నిప్పుతో చెలగాటమాడుతున్న కోమటిరెడ్డి

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : సీపీఎం కార్యాలయంతోపాటు, కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాను నిప్పుతో చలగాటమాడుతున్నాననే విషయం గుర్తుంచుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు హెచ్చరించారు. మహిళా కౌన్సిలర్ అనే విషయం మరిచి దండ హిమబిందుపై దాడి చేయడాన్ని పరికిపంద చర్యగా అభివర్ణించారు. సీపీఎం కార్యాలయం, పార్టీ కౌన్సిలర్ల్లు, వారి ఇండ్లపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కబడ్దార్.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి కబడ్దార్.. అంటూ నినదించారు. అంతకుముందు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కాంగ్రెస్ సీపీఎం భవనాన్ని, ఫర్నిచర్‌ను, సీపీఎం కౌన్సిలర్ గోపగోని లక్ష్మణ్ ఇంటిని పరిశీలించారు. వారు కూల్చేవేసిన సీపీఎం దిమ్మను పరిశీలించారు. అనంతరం గోపగోని లక్ష్మణ్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. గతంలో ఎంపీగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన స్థాయి మరిచి రౌడీలా దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఆయన గూండాయిజానికి చరమగీతం పాడుతామని హెచ్చరించారు. సీపీఎం కార్యకర్తలు లేని సమయంలో ఇండ్లు, పార్టీ కార్యాలయంపై దాడులు చేయించిన ఎమ్మెల్యే... తమ కార్యకర్తలు ఉంటే సీపీఎం దెబ్బ రుచిచూసే వాడని తెలిపారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
దాడులకు సీపీఎం ఎప్పటికీ భయపడదని, తమ పార్టీ పుట్టిందే అరచాకశక్తుల ఆటకట్టించేందుకన్నారు. ఎన్నికల్లో మిత్రధర్మాన్ని మరిచిన ఎమ్మెల్యే సీపీఎం కౌన్సిలర్లను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించి మిత్రద్రోహం చేశాడని తెలిపారు. చైర్మన్ ఎన్నిక కోసం బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని.. తమను రమ్మనడం సమంజసమా అని ప్రశ్నించారు. ఏ పార్టీలో కొనసాగుతున్నాడో? తనకే స్పష్టతలేని ఎమ్మెల్యే ‘పుస్తె ఒకరితో.. సంసారం మరొకరితో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని కాషాయీకరణ చేసేందుకు ఎమ్మెల్యే తీవ్రప్రయత్నం చేశాడని తెలిపారు. మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్న బీజేపీతో సీపీఎం ఎన్నటికీ పొత్తు కట్టదని, అలా అపవిత్ర పొత్తుతో కూటమి కడుతున్న పార్టీలతో కలిసి పనిచేయదని స్పష్టం చేశారు. చైర్మన్ ఎన్నికలో బీజేపీ పొత్తు కట్టేందుకు సిద్ధమైన ఆయనతో.. సీపీఎం కలువలేదని, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్కు మద్దతు తెలిపామని తెలిపారు. గుండాలా వ్యవహరిస్తూ సీపీఎం కార్యాలయంపై దాడి చేయించిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. సీపీఎం కార్యాలయంపై దాడిచేయడాన్ని ఖండించారు.
రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి..
పార్టీ ఫిరాయింపులు, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయంపై, పార్టీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డ ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరించాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా తుంగులో తొక్కుతూ దాడులకు పాల్పడ్డ రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికే మాయనిమచ్చ తెచ్చాడని తెలిపారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో..? ఇవ్వద్దో..? అనే స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందన్నారు. సీపీఎం నాయకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పెత్తనమేంటని ప్రశ్నించారు. మాతోనే ఉండాలని, మాకే మద్దతు చెప్పాలి, లేకపోతే దాడులకు పాల్పడుతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పరస్పర అవగాహనతో ముందుకు పోవాలని చెప్పిన ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించి మిత్రద్రోహం చేశాడని తెలిపారు. తమ పార్టీ కౌన్సిలర్లను ఓడించి.. సీపీఎం లేకుండా చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడని మండిపడ్డారు. ఆయన చేసిన ద్రోహం వల్ల 6 స్థానాలు గెలువాల్సిన సీపీఎం మూడు స్థానాలకే పరిమితమయిందన్నారు. వారితో తాము ఎప్పుడూ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపై చర్చించలేదని స్పష్టం చేశారు. చైర్మన్ ఎన్నిక కోసం బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇవ్వదని తేల్చిచెప్పామని తెలిపారు.
మతతత్వ రాజకీయాలను ఎండగడుతూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వం లాంటి బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపామన్నారు. రౌడీయిజం చేసిన ఎమ్మెల్యే సీపీఎం కార్యాలయం, దిమ్మెలు, కౌన్సిలర్ల ఇండ్లపై దాడికి దిగడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి నాయకత్వంలో స్వైరవిహారం చేస్తూ.. కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఎమ్మెల్యే, జడ్పీటీసీలపై పోలీస్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో సీపీఎం యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా కార్యదర్శులు ఎండీ.జహంగీర్, మదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి, మున్సిపాలిటీ వైస్‌చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్, దండ హిమబిందు, ఎండీ.పాషా, రొడ్డ అంజయ్య, చీరిక సంజీవరెడ్డి, గోశిక కరుణాకర్, దండ అరుణ్‌కుమార్, బత్తుల విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం