మెరవనున్న మున్సిపాలిటీలు

- ఇక అన్ని పురపాలికల్లో పరుగులు పెట్టనున్న అభివృద్ధి
- ఇప్పటికే రూ.25 కోట్లతో జిల్లా కేంద్రాన్ని సుందరీకరించే పనులు ప్రారంభం
- భువనగిరిలో రూ.150 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం ప్రతిపాదనలు
- ఆలేరు, యాదగిరిగుట్టలోనూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
- మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో కార్యాచరణ సిద్ధం
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పురపాలికల్లో ఇక అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడం.. కొత్త పాలకవర్గం కొలువు దీరడంతో ఇక జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు తయారు చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని పురపాలికల్లో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల వివరాలు తెప్పించుకుంటున్న కలెక్టర్ అనితారామచంద్రన్ ఇక వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా వార్డుల్లో మౌలిక వసతుల కల్పన, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలకు చరమగీతం పాడి పట్టణవాసులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ భావిస్తున్నారు. మరోవైపు భువనగిరి పట్టణ రూపు రేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రూ.25 కోట్లు విడుదల చేయించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన ఆలేరు, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు కాగా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీల్లో జోరుగా అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోనే అతిపెద్ద పురపాలిక అయిన భువనగిరి చారిత్రక ప్రాధాన్యత గలది కావడంతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర పభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడంలో కృతకృత్యులయ్యారు. భువనగిరి పట్టణాన్ని సుందరీకరించే పనులకు ఎన్నికల ముందే శ్రీకారం పలికిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 25 కోట్లు విడుదల చేయించారు. పట్టణంలోని ప్రధాన రోడ్డుపై డివైడర్ ఏర్పాటు చేసి దానిపై గ్రీనరీని పెంచే పనులు ప్రారంభించారు. ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయించారు. అంతేగాక తన సొంత నిధులను వెచ్చించి పురపాలికలో కలిసిన పలు గ్రామాలో ఫ్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు.
రూ.150 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం..
రూ.150 కోట్లతో భువనగిరి పురపాలిక పరిధిలోని అన్ని కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సందర్భంగా భువనగిరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే పైళ్ల సిద్ధమయ్యారు. పట్టణంలో అతి పెద్ద సమస్యగా భావిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కోసం రూ.150 కోట్లు అవసరమవుతాయని నిర్ధారణకు వచ్చారు. 35 కాలనీల్లో అండర్గౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్కు ఇక తిరుగుండదని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని నిరూపించేందుకు ఇప్పటికే ఓపెన్ జిమ్‌ను కూడా
గుట్ట అభివృద్ధికి ప్రభుత్వ విప్ నాంది..
నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు కాగా రూ.15 కోట్లకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో గత 40 ఏండ్లుగా ఎన్నో మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ప్రధానంగా పట్టణంలో నల్ల చెరువు నుంచి వెళ్లే కాలువ దుర్గంధభరితంగా మారింది. ఎక్కడికక్కడ కాలువ నీరు నిలుస్తుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నల్ల చెరువు నుంచి బీసీ కాలనీ వరకు కాలువ పునరుద్ధరణతో పాటు కాలువకు రిటైనింగ్ వాల్, రోడ్డుకు కల్వర్టును నిర్మించనున్నారు. ఇందుకు గానూ రూ. 6.74 కోట్ల నిధులు మంజూరు చేశారు. అంతేకాక యాదగిరిగుట్ట పట్టణంలోని పారిశుధ్యానికి రూ. 3.26 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో రూ. 59 లక్షలతో పట్టణంలో పుష్ప వాటర్ ప్లాంట్ హౌస్ నుంచి యాదగిరిగుట్ట ప్రధానరోడ్డుపై కల్వర్టు, శెట్టి మల్లయ్య ఇంటి వద్దకు నుంచి గుండ్లపల్లి గ్రామం హనుమాన్ దేవస్థానం వద్దకు మురికి కాల్వ నిర్మాణం చేపట్టనున్నారు.
