సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 27, 2020 , 05:47:34

ప్రగతి పరుగులు

ప్రగతి పరుగులు
  • జిల్లాలో స్ఫూర్తివంతమైన అభివృద్ధి
  • గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • టీఎస్‌ఐపాస్‌ ద్వారా 319 పరిశ్రమల స్థాపన విద్యాశాఖలో వినూత్న విజయాలు
  • మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా మారడం ఖాయం

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ:  జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. ఆదివారం భువనగిరిలోని  ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆమె జాతీయజెండా ఎగురవేసి మాట్లాడారు. అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడిన  జిల్లా అన్ని రంగాల్లో ముందుకుసాగుతుందన్నారు. జిల్లాలో“ విద్యా, వైద్య, పారిశ్రామిక, నీటిపారుదల రంగాల్లో గుణాత్మకమైన మార్పు కన్పిస్తున్నది.ఇదే విధంగా ముందుకు సాగినైట్లెతే మరి కొద్ది ఏండ్లలోనే ఆదర్శవంతమైన జిల్లాగా మారడం ఖాయమని” చెప్పారు. రాష్ట్ర రాజధాని సరిహద్దులు గల జిల్లాకు పెట్టుబడులు అపూర్వంగా వస్తున్నాయన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 319 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో రూ. 2, 215 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. చౌటుప్పల్‌ మండలంలోని మల్కాపురంలో 435 ఎకరాల్లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు స్థాపించుకుని మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పారు. రూ.1, 552 కోట్లతో 450 పరిశ్రమలు స్థాపించేందుకు ప్లాట్లు కేటాయించామన్నారు. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందన్నారు. టీ- ప్రైడ్‌ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 42 షెడ్యూల్డ్‌ కులాల వారికి రూ.  కోటి 36 లక్షలు, 44 మంది షెడ్యూల్డ్‌ తెగల వారికి రూ. 88 లక్షలు మరియు దివ్యాంగులకు రూ. 67వేలు మంజూరు చేసినట్లు తెలిపారు.  


విద్యాశాఖలోవినూత్న విజయాలు 

విద్యాశాఖలో వినూత్నమైన ప్రగతి కన్పిస్తున్నదని కలెక్టర్‌ చెప్పారు. 22, 222 మంది విద్యార్థులకు నిఘంటువులు పంపిణీ చేయడం ద్వారా వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ప్రపంచ రికార్డుగా నమోదైందని చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వృద్ధి చేసేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించగా 283 ప్రదర్శనల్లో  15 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయని చెప్పారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా బొమ్మలరామారం మండలం జలాల్‌పూర్‌ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థిని దక్షిణ భారత దేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైందన్నారు. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 6 గురుకులాలు, 6 ఆదర్శ పాఠశాలల్లో 4313 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. 54, 257 మంది విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్‌ అందజేశామని చెప్పారు. విద్యార్థులకు కనీస సామర్థ్యాల పెంపు కోసం ‘నేను సాధిస్తా’ అనే కార్యక్రమంతో ‘ఉన్ముఖ’ అనే పేరుతో ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బోధనలో మార్పు కోసం నిష్ట పేరుతో 2, 442 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. 


వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం 

జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె తెలిపారు. జిల్లాలో 2019-20 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో  39, 403 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, పప్పు దినుసులు, నూనె పంటలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా 1, 45, 920 రైతులకు  రూ. 187 కోట్ల 48 లక్షలు అందజేశామన్నారు. రైతు బీమా పథకం ద్వారా 714 మంది రైతుల కుటుంబాలకు రూ. 35, 70, 000  చెల్లించడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ పథకం ద్వారా 1, 05, 646 మంది రైతులకు పెట్టుబడి కింద  రూ. 63 కోట్ల 38 లక్షలు రైతుల ఖాతాలో జమచేశామన్నారు. జిల్లాలో 4, 102 టన్నుల వివిధ రకాల సబ్సిడీ విత్తనాలను, 6587 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సరఫరా చేశామన్నారు.   ఉద్యావనశాఖ ద్వారా 1396 ఎకరాల్లో కూరగాయల సాగును పెంచామని చెప్పారు. శిక్షణ ద్వారా సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులను ప్రోత్సహించి 4926 ఎకరాలకు సాగు పెంచే విధంగా అధికారులు ప్రణాళికలు సన్నద్ధం చేశారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక నిధుల నుంచి రూ. 56 కోట్ల 19 లక్షలను గ్రామ పంచాయతీలకు విడుదల చేసినట్లు చెప్పారు. రూ. 31 కోట్ల 11 లక్షలతో 321 వైకుంఠధామాలు, 216 డంపింగ్‌ యార్డులు, 1529 రైతులకు  5, 24, 000 టేకు మొక్కలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 


