శుక్రవారం 29 మే 2020
Yadadri - Jan 20, 2020 , 23:53:46

యాదాద్రి పనుల జాప్యంపై ఆగ్రహం

యాదాద్రి పనుల జాప్యంపై ఆగ్రహం


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి  ఆలయ విస్తరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రిలో జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ జి. కిషన్‌రావు, ఈఎన్సీలు ఘణపతిరెడ్డి, రవీందర్‌రావు, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌,  ఆర్కిటెక్టు ఆనందసాయి, ఆలయ ఈవో ఎస్‌. గీత, కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పర్యటించి చేసిన సూచనల మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయమై ఆయన సమీక్షించారు. సీఎం వస్తేనే తప్ప పనులు నిర్ణీత సమయం ప్రకారం నిర్వహించరా? ఇదేమి బాధ్యతారాహిత్యం....సంక్రాంతి పండుగకు తమిళనాడుకు వెళ్లిన శిల్పులు తిరిగి ఇంకా విధుల్లో చేరకపోవడమేమిటి? ఇది కరెక్టు కాదు అంటూ సంబంధిత ఇన్‌చార్జీలపై మండిపడ్డారు. శిల్పుల వల్ల పనులు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం జరుగకుండా పోతున్నాయి.

సీఎం చెప్పిందేమిటి మీరు చేస్తున్నదేమిటి అంటూ  ప్రధాన స్థపతి, ఆర్కిటెక్టులు ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి.... ప్రపంచమంతా గమనించే విధంగా పనులు జరుగుతుండగా వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యమేలా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆలయం పనులు పూర్తయినందున భక్తుల వసతుల కోసం జరుగాల్సిన పనుల విషయంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  గిరిప్రదక్షిణ రోడ్డుతో పాటు రింగ్‌ రోడ్డు పనులను మరింత వేగవంతంగా జరిగేలా చూడాలని కోరారు.  బస్సుల ద్వారా సులువుగా భక్తులు కొండపైకి చేరాలంటే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ వసంతనాయక్‌, ప్రధాన స్థపతి డాక్టర్‌ ఆనందాచార్యులవేలు, ఇంజినీరింగ్‌ నిపుణుడు మధుసూదన్‌  పాల్గొన్నారు.    


logo