శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 24, 2020 , 04:51:38

కొండమడుగు కొత్తకొతగా..

కొండమడుగు కొత్తకొతగా..బీబీనగర్‌ : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ సత్ఫలితాలిస్తున్నది. ఓ ఉద్యమంలా సాగి గ్రామాల రూపురేఖలు మార్చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి గ్రామంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు ముందుకొచ్చి ఈ మహోన్నత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మరీ ముఖ్యంగా రెండో విడుత పల్లె ప్రగతి బీబీనగర్‌ మండలం కొండమడుగులో దిగ్విజయంగా సాగింది. సర్పంచ్‌, ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, యువజన సంఘాలు, పంచాయతీ అధికారులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. రాజకీయాలకతీతంగా ప్రతిరోజూ గ్రామస్తులు ఏదో ఒక అభివృద్ధి పనిలో పాలుపంచుకొని తమ వంతు సహకారాన్ని అందించారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రతతో పాటు నర్సరీ, డంపింగ్‌ యార్డు, శ్మశానవాటిక, యువకులకు క్రీడాస్థలం, పార్కు నిర్మాణాలపై సర్పంచ్‌ లతారాజేశ్‌బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి పనులను ప్రారంభించారు.

జరిగిన అభివృద్ధి ఇదీ..

-నూతనంగా నర్సరీని ఏర్పాటు చేసి అందులో బోరు వేయించారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బెంచీల ఏర్పాటుతో పాటు వివిధ రకాల మొక్కలను నాటారు. మొక్కల సంరక్షణకు సీసీ కెమెరాలను అమర్చారు.
- డంపింగ్‌ యార్డు కోసం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి దాతల సహాయంతో బోరు వేయించి నిర్మాణ పనులను మొదలుపెట్టారు. నూతన శ్మశానవాటికకు గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డును వేయించారు. శ్మశానవాటికకు షెడ్డును నిర్మించనున్నారు. మృతదేహాలను దహనం చేయడానికి ఎలక్ట్రికల్‌ పరికరాలను అమర్చేందుకు ప్రత్యేక గదిని నిర్మించనున్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా బోరు కూడా వేయించి, స్నానాల గదులను నిర్మించారు.
-హరితహారంలో భాగంగా ఎచ్‌ఎండీఏ పరిధిలోని నర్సరీల నుంచి పెద్ద సైజు మొక్కలను కొనుగోలు చేసి కేపాల్‌, కొండమడుగుమెట్టు, బొమ్మలరామారం రహదారుల్లో రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా మొక్కలను నాటారు. వాటి సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం, సాయత్రం మొక్కలకు నీరు పోయడానికి దాత దేశం అశోక్‌గౌడ్‌ ట్రాక్టర్‌ ట్యాంకర్‌ను కొనుగోలు చేసి ఇచ్చారు.
-గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణకు గ్రామ పంచాయతీ నిధులతో 10 రిక్షా సైకిళ్లను ఏర్పాటు చేశారు. చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ఉల్సి జగదీశ్‌, ప్రసాద్‌ సోదరులు ట్రాక్టర్‌ ట్రాలీని కొనుగోలు చేసి ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్‌ ఇంజన్‌ కోనుగోలు చేశారు.
- గ్రామంలో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీ తదితరుల దాతల సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేలా కృషి చేశారు. క్రీడలకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో తడి, పొడి చెత్తబుట్టలను అందజేశారు. పందుల బెడద తీవ్రత సమస్యగా మారడంతో వాటికోసం ఊరి బయట ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. గ్రామంలో పురాతన బుర్జులు కనుమరుగవకుండా దాత పీఏసీఎస్‌ చైర్మన్‌ వాకిటి సంజీవరెడ్డి దాదాపు రూ.3.5లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. గ్రామంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారిని ఉచితంగా దవాఖానకు తరలించేందుకు గ్రామ పరిధిలోని విజయలక్ష్మి స్పింటెక్స్‌ పరిశ్రమ వారు అంబులెన్స్‌ను కొనుగోలు చేసి ఇచ్చారు.

గ్రామ పరిశుభ్రతకు పాటుపడుతాం..

దాతల సహకారం మరువలేనివి..


గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆర్థికంగా తోడ్పాటునందించిన దాతల సహకారాలు మరువలేనివి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలను అందజేయడం అభినందనీయం. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులందరి ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టగలిగాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
- సలీం, పంచాయతీ కార్యదర్శి

ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం..

మండలంలోనే కొండమడుగు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం. పార్టీలకతీతంగా గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతోపాటు, దాతల సహకారంతో గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసుకోగలిగాం. గ్రామ ప్రగతిని సాధించే విషయంలో పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
    - రంగ కృష్ణవేణిగోపాల్‌ గౌడ్‌

VIDEOS

logo