నేటి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

- స్వస్తివాచనంతో శ్రీకారం..
- 6న ఎదుర్కోలు, 7న తిరుకల్యాణం, 8న దివ్యవిమాన రథోత్సవం
- వైభవంగా నిర్వహిస్తాం : ఎన్.గీత, యాదాద్రి ఆలయ ఈవో
దాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఆర్తత్రాపారాయణుడు.. అనాథ రక్షకుడు.. పిలిస్తే పలికే దైవం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగే స్వస్తివాచనంతో మొదలు కానున్నాయి. 6 నుంచి విశేష ఉత్సవాలు మొదలవుతాయి. 6న అశ్వవాహన సేవలో ఊరేగిన అనంతరం ఎదుర్కోలు మహోత్సవం నిర్వహిస్తారు. 7న శ్రీవారి తిరుకల్యాణోత్సవం, 8న శ్రీవారి దివ్యవిమాన రథోత్సవం, 9న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 10న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ ఈవో గీత ఇప్పటికే పలుసార్లు సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణను ఏఈవో స్థాయి అధికారికి అప్పగించారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా సాగుతున్న అధ్యయనోత్సవాలు సోమవారం ముగిశాయి. చివరిరోజు స్వామివారు శ్రీలక్ష్మీనరసింహ అలంకారంలోని పురప్పాటు సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న పూర్వ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు కన్నుల పండువగా జరగనున్నాయి. పాతగుట్టగా దీనినే పూర్వగిరి నరసింహుని క్షేత్రంగా కూడా కొలుస్తారు. పిలిస్తే పలికే దైవం...కొలిచిన వెంటనే కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారం పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు పాతగుట్ట లో ఏకశిలను చీల్చుకుని కొలువుదీరి భక్తులను కరుణిస్తున్నారు. యాదాద్రికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. యాదాద్రికి రెండు కిలోమీటర్ల దూరంలో స్వయంభూ క్షేత్రంగా విలసిల్లుతున్న పుణ్యక్షేత్రంలో నేటికీ రుషులు, పీఠాధిపతులు ప్రతినిత్యం సేవిస్తూ తరిస్తున్నారు. ఏటా వారం రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. రక్షాబంధనం, ఆలయాన్ని, పరిసరాలను శుద్ధి చేసే శుద్ధి పుణ్యహవాచనం నిర్వహిస్తారు. ఉత్సవాల నిర్వహణకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిత్యం అర్చనలు, కల్యాణోత్సవాలు, శతనామార్చనలు, భోగములు, అష్టోత్తర శతఘటాభిషేకాలతో కళకళలాడే పాతగుట్ట ఆలయానికి పెళ్లిళ్ల దేవుడిగా పేరుంది.
పాత శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర మహత్యం..
పూర్వకాలంలో తపస్సునకు అనువైన స్థలాన్ని అన్వేషిస్తూ కొందరు మహర్షులు ఈ కొండగుహను చూసి పరమానంద భరితులయ్యారు. ఇక్కడ గల ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆనందించి తపస్సు చేశారు. ఈ ఆనవాళ్లు కొండగుహలో అక్కడక్కడ మనకు ఇప్పటికీ కన్పిస్తుంటాయి. మహర్షుల తపస్సుకు ఆర్తత్రాణపరాయణుడు, అనాథ రక్షకుడు, పిలిస్తే పలికే దైవమైన శ్రీఅఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఏకశిలను చీల్చుకొని ప్రత్యక్షమయ్యారు. తమ తపస్సును మెచ్చి వచ్చిన శ్రీస్వామి వారిని వివిధ స్తోత్రములతో స్తుతిస్తూ అర్చనాదులు నిర్వహించారు. ఆనాటి నుంచి ఈ నాటి వరకు శ్రీస్వామి వారికి అర్చనలు జరుగుతున్నాయి.
మహిమాన్వితం విష్ణుపుష్కరిణి..
ఇక్కడ విష్ణుపుష్కరిణి మహిమాన్వితమైంది. పుష్కరిణి నీరు కొండపైన రెండు శిలాఫలకాల నుంచి ధారగా సర్వకాల సర్వావస్థల్లో ప్రవహిస్తూ ఉంటుంది. తీర్థ పుష్కరిణిలో స్నానమాచరించిన వారికి భూత ప్రేత పిశాచాది గ్రహపీడలు, మానసిక వ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. పుష్కరిణి తీర్థం శ్రీస్వామి వారి మహత్యాన్ని వెల్లడిస్తూ భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్నది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని తరిస్తున్నారు.
విలీనం తర్వాత ఐదో ఉత్సవాలు..
పాతగుట్ట యాదాద్రి ఆధీనంలో ఉన్నప్పటికీ ఉత్సవాలు మాత్రం యాదాద్రికి సంబంధం లేకుండా జరిగేవి. గతంలో పాతగుట్ట నిర్వహణ విషయంలో యాదగిరిగుట్ట ఉద్యోగులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు యాదాద్రి నూతన ఆలయంలో పాతగుట్ట వీలీనమైంది. విలీనం తర్వాత ఐదోసారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయ ఉద్యోగులు అన్నీ తామై పాతగుట్ట ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈవో గీత ఇప్పటికే ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. ఏఈవో జూశెట్టి కృష్ణగౌడ్‌కు ఉత్సవాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.
ఉత్సవాలకు అతిథులు..
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొననున్నారు. ఉత్సవాల ఆహ్వాన లేఖలను దేవస్థానం ఏఈవో జూశెట్టి కృష్ణగౌడ్, సూపరిండెంట్ బలరామ్ల ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. ఇప్పటికే విశేష ప్రచారం చేసిన అధికారులు వీవీఐపీలకు లేఖలను అందించే పనిలో ఉన్నారు.
బ్రహ్మోత్సవ ఘట్టాలు..
- మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్తివాచనం, రక్షాబంధనం, పుణ్యహవాచనం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు అంకురార్పణ, మృత్సంగ్రహణం జరుగుతాయి.
- 5న బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణాలు, రాత్రి 8 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహిస్తారు.
- 6న గురువారం ఉదయం 8 గంటలకు హవనం, అలంకార సేవలు మొదలవుతాయి. శ్రీవారిని సింహవాహనంలో ఊరేగిస్తారు. రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం,
- 7న శుక్రవారం తిరుమంజన ఉత్సవము, హనుమంతవాహనములో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం అశ్వవాహనంపై ఊరేగింపు జరుగుతుంది. శ్రీవారి తిరుకళ్యాణమహోత్సవం 8గంటలకు జరుగుతుంది.
- 8న శనివారం గరుడవాహనంపై ఊరేగిస్తారు. రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరుగుతుంది.
- 9న ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం, రాత్రి 7 గంటలకు దేవతోద్వాసన, పుష్పయాగం, డోలారోహణం జరుగుతాయి. శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, సాయంత్రం 4 గంటలకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి.
వైభవంగా నిర్వహిస్తాం..
పాతగుట్ట అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాలను గతంలో కన్నా వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల విస్తృత ప్రచారం కోసం వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పంచుతున్నాం. దాతలకు, పురప్రముఖులకు, అధికారులకు కరపత్రాలు పంపిస్తున్నాం.
-ఎన్.గీత,యాదాద్రి ఈవో
తాజావార్తలు
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి