మంగళవారం 02 జూన్ 2020
Yadadri - Jan 24, 2020 , 04:51:38

విజయంసై ధీమా!

విజయంసై ధీమా!
  • -బాక్సుల్లో భవితవ్యం
  • -లెక్కల్లో బిజీగా అభ్యర్థులు
  • -వార్డుల వారీగా పోలింగ్‌పై విశ్లేషణ
  • -రేపటితో వీడనున్న ఉత్కంఠ
  • -కౌంటింగ్‌ ఏర్పాట్లలో
  • -అధికార యంత్రాంగం

మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమైంది. నాలుగు వారాలుగా బిజీబిజీగా ప్రచారంలో గడిపిన అభ్యర్థులు గెలుపోట ములపై లెక్కలేసుకుంటున్నారు. తమ వార్డుల్లో తామే గెలుస్తామంటూ ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే  పార్టీ  నేతలతో  కలిసి ఓ అంచనాకు వస్తున్నారు.  ఫలితంగా అందరిలోనూ టెన్షన్‌ నెలకొన్నది. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 103 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆయా వార్డుల్లో 433 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరంతా ఈ నెల 25న నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ :  ఎవరి లెక్కలు వారివి...గులాబీ గుబాలింపుపై ఎలాంటి అనుమానం లేకపోయినా పురపోరులో బరిలోకి దిగిన అభ్యర్థులు కూడికలు తీసివేతలకు శ్రీకారం పలికారు. ఫలితంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. పోలింగ్‌ అనంతరం పార్టీలు, అభ్యర్థులు వార్డుల వారీగా నమోదైన ఓట్లపై విశ్లేషణ చేపట్టాయి.  ఆయా పార్టీల్లో  విజయాలపై ధీమా వ్యక్త పరుస్తున్నారు.  తమ పార్టీకి ఎన్ని వార్డులు వస్తాయనే అంచనాల్లో మునిగిపోయారు. అయితే అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో ఉండడంతో ఈ నెల 25న నిర్వహించే ఓట్ల లెక్కింపు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో 103 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆయా వార్డుల్లో 433 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక అసలు ఫలితం ముందుండటంతో అభ్యర్థుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. తమ వార్డుల్లో తామే గెలుస్తామంటూ ఎవరికివారు అంచనాకు వచ్చారు. ఇప్పటికే వారి వారి పార్టీ శ్రేణులతో లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తం తమ వార్డుల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. కులాల వారీగా ఓటర్ల లెక్కలను కూడగట్టుకుని, తమకు మద్దతుగా వేసిన ఓట్ల లెక్కలను అంచనా వేసుకుంటున్నారు. 
బరిలో 433 మంది అభ్యర్థులు..
జిల్లాలోని మొత్తం ఆరు మున్సిపాలిటీల్లోని 103 వార్డుల్లో 433 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో ఆలేరు మున్సిపాలిటీల్లో 52 మంది అభ్యర్థులు, భువనగిరిలో 161 మంది, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో 75 మంది, భూదాన్‌పోచంపల్లిలో 52 మంది, మోత్కూరులో 45 మంది,  యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 48 మంది బరిలో నిలిచారు. మొత్తం అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో ఉండటంతో గెలుపుపై మరింత ఉత్కంఠగా ఉన్నారు. 
బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం..
మున్సిపాలిటీ ఎన్నికల ముగిసిపోవడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ బాక్సులను భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో  ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలించి  భద్రపరిచారు. ఈ నెల 25న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో అభ్యర్థులు పూర్తిగా తమ ఫలితాలపైనే ఎదురుచూస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నారు. వారివారి వార్డుల్లో జరిగిన పోలింగ్‌ శాతంపై లెక్కలు వేశారు.
ఆశలపల్లకీలో..
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎంతో పాటు ఇండింపెండెంట్‌, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం అభ్యర్థుల గెలుపుకోసం సర్వశక్తులొడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేశారు. దీంతో ఓటర్ల ఆదరణ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో నెలకొన్నది. అభ్యర్థులు, వారి అనుచరులు కూడికలు, తీసివేతల్లో మునిగిపోయారు. 
గెలుపు అంచనాల్లో టీఆర్‌ఎస్‌..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు, స్థానిక ఎమ్మెల్యేలు చేపట్టిన పట్టణాల అభివృద్ధి కార్యక్రమాలు కలిసొస్తాయని టీఆర్‌ఎస్‌ పార్టీ లెక్కలు వేస్తున్నది. గురువారం భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి,  మోత్కూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి లెక్కలు వేశారు. ఫలితాల్లో ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని ధీమాతో ఉన్నారు. 
కౌంటింగ్‌ కోసం అధికారుల కసరత్తు ..
కౌంటింగ్‌ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన పనులు ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి...  కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వాల్సిన సూచనలపై ఆమె సమీక్షించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం ప్రక్రియను పూర్తి చేశారు. 25న పకడ్బందీగా కౌంటింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు.  
logo