సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 28, 2020 , 02:19:03

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రిలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారు లు తీరిన భక్తులతో సముదాయాలు. మొక్కు పూజల తో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెల వు కావడంతోపాటు గణతంత్ర దినోత్సవం, కొమురవెల్లి మల్లన్న, మేడారం జాతర్లకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో  ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. అర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. 


హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన అళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం  అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. 


వైభవంగా వ్రత పూజలు ..

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.1,00,000 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తులు భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు. 


శ్రీవారి ఖజానాకు రూ.16,90,307 ఆదాయం..

శ్రీవారి ఖజానాకు రూ.16,90,307 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.2,98,958, రూ.100ల దర్శనంతో రూ.11,100, రూ.150ల దర్శనంతో రూ.2,25, 000, కల్యాణకట్ట ద్వారా రూ.56,000, వ్రత పూజ ల ద్వారా రూ.1,00,000, ప్రసాద విక్రయాలతో రూ.5,92,000, శాశ్వత పూజల ద్వారా రూ.16, 116, టోల్‌గేట్‌ ద్వారా రూ.2,110, అన్నప్రసాదంతో రూ.5,370, వాహనపూజల ద్వారా రూ.24, 500, ఇతర విభాగాలతో రూ.3,32,921 తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.16,90,307 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

VIDEOS

logo