జిల్లాలో గ్రామ పంచాయతీ పారిశుధ్యం కోసం ఏడు ట్రాక్టర్లు దాతల ద్వారా, 58 ట్రాక్టర్లు గ్రామ పంచాయతీల నుంచి కోలుగోలు చేశామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఇప్పటి వరకు 2, 32, 000  మందిని పరీక్షించడంతో పాటు క్షయవ్యాధిగల వారికి రూ. 500 చొప్పున 393 మందికి రూ. 8,  23, 000  అందజేస్తున్నట్లు చెప్పారు. 152 మంది ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు, 449 మంది బోధ వ్యాధిగ్రస్తులకు పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2019 ఆగస్టు నుంచి  నేటి వరకు 1620 మంది బాలింతలకు కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. సిజేరియన్‌ ప్రసవాలను 82 నుంచి 44 శాతం వరకు తగ్గించామన్నారు. ఎయిమ్స్‌లో ఆగస్టు నుంచి 50 మంది విద్యార్థులతో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు జరుతున్నాయని, త్వరలో ఓపీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా కోసం రూ. 220 కోట్లతో అంతర్గత పైపులైన్‌ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 845 చెరువుల నిర్మాణం పనులు పూర్తి చేశామని తెలిపారు. మోత్కూర్‌ బీటీ రోడ్డును రూ. 35 లక్షలతో నిర్మాణం  జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్యాకేజీ-15,16 ద్వారా కాల్వలు, రిజర్వాయర్ల కొరకు 3498 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. కాల్వల తవ్వకం 34 కిలోమీటర్ల మేరకు పూర్తయిందన్నారు.  59 గ్రామాల్లో 3339 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నదని చెప్పారు. కళ్యాణలక్ష్మి ద్వారా 3144 మందికి రూ. 30 కోట్ల 77లక్షలు,  షాదీముబారక్‌ ద్వారా 195 మందికి  రూ. కోటి 86 లక్షలు లబ్ధి పొందారని చెప్పారు. 


2019-20 ఖరీఫ్‌ సీజన్‌లో 140 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 9వేల 104 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించి  రూ. 349 కోట్లను   25, 376 మంది రైతుల ఖాతాలో జమచేశామన్నారు. పాడి పశువుల పంపిణీ పథకం ద్వారా 6573 పాడి పశువులు పంపిణీ జరిగిందని వివరించారు. 7.5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తితో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. గొర్రెల పంపిణీలో 16, 538 యూనిట్ల ద్వారా రూ. 206 కోట్లతో పంపిణీ చేయగా, 2, 91, 000  గొర్రె పిల్లలు వృద్ధి చెందాయన్నారు. జిల్లాలో 28 పశువైద్య కేంద్రాల మరమ్మతులకు రూ. 77 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. మత్స్యశాఖ ద్వారా 122 పారిశ్రామిక సంఘాలతో 8300 మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారన్నారు. 357 చెరువుల్లో 2 కోట్ల 15 లక్షల చేపపిల్లలు, 2, 41, 000 రొయ్యలను విడుదల చేశామన్నారు. చేనేత, జౌళిశాఖ ద్వారా వ్యక్తిగత రుణాలను 2420 మంది కార్మికులకు అందించామని,  రూ. 8, 56, 00, 000  రుణమాఫీ లబ్ధిపొందారని చెప్పారు. 17 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ. 4, 40, 00, 000 క్రెడిట్‌ రూపంలో మంజూరు చేసినట్లు చెప్పారు. బతుకమ్మ పండుగకు మహిళలకు 2, 50, 000 చీరెలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 70 లక్షల మొక్కలను వివిధ ప్రాంతాల్లో  నాటించామన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి పథకం ద్వారా 2019-20లో 22, 83,  512 పనిదినాలు కల్పించి రూ. 47. 61లక్షలు అందజేసినట్లు చెప్పారు. రూర్బస్‌ పథకం ద్వారా చౌటుప్పల్‌ మండలంలో రూ. 13 కోట్ల 50 లక్షలతో 214 పనులు జరుగుతున్నాయన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 4279 సంఘాలకు  రూ. 161 కోట్ల 77 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. స్త్రీనిధి పథకం ద్వారా 1880 సంఘాలకు రూ. 51, 68, 000 రుణం మంజూరైందని చెప్పారు.


