ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Feb 01, 2020 , 23:33:57

యాసంగి జోరు...

యాసంగి జోరు...
  • లక్ష్యాన్ని మించి ఆహార పంటల సాగు
  • ఈ యేడు 1,21,965 ఎకరాల్లో వరిసాగు
  • వరి సాధారణ విస్తీర్ణం 92,447 ఎకరాలు
  • ఆలస్యంగా కురిసిన వర్షాలతో వరిసాగుపై రైతన్నల దృష్టి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అంచనాలను మించి యాసంగి సీజన్‌లో పంటలు సాగయ్యాయి. ముఖ్యంగా రైతులు వరిని అధికంగా సాగు చేశారు. గతేడాది జిల్లా యాసంగి విస్తీర్ణం 92,447 ఎకరాలుండగా.. ఈ సంవత్సరం అంచనాలను మించి 1,21,965 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఇక ఈ సీజన్‌లో అన్ని పంటల సాగు విస్తీర్ణం 1,23,447 ఎకరాలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో విపరీతంగా వర్షాలు కురవడం.. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు అధికంగా వరి సాగుకే మొగ్గు చూపారు. మూసీ పరీవాహక ప్రాంతాలైన బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, రామన్నపేటలోనూ ఈ సారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. 


ప్రస్తుత యాసంగి సీజన్‌లో అంచనాలను మించి పంటలు సాగయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే రైతన్నలు యాసంగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్న రైతులు మరింత ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉన్నది. ఇదే విషయాన్ని వ్యవసాయాధికారులు ధ్రువీకరిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సాధారణ యాసంగి విస్తీర్ణం అన్ని పంటలు కలుపుకొని 1,23,447 ఎకరాలు సాగైనట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. వరి పంట గత యాసంగిని దృష్టిలో ఉంచుకుని 92,447 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు రూపొందించుకోగా.. దానికి మించి 1,21,965 ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో విపరీతంగా కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతోపాటు బోర్లు కూడా ఆగకుండా నీళ్లు పోస్తుండటంతో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మూసీనదీ పరీవాహక ప్రాంతంలో కూడా వరి సాగు చేసిన వారి సంఖ్య అధికంగా ఉన్నది. 


బీబీనగర్‌, పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, రామన్నపేటలోని కొన్ని గ్రామాల్లో మూసీనది పరీవాహక ప్రాంతం ఉండటంతో రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది. ఖరీఫ్‌ కన్నా యాసంగిలో పంటలు అధికంగా సాగు చేశారు. ఆహార ధాన్యాలు కూడా అధికంగానే సాగు చేశారు. మొత్తంగా ఆహారధాన్యాలను 37,060 హెక్టార్లలో సాగు చేస్తారని భావించగా, 48,800 హెక్టార్లు అంటే 1,22,000 ఎకరాల్లో సాగు కావడం విశేషం. శనగలు 92 హెక్టార్లలో సాగు చేస్తారని భావించగా.. 94 హెక్టార్లలో సాగు చేశారు. ప్రతి ఏటా యాసంగిలో వరిని వేసే కొంతమంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తారు. ఈ దఫా అందుకు భిన్నంగా వరి వైపునకు రైతులు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. మరో 8 నుంచి పది ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారులు లెక్కలు వేస్తున్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సకాలంలో ప్రభుత్వం అందిస్తుండటంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. ఖరీఫ్‌లో వరుణుడు కరుణించకపోవడంతో ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం యాసంగిమీదనే సారించారు.   


ఆరుతడి పంటలకు తప్పని ఇబ్బందులు..

ఆరుతడి పంటల కొంత వరకు దెబ్బతిన్నాయి. జొన్నలు, మినుములు,  ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పొగాకు, మిరప, ఉల్లి, ఇతర ఆహార పంటలు, ఆహారేతర పంటలు యాసంగిలో ఊహించని దానికన్నా తక్కువ సాగులోకి వచ్చాయి. వరి మాత్రమే అంచనాలను మించి అధికంగా సాగు చేశారు. వర్షాధార పంటలకు వరుణుడు షాక్‌ ఇచ్చినట్లయింది. వాణిజ్య పంటలు 827 హెక్టార్లలో వేయాల్సి ఉండగా.. కేవలం 383 హెక్టార్లలో వేశారు. ఎలాంటి సాగునీటి వనరులు లేని ఆలేరులో మాత్రం చెరువులు, కుంటలు రైతన్నలను ఆదుకుంటున్నాయి. 


సాగునీటి వసతి పెరగడంతో పెరిగిన విస్తీర్ణం : అనూరాధ, జిల్లా వ్యవసాయాధికారి 

జిల్లాలో నీటి వసతి పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.  చెరువులు, కుంటల్లోకి ప్రధానంగా అపార జలసంపద చేరుకోవడంతో భూగర్భజలమట్టం పెరిగింది. ఫలితంగా సాగునీరు అందుతుండటంతో  పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతం వల్ల ఐదు మండలాల్లో పంటల సాగులో ఊహించని విధంగా మార్పులు వచ్చాయి. రైతాంగానికి ఇది ఎంతో మేలు చేస్తున్నది. 


యాసంగిలో వరి సాగు మేలు : కుండె బీరయ్య, బాహుపేట

యాసంగిలో వరిసాగు ఎంతో మేలు చేస్తున్నది. ఆలస్యంగా వర్షాలు కురవడంతో చెరువులు కంటల్లోకి భారీగా వరద నీరు రావడంతో యాసంగికి ఢోకా లేదు. యాంత్రీకరణ పెరగడంతో ట్రాక్టర్లు ఎక్కువగా ఉపయోగించుకుని వ్యవసాయం చేస్తున్నాం. జాతీయ ఉపాధి హామీ పరిధిలోకి వ్యవసాయాన్ని తీసుకురాకపోవడంతో కూలీలు దొరకడం లేదు. అయినా ఉత్సాహంగా పనులు చేస్తున్నాం.

VIDEOS

logo