మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 01, 2020 , 23:36:29

పశుసంపద పెంపునకు ప్రాధాన్యం

పశుసంపద పెంపునకు ప్రాధాన్యం

రాజాపేట: పశుసంపద పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాజాపేట మండలం రాఘునాథపురంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, జియో ట్యాగింగ్‌ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూగజీవాల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 84 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా ఇస్తున్నామన్నారు. నెలరోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో రైతులు తప్పక పశువులకు టీకాలు వేయించాలని కోరారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. పాల ఉత్పత్తిలో జిల్లా నెం.1 స్థానంలో నిలువడం గొప్ప విషయమన్నారు. 

రాష్ట్రంలో పశుసంపద పెంపునకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  శనివారం రాజాపేట మండలంలోని రఘునాథపురంలో రాష్ట్రవ్యాప్తంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, జియో ట్యాగింగ్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. మూగజీవాల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.  రూ.కోట్లు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను  ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  ప్రతి పశువుకు విధిగా టీకాలు వేయించాలని కోరారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.  పశువుల టీకాలపై  రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పశువుల వివరాల కోసం జియో ట్యాగింగ్‌ తప్పని సరిగా చేయించుకోవాలన్నారు.  రైతు బిడ్డ సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసని, వారిని రాజులను చేయాలనే గొప్ప సంకల్పంతో అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. లీటర్‌ పాలకు రూ.4 ఇన్సెంటీవ్‌ అందించి పాడి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. 

పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే జిల్లా నెంబర్‌వన్‌ స్థానంలో నిలువడం అభినందనీయమన్నారు.  దేశం గర్వించదగిన పాలన అందిస్తున్న గొప్ప పరిపాలన దర్శకుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా  సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన  రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌, కేసీఆర్‌కిట్‌ వంటి ఆనేక పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడిగా మారానని.. త్వరలో తెలంగాణ కరువు నేల సస్యశ్యామలమై మరో కోనసీమగా మారడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడా ప్రభుత్వాలు ఆలయాలు నిర్మించి దాఖలాలు లేవని, మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కోట్లాది రుపాయాలు వెచ్చించి నిర్మించిన పవిత్ర పుణ్యక్షేత్రమై యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయమన్నారు.

పాడి పరిశ్రమతోనే జీవనోపాధి.. 

ఆలేరు ప్రాంతం పాడి పరిశ్రమకు పెట్టింది పేరని.. ఇక్కడి ప్రజలు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో పెద్దగా జలవనరులు లేక వరుస కరువుతో వ్యవసాయం కొనసాగకపోవడంతో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపారన్నారు. పాల ఉత్పత్తిలో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో నిలించిదన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాలల్లో గొర్రెల, చేపల మార్కెట్‌ యార్డులను ఏర్పాటు  చేయాలని మంత్రి తలసానికి కోరగా, త్వరలోనే మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 

అంతకు ముందు మంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ సుల్తానియా, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, పశుగణాభివృద్ధి చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, ఏడీ జీవి రమేశ్‌, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు తుంగ బాలు, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, ఎంపీపీ గోపగోని బాలమణీయాదగిరిగౌడ్‌, వైస్‌ ఎంపీపీ కాయితి శ్రీనివాస్‌రెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ బోళ్ల రాఘవరెడ్డి, సర్పంచ్‌ గాడిపల్లి శ్రవన్‌కుమార్‌, ఎంపీటీసీ బుడిగే రేణుకాపెంటయ్యగౌడ్‌, ఉపసర్పంచ్‌ పల్లె ప్రవీణ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, డైరెక్టర్లు అర్కాల గాల్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, గుర్రం నర్సింహులు, మండల పశువైద్యాధికారులు చంద్రారెడ్డి, వెంకన్న, సర్పంచ్‌లు బూర్గు భాగ్యమ్మ, నాగిర్తి గోపిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గొడుగు రాజు, ఠాకూర్‌ ధర్మేందర్‌సింగ్‌, ఎంపీటీసీలు జెల్ల భిక్షపతిగౌడ్‌, ఎడ్ల నరేశ్‌రెడ్డి, నాయకులు రామిండ్ల నరేందర్‌, రాసూరి నర్సయ్య, గుర్రం సిద్దిరాములు, కటకం జనార్దన్‌, కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్‌, సందిల భాస్కర్‌గౌడ్‌, మోత్కుపలి ప్రవీణ్‌, గుంటి కృష్ణ, సట్టు తిరుమలేశ్‌, పల్లె సంతోశ్‌గౌడ్‌, కటకం స్వామి, ఎర్రగోకుల జశ్వంత్‌, మహేందర్‌గౌడ్‌, గోపాల మిత్రలు, పశు మిత్రలు, రైతులు పాల్గొన్నారు.  

VIDEOS

logo