సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 22, 2020 , 00:27:36

జాన్ ఉర్సుకు వేళాయే

జాన్ ఉర్సుకు వేళాయే


మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్ హడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23  నుంచి ప్రారంభం కానున్నాయి. 24 న అత్యంత ప్రధాన ఘట్టం గంథోత్సవం జరుగనుంది. వక్ఫ్ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఉర్సుకు వచ్చే భక్తులు జాన్ దర్శించుకునే ప్రదేశాల
గురించి తెలుసుకుందాం.

గొల్లభామ కథ

మత ప్రచారం సందర్భంగా జరుగుతున్న యుద్ధంలో ఒక గొల్ల భామ నెత్తిన బుట్టపెట్టుకొని,  రావిపహడ్ గ్రామం   పాలు అమ్మకోవడానికి వాడపల్లి వెళ్తూ అటు వైపు వచ్చింది. ఆమె యుద్ధ భూమి వైపు చూస్తూ వెళ్తుండగా ఆమెకు సైదులు బాబా ఆమెతో ‘ఇక నువ్వు వెనక్కి చూడకుంగా వెళ్లిపో.. ఒకవేళ వెనక్కి చూస్తే అక్కడే శిలవైపోతావు’అని హెచ్చరించగా బాబా ఆదేశం మేరకు గొల్ల భామ ముందుకు సాగి తర్వాత ఆసక్తిగా వెనుక ఏమి జరుగుతుందోనని వెనక్కి తిరిగి చూడగా వెంటనే శిల్పంగా మారిందని, దీన్ని ప్రస్తుతం గొల్లభామ గుట్టగా పిలుస్తారని ప్రచారంలో ఉంది. ఇక్కడికి వచ్చిన  భక్తులు  దీన్ని దర్శించుకొని కోరికలు కోరుకొని రాయిని విసిరి వెళ్తారు.

సిపాయి బాబా(తాళాలస్వామి)

సైదులు బాబాకు అంగరక్షకుడిగా ఉండే సిపాయిబాబా మత ప్రచారంలో భాగంగా జరిగిన యుద్ధంలో సైదులు బాబాతో పాటే చనిపోయాడు.  దీంతో సిపాయి బాబా దగ్గర కూడా మొక్కులు చెల్లించాలని పూర్వీకులు అంటుంటారు. అయితే సిపాయిబాబాకు ఒక విశిష్టత ఉంది. ఇక్కడ మనస్సులో కోరికలు కోరుకొని సమాధి చుట్టూ ఉన్న గ్రిల్స్ తాళం వేసి వెళ్తే ఆ కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన అనంతరం దర్గా దగ్గరికి వచ్చి బాబాకు మెక్కులు చెల్లించి తాళం తీసేస్తారు. అందుకే ఆయన్ను తాళాల స్వామిగా పిలుస్తారు.

ఐదు పహాడ్

జాన్ పాటు పరిసర ప్రాంతాల్లో మరో నాలుగు పహాడ్ల పేరుతో నాలుగు గ్రామాలున్నాయి. అవి గుండ్ల పహాడ్, శూన్యపహాడ్, గణేశ్ రావిపహాడ్, ఈ ఐదు పహాడ్ పంచ భూతాలకు సాక్ష్యంగా నిలుస్తాయని భక్తుల నమ్మకం. ఒకే ప్రాంతంలో పహాడ్ కలిగి 5 గ్రామాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకం.

గంథోత్సవం ..

ఉర్సులో ప్రధానంగా గంథోత్సవం చేస్తారు. దీన్ని ఉర్సులో రెండోరోజు జరుపుతారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన గంథాన్ని గ్రామానికి తీసుకొచ్చి సందల్ ఉంచి అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి దర్గాలోని సమాధుల వద్ద  ఉంచుతారు. ఈ సమయంలో భక్తులు గంథం అందకోవడానికి పోటీ పడుతారు. కొన్ని సమయాల్లో తొక్కిసలాటలు, ఉద్రిక్త పరిస్థితులు సైతం ఏర్పడుతుంటాయి. ఈ గంథాన్ని తాకినా దీన్ని ఇంటికి తీసుకెళ్లినా మంచిదని భక్తుల అపార నమ్మకం.

