ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 26, 2020 , 00:11:10

‘లక్కీ’ చైర్మన్‌ సావిత్రమ్మమేఘారెడ్డి

‘లక్కీ’ చైర్మన్‌ సావిత్రమ్మమేఘారెడ్డి
  • - లాటరీ పద్ధతిలో చైర్మన్‌ అభ్యర్థిని అదృష్టం వరించింది
  • - తీవ్ర ఉద్రిక్తత నడుమ రీకౌటింగ్‌ నిర్వహించిన అధికారులు
  • - ఫలితం కోసం పోరాడి ఓడిన కాంగ్రెస్‌

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రమ్మమేఘారెడ్డికి లాటరీ పద్ధతిలో అదృష్టం వరించింది. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు నుంచి పోటీ చేసిన సావిత్రమ్మమేఘారెడ్డికి శనివారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో 378 ఓట్లు పోలయ్యాయి. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బద్ధం నాగార్జున్‌రెడ్డికి 377 ఓట్లు రావడంతోపాటు పోస్టల్‌ ఓటు ఒకటి పోలు కావడంతో ఆయనకు 378 ఓట్లు పోలైనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రిటర్నింగ్‌ అధికారులు రీకౌటింగ్‌ నిర్వహించారు. వారికి మళ్లీ సమానంగా ఓట్లు వచ్చినట్లు ధ్రువీకరించిన అధికారులు అభ్యర్థుల అభిప్రాయం మేరకు లాటరీ పద్ధతి నిర్వహించారు. వారి పేరున ఐదు చొప్పున చీటీలు రాసి లాటరీ నిర్వహించారు. ఈ విధానంలో టీఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రమ్మమేఘారెడ్డి పేరు వెలువడి అదృష్టం వరించింది. మున్సిపల్‌ చైరపర్సన్‌ జనరల్‌ మహిళ కావడంతో టీఆర్‌ఎస్‌ అమెను ముందుగానే చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికను టీఆర్‌ఎస్‌ మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ.. ఫలితం అనుకూలంగా వచ్చే వరకు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉత్కంఠతకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సావిత్రమ్మమేఘారెడ్డి ఎన్నికను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ ఎన్నో ఎత్తులు.. జిత్తులు వేసి పావులు కదిపింది. వార్డు పరిధిలో ఆయా పార్టీలకు చెందిన వారు 8 మంది  అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే పోటీ ఏర్పడి ఎన్నికల ఫలితం ఉత్కంఠతకు గురిచేసింది. లాటరీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సావిత్రమ్మ మేఘారెడ్డి గెలుపొందడంతో ఆపార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థి పల్లపు సమ్మయ్యకు 213 ఓట్లు, ఎండీ గాలిబ్‌ (టీడీపీ)కి 12, బీజేపీ అభ్యర్థి వెల్లంకి సంజీవరెడ్డికి 4 ఓట్లు, మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు మారుపాక వెంకటేశ్‌కు 12, పుచ్చకాయల లోకేందర్‌రెడ్డి, చాడ మంజులకు ఒకటి చొప్పున ఓట్లు పోలయ్యాయి.


VIDEOS

logo