బుధవారం 03 జూన్ 2020
Yadadri - Jan 20, 2020 , 02:46:10

పోలియోను తరిమేద్దాం

పోలియోను తరిమేద్దాం
  • - కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
  • - జిల్లాలో 59, 542 మందికి పోలియో చుక్కలు వేసిన అధికారులు
  • - 99 శాతం లక్ష్యాన్ని చేరుకున్న వైద్య సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : పోలియోను తరిమేసేందుకు ప్రతి ఒక్కరూ  వైద్య సిబ్బందికి చేయూతను అందించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు.  ఆదివారం జిల్లా కేంద్రంలోని దవాఖానలో డీఆర్‌డీఏ పీడీ ఉపేందర్‌రెడ్డి మనవరాలు మోక్షకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పోలి యో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలియో చుక్కల కార్యక్రమాన్ని దేశవ్యా ప్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు  బాధ్యతాయుతంగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కండరాలు బలహీనమై పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసే పోలియో పట్ల అప్రమత్తత అవసరమన్నారు. జిల్లా వైద్యాధికారి సాంబశివరావు మాట్లాడుతూ...కడుపులో ప్రవేశించే క్రిములు రక్తంలో ప్రవేశించి నరాలల్లో జీవకణాలను బాధిస్తాయని అందువల్ల నాడి మం డలం దెబ్బతిని కదల్చడానికి వీలు లేకుండా కండరాలు బిగుసుకుంటాయని చెప్పారు. పోలియో వైరస్‌ నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.  జిల్లాలో మొత్తం 500 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 60,336 మందికి పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 59, 542 మందికి వేశామని చెప్పారు. 50 మంది సూపర్‌వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారని,  20 మొబైల్‌ టీములను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో లీలావతి,  వైద్యాధికారులు డాక్టర్‌ జయలక్ష్మి డాక్టర్‌ వంశీకృష్ణ, డాక్టర్‌ రాజేందర్‌, డాక్టర్‌ రామయ్య, అంజయ్య,కృష్ణ, సాయిరెడ్డి, మనోహర్‌, యాదగిరిగుట్ట వైద్యసిబ్బంది మంజులత, ఈశ్వర్‌, రాణి  పాల్గొన్నారు.

పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం...

 ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో సర్పంచ్‌ వంటేరు సువర్ణతో కలిసి చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కలు వేసి పోలియోను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పోలియోరహిత సమాజం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని, దీనికి మనందరం భాగస్వామ్యం కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్‌ వాటికి అమృత, కిష్టయ్య, వార్డు సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, హెల్త్‌ అసిస్టెంట్‌ మంజులత, మమత   పాల్గొన్నారు.

 

గ్రామాల్లో పల్స్‌ పోలియో..

యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో పల్స్‌ పోలియో ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం ఆయా  గ్రామాల్లో పోలి యో కేంద్రాలు ఏర్పాటు చేసి 0-5 సంవత్సరాల  చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాహుపేట లో ఎంపీపీ చీర శ్రీశైలం, వైద్యాధికారి వంశీకృష్ణ, సర్పంచ్‌ కుండే పద్మనర్సయ్య పోలియో చుక్కలు వేశారు.

ప్రచారంలో భాగంగా...

భువనగిరి అర్బన్‌: పట్టణంలోని 35వ వార్డులో ఆదివారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చిన్నారికి పోలియో చుక్కులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో బారి నుంచి పిల్లలను రక్షించుకోవడానికి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఎలాంటి అపోహాలు నమ్మకుండా పిల్లలకు పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, మాజి మున్సిపల్‌ నువ్వుల ప్రసన్న సత్యనారాయణ, సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  
logo