కందూరు..

జాన్ దర్గాలో కోరిన కోర్కెలు తీరితే, బంధు మిత్రులందరినీ పిలిచి అదే దర్గా వద్ద స్థాయిని బట్టి మేక, గొర్రెపోతులు, కోళ్లను బలిచ్చి దావత్ చేస్తారు. దీన్నే కందూరు అంటారు. బలిచ్చే జీవాలకు స్నానం చేయించి, ముస్తాబు చేసి దర్గా చుట్టూ మూడుసార్లు ఉరేగించి హలాల్ చేయించి అనంతరం సఫాయి బావి నీటితో వండి మూడు ఇస్తరాకుల్లో వడ్డించి డప్పు చప్పుళ్ల మధ్య దర్గాలో దేవుడికి నైవేద్యం పెడతారు. దీనినే ఫాతేహగా పిలుస్తారు.

దర్గా చరిత్ర

సుమారు 400 సంవత్సరాల క్రితం మద్రాస్ రాష్ట్రంలో నాగర్ గ్రామంలో వెలసిన నాగూర్ ఖాదర్ దర్గా విశిష్టతను పక్క రాష్ట్రంలో ప్రచారం చేయదలిచి జాన్ సైదా, మొహినుద్దీన్ అనే భక్తులు నాగూర్ గొప్పతనం చాటుతూ ఉరూరా తిరిగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారని, దీంతో జాన్ సైదా, మొహినుద్దీన్  జాపకార్థం వజీరాబాద్ రాకుమారుడు దర్గాను నిర్మించారని కథనం ఉంది. దర్గాలో వీరిద్దరి సమాధులు ఉంటాయి. వీటికి నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు.

సఫాయి బావి

దర్గాకు వచ్చే భక్తులు నీటి ఇబ్బందులు ఎదుర్కుంటుండగా భూపతి రాజు శేషారెడ్డి కలలోకి సైదులు బాబా వచ్చి గుర్రపు డెక్కలు ఉన్న చోట బావిని తవ్వించమని చెప్పాడని, వెంటనే ఆ ప్రదేశంలో బావిని తవ్వించారని అదే సఫాయి బావిగా పేరొందిందని అక్కడివారు అంటారు. భక్తులు ఈ బావి నీటితో పుణ్య సాన్నాలు ఆచరిస్తారు.  సఫాయి బావి  నుంచి తీసుకున్న నీళ్లతో వంటలు వండి దేవుడికి ప్రసాదాలు అందచేసేవారు. ఈ బావి నీటితో స్నానం చేస్తే మానసిక ఆందోళనలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.  నీటిని పంట పొలాలపై చల్లుకొంటే అధిక దిగుబడులు వస్తాయని పరిసర ప్రాంతాల ప్రజలు అంటుంటారు.

నాగేంద్రుడి పుట్ట, నిత్యం వెలిగే దీపం

దర్గా లోపలికి వెళ్లే కుడి వైపు వెలసిన నాగేంద్రుడి పుట్ట భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పుట్టలో పాలు పోయడం అనేది హిందూ సాంప్రదాయం. ఇక్కడికి ముస్లింల కంటే హిందువులే అధికంగా వస్తుంటారు. దర్గాకువచ్చే ప్రతీ మహిళ  హిందు, ముస్లిం అనే బేధాభిప్రాయం లేకుండా పుట్టలో పాలు, గుడ్లు పెట్టి వెళ్తుంటారు. సంతానం లేనివారు ఈ పుట్ట దగ్గర పూజలు చేసి సైదులు బాబాను నమ్ముకుంటే సంతానం కలుతుంది భక్తుల నమ్మకం.

చెంతనే కృష్ణా నది..

దర్గాకు సమీపంలో  మహంకాళీగూడెం వద్ద కృష్ణానది ప్రవహిస్తుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పక్క రాష్ర్టాల  నుంచి పుట్టీల మీద, పడవల్లో సైదులుబాబా దర్శనానికి భక్తులు వస్తుంటారు.


VIDEOS

logo