గుండ్లపల్లి నుంచి రామచంద్రయ్య ఇంటి వద్ద నుంచి యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డు మీదుగా మురికి కాల్వ నిర్మించనున్నారు. మరో రూ.81 లక్షలతో ప్రభుత్వ హాస్టల్ భవనం నుంచి నల్లపోచమ్మవాడ బీసీ కాలనీ వరకు, రవీందర్‌రెడ్డి ఇంటి నుంచి బీసీ కాలనీ ప్రధాన కాలువ వరకు, ఆంబేద్కర్ భవనం నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు, బూడిద స్వామి ఇంటి నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు, డొంగు నరేందర్ ఇంటి నుంచి నల్లపోచమ్మ వాడ రవీందర్‌రెడ్డి ఇంటి వరకు మురికి కాల్వను నిర్మించనున్నారు. రూ.97 లక్షలతో పాత గుట్ట వాహన పార్కింగ్ నుంచి చిన్న కాల్వ వరకు, రూ.89 లక్షలతో లోటస్ టెంపుల్ నుంచి పాత గుట్ట కల్వర్టు వద్ద గల శివ కిరాణం షాపు వరకు, పాత గుట్ట నుంచి కల్వర్టు శివ కిరాణం షాపు నుంచి పాత గుట్ట గుండా గుండ్లపల్లి చెరువు వరకు కాలువ పనులు చేపట్టనున్నారు.
రూ. 5.30 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం..
యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్ల రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో మరిన్ని సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని ప్రతి వీధుల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ. 2.0 కోట్లతో యాదగిరిపల్లి మసీదు నుంచి ప్రభుత్వ బాలికల హాస్టల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రూ. 2.0 కోట్లతో యాదగిరిపల్లి గ్రామం నుంచి ఎస్సీ కాలనీ వరకు, రూ. 1.30 కోట్లతో పుష్పలత వాటర్ ప్లాంట్ నుంచి యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డు వరకు, ఆరె రామచంద్రయ్య ఇంటి నుంచి యాదగిరిగుట్ట ప్రధాన రోడ్డు వరకు, శెట్టి మల్లయ్య ఇంటి నుంచి గుండ్లపల్లి గ్రామ వరకు, బూడిద స్వామి ఇంటి నుంచి విద్యుత్ సబ్ స్టేషన్, యాదగిరిపల్లి గ్రామంలో పోచమ్మ దేవాలయం లైన్ వరకు అంతర్గత రోడ్లను నిర్మించనున్నారు.
ఆలేరు అభివృద్ధికి మార్గం సుగమం..
ఆలేరు పట్టణంలో రూ.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఒక్కోక్కటి కార్యరూపంలోకి వస్తుండంటంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆలేరు పట్టణంలో అండర్ డ్రైనేజీ, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, వార్డులలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైటింగ్, ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీరు, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, సర్వీస్‌రోడ్డు, యువకులకు సెట్విన్ ద్వారా టెక్నికల్ శిక్షణ, యువతులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా చిన్న తరహా పారిశ్రామిక యూనిట్, పోటీ పరీక్షలకు వీలుగా లైబ్రరీ, సామాజిక కులస్తులకు కమ్యూనిటీ భవనాలు, ఆసరా ఫించన్లు, ఆలేరు ఏరియా ఆసుపత్రిలో 20 పడకల నుండి 50 పడకలకు పెంచి 24 గం.లు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారిపై బట్టర్ఫ్లై లైటింగ్ వ్యవస్థ, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, శిథిలమైన సీసీ రోడ్లను మరమ్మత్తులు చేయడం, వీధులలోని మురికి కాల్వలను ఆధునీకరించాలనే ప్రజల కోర్కెలను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పూర్తయిన పనులు..
పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న అండర్‌డ్రైనేజీ పనులు 20 శాతం పూర్తి అయ్యాయి. ఎస్సీ, బీసీ కాలనీలలో 100 శాతం సీసీ రోడ్లు, మురికి కాల్వలు పనులు పూర్తయ్యాయి. బస్టాండ్, రైల్వేగేటు, తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ఏరియా దవాఖాన సమీపంలో డయాలసిస్ సెంటర్ నిర్మాణం పనులు 60 శాతం పూర్తి కాగా, సంతోషిమాత దేవాలయం నుంచి కనకదుర్గా దేవాలయం వరకు రూ.1కోటి 60 లక్షల వ్యయంతో చేపట్టిన సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు 50 శాతం పూర్తయ్యాయి. ప్రభుత్వ భవనాలు రూ.1 కోట్లతో ఎంపీడీవో, రూ.60 లక్షలతో వ్యవసాయ భవనం, వ్యవసాయ మార్కెట్లో రూ.3 కోట్లతో గోదాంల నిర్మాణం, రూ.3 కోట్లతో మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాల ఏర్పాటు, రైల్వేగేటు అండర్‌పాస్ బ్రిడ్డికి రూ.5 కోట్లు మంజూరు, రూ.1.70 కోట్లతో జూనియర్ కళాశాల ఏర్పాటు జరిగాయి.