మెప్మా ద్వారా ఆరు మున్సిపాలిటీల్లో లింకేజీ విధానంలో రుణాలు 

మెప్మా ద్వారా ఆరు మున్సిపాలిటీల్లో 403 సంఘాలకు బ్యాంకు లింకేజీ విధానంలో రూ. 20, 68, 000, స్త్రీనిధి ద్వారా 345 సంఘాలకు రూ. 5 కోట్ల 69 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. 123 సదరమ్‌ క్యాంపుల ద్వారా 5, 000 మంది దివ్యాంగులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందన్నారు. ఆసరా పథకం ద్వారా 93, 784 మందికి రూ. 22 కోట్ల 77లక్షలు, ఈ సంవత్సరం 4014 మందికి కొత్త పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనముల ద్వారా 4413 మందికి  రూ. 8 కోట్ల 43 లక్షలు, ప్రీ మెట్రిక్‌ ద్వారా 1943 మందికి రూ. 19 లక్షల 70 వేలు విడుదలయ్యాయని చెప్పారు. షెడ్యూల్‌ కులాల నిరుద్యోగ డ్రైవర్‌ యువతకు ఎంపవర్‌మెంట్‌ స్కీం ద్వారా రూ. 3 కోట్ల 8 లక్షలు, 60 శాతం సబ్సిడీతో మంజూరైనట్లు వెల్లడించారు. 1622 గిరిజన విద్యార్థులకు  ఉపకారవేతనాల కింద రూ. కోటి 67 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. జిల్లాలోని  99, 721 మంది రైతులకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పారు. వలిగొండ మండలంలో రూ. 2, 64, 000తో నూతన ఉప విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు, వంతెనలు, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం  రూ. 380 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. యాదాద్రి దేవాలయ పునరుద్ధరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. భక్తుల కోసం  కొండపైకి మిషన్‌ భగీరథ పథకం ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల  తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. టెంపుల్‌ సిటీలో నూతన విద్యుత్‌ ఉప కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 


 ప్రతిష్టాత్మకంగా పోలీసింగ్‌

రాచకొండ పోలీసు ఫ్రెండ్ల్లీ పోలీసు విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ మన రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న గృహాలపై షీటీంలు, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసు, ఐసీడీఎస్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌, ఇతర శాఖల సహకారంతో దాడులు నిర్వహించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ గ్రామాల్లో 7,635 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసుశాఖ ప్రతి నెలలో మూడు సార్లు కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా అధికారులు, ఉద్యోగులు, శాంతిభద్రతలు పరిరక్షిస్తున్న పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.  


ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసాపత్రాలు

జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి టీ. వెంకట్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి టీ. రాంచందర్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారి సంజయ్‌కృష్ణ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కే. సత్యనారాయణతో పాటు వివిధ శాఖల్లో  పని చేస్తున్న 207 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  జేసీ రమేశ్‌, ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

VIDEOS

logo