శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Feb 05, 2020 , 00:06:52

నేడు గద్దెపై ఆసీనులు కానున్న సారలమ్మ

నేడు గద్దెపై ఆసీనులు కానున్న  సారలమ్మ

రాజాపేట: కొలిచిన వారికి కొంగుబంగారంగా నిలుస్తున్న వన దేవతల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం రాజాపేట మండలం చిన్న మేడారంలో భక్తుల సందడి నెలకొంది. తొలిరోజు కుర్రారం, బూర్గుపల్లి గ్రామాల మహిళలు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో  ఎల్లమ్మ దేవతకు  బోనాలు సమర్పించారు. పసుపు, కుంకుమ గాజులు, వడిబియ్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు.  

నేడు గద్దె పైకి సారలమ్మ.. 

కుర్రారం శివారులోని ఎదులగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల ఆరాధ్యదైవమైన  సారలమ్మను బుధవారం సాయంత్రం గద్దెపైకి తేనున్నారు. ఈ సమయంలో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారనుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి మేడారం తరహా గిరిజన సాంప్రదాయబద్ధంగా చిన్నమేడారంలోనూ పూజలు నిర్వహిస్తారు.

 కలెక్టర్‌ ప్రత్యేక పూజలు..

చిన్న మేడారంలోని వనదేవతలకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జయమ్మ, ఆలయ చైర్మన్‌ చింతల అంజయ్య, ప్రధాన కార్యదర్శి సంపత్‌, ఆలయ పూజారి ఐలమ్మ,  భక్తులు పాల్గొన్నారు. మరోవైపు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అడిషనల్‌ డీసీపీ మనోహర్‌, ఏసీపీలు నర్సింహారెడ్డి, యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య,  ఎస్సై శివకుమార్‌లు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 


logo