శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 20, 2020 , 23:55:11

నిరంతరం పల్లెప్రగతి చేపట్టాలి

నిరంతరం పల్లెప్రగతి చేపట్టాలిబొమ్మలరామారం: నిరంతరం పల్లెప్రగతి చేపట్టాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ అన్నారు. సోమవారం మండలంలోని నాగినేనిపల్లి, మైలారం గ్రామాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.  30 రోజుల పల్లెప్రణాళిక, రెండో విడుత పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పల్లె సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను గ్రామాల్లో నిరంతరాయంగా చేపట్టాలన్నారు. దాతల సహాయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పారిశుధ్యం పనులను పకడ్బందీగా చేపట్టి గ్రామాలను తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఇంటింటికీ వస్తున్నాయా..లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  ప్రతి ఇంటిలో తడిపొడి చెత్త బుట్టలు ఉండాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో జరిగిన పెయింటింగ్‌ , హరితహారంలో భాగంగా వీధుల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకునేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో కలియతిరిగి కూలగొట్టిన పాత ఇండ్లు, నర్సరీ ఫెన్సింగ్‌ ఏర్పాట్లు, చెత్త డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. వైకుంఠధామాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి,తొందరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్న పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేసి సర్పంచులను అభినందించారు. మైలారం గ్రామపంచాయతీకి స్థానిక స్టోన్‌ క్రషర్‌ యజమాని రామిడి జంగారెడ్డి విరాళంగా అందజేసిన నూతన ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు.   కార్యక్రమంలో నాగినేనిపల్లి సర్పంచ్‌ బట్కీర్‌ బీరప్ప, మైలారం సర్పంచు వడ్లకొండ అరుణాఆనంద్‌చారి, మండల ప్రత్యేకాధికారి జ్యోతికుమార్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో శేషాద్రి, ఎంపీవో గీతారెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎన్‌ఆర్‌జీఎస్‌ పుష్ప, అమర్‌నాథ్‌, పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నర్సింహ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.


VIDEOS

logo