పోచంపల్లి అభివృద్ధికి బాటలు..
గ్రామీణ పర్యాటక కేంద్రంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేనేత వస్త్ర ఉత్పత్తితో పేరెన్నికగన్న పోచంపల్లి అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. మున్సిపాలిటీగా మార్చితేనే అభివృద్ధి చెందుతుందన్న భావనలో ఉన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పట్టుపట్టి సాధించారు. పోచంపల్లిలో ఇప్పటి వరకు కేవలం 40 శాతం సీసీ రోడ్లు పూర్తి అయ్యాయి. పోచంపల్లి పెద్ద చెరువును ఆనుకోని భువనగిరి రోడ్డు వరకు బైపాస్ రోడ్డు ఏర్పాటుతో పాటు పోచంపల్లిలోని అయ్యప్ప దేవాలయం నుంచి వినోభాబావే మందిరం వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్తోపాటు డివైడర్ ఏర్పాటు చేస్తే పోచంపల్లి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. పోచంపల్లిలో అధునాతన మున్సిపాలిటీ భవనం ఏర్పాటుతో పాటు క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం,వ్యాయామ శాల కూడా ఏర్పాటు చేస్తే యువతకు ఎంతగానో తోడ్పాటుగా ఉంటుంది. ముఖ్యంగా చేనేత పరిశ్రమ మనుగడకు పోచంపల్లికి వచ్చి వెళ్లే పర్యాటకులకు అతిథి గృహాలు ఏర్పాటు చేయడంతోపాటు చేనేత వస్త్ర వ్యాపారానికి విస్తృత ప్రచారం కల్పించాలి.
చౌటుప్పల్‌లో ఇవి చేపడితే...
గ్రామపంచాయతీగా ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో చౌటుప్పల్, తంగడపల్లి, లక్కారం, తాళ్లసింగారం, లింగోజీగూడెం గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న చౌటుప్పల్..మరికొన్ని అభివృద్ధి పనులు చేస్తే ఇంకా ముందుకు పోతుందనే అభిప్రాయలు వ్యకమవుతున్నాయి. ప్రధానంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని ప్రజలనుంచి విజ్ఙప్తులు అందుతున్నాయి. ఇప్పటికే చాలా కాలనీల్లో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయగా..మరి కొన్ని కాలనీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. పట్టణంలోని గాంధీపార్క్‌లో రూ.రెండు కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందని భావన వ్యక్తమవుతున్నది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటయితే చాలా మందికి ఉపాధి దొరకడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. కాంప్లెక్స్ వెనకభాగంలో మినీ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. హెచ్ఎండీఏ నుంచి రూ. 20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు విడుదలైతే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. ఆయా గ్రామాల్లో మిగిలిపోయిన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు వీలుకల్గుతుంది. ఇప్పటికే దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో మియావాకి ద్వారా చిట్టడవులు అభివృద్ధి జరుగుతుంది. మున్సిపాలిటీలోని గ్రామాల్లో సైతం దివీస్ మియావాకి అభివృద్ధి చేస్తే గ్రామాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయి.
మోత్కూరు మున్సిపాలిటీలో...
మోత్కూరు మున్సిపాలిటీ ఇక అభివృద్ధి చెందనున్నది. ఇందుకోసం ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ రూ.20 కోట్లు మంజూరు చేయించారు. మరీముఖ్యంగా పట్టణంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యకు మోక్షం కలుగనున్నది. పట్టణంలోని పద్మశాలి కాలనీ, డైవర్స్ కాలనీ, అన్నెపు వాడ, కొండగడపలోని జంగాల కాలనీ, జామ చెట్లబావి, కొండాపురం, రాజన్నగూడెం, ధర్మాపురం, బుజిలాపురం, అంగడి బజార్లో తీవ్ర నీటి ఎద్దడి తొలగనున్నది. ఇక గత ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేప్పటినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి. పురపాలికను అభివృద్ధి చేయడం.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే గాదరి కిషోర్ కృషి చేస్తున్నారు.