్‌ యాదవ్‌, శంకర్‌నాయక్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


పాతగుట్టలో నేడు..

నేడు ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 8 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం జరుగుతాయి. 

VIDEOS

logo