ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 13, 2020 , 00:27:21

వార్‌ వన్‌ సైడే..

వార్‌ వన్‌ సైడే..
  • - ఉత్సాహంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • -టికెట్‌ దక్కితే గెలువడం ఖాయమనే ధీమా
  • - టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పలువురి ఆసక్తి
  • -ఇప్పటికే కొలిక్కి వచ్చిన అభ్యర్థుల ఎంపిక
  • - రెబల్స్‌కు బుజ్జగింపు
  • - సీఎం కేసీఆర్‌ పథకాలే పరమావధిగా ప్రచారం
  • - పొత్తుల కోసం పాకులాడుతున్న విపక్షాలు

పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల వరకు గెలుపు టీఆర్‌ఎస్‌దే. మున్సిపల్‌ పోరులోనూ అదే  పునరావృతమవుతుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో విజయం నల్లేరు మీద నడకలాగే కనిపిస్తున్నది.  దీనికి రెండు రోజులుగా గులాబీ తరుఫున దాఖలైన నామినేషన్లే నిదర్శనం. జిల్లాలో 719 నామినేషన్లు దాఖలు కాగా టీఆర్‌ఎస్‌ తరుఫున అభ్యర్థులే 225 మంది ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 104 వార్డులకు  సంబంధించి అభ్యర్థుల ఎంపికకు చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, మాజీ ఎంపీ బూర, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  బీఫారాలను అందుకున్నారు. ఈనెల 14న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉండటంతో ప్రజాప్రతినిధులు బీఫాంలను అందజేసే పనిలో పడ్డారు.     -యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ:  పురపోరు ఎన్నికల్లో ప్రధాన ఘట్టాలతో ముగింపు పలికిన ఎన్నికల అధికారులు ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు పరిశీలించిన అధికారులు దాదాపుగా అన్ని సరైనవిగా గుర్తించారు. జిల్లాలో అధికశాతం టీఆర్‌ఎస్‌ నుంచే నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 719 నామినేషన్లకు టీఆర్‌ఎస్‌ నుంచి 225 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.  దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే   జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో గులాబీజెండా ఎగురడం ఖామయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మునుగోడు మినహా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలకు మంచి పట్టు ఉండడంతోపాటు టీఆర్‌ఎస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఎలా చూసినా ప్రజలంతా కారుకే పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. కొన్ని వార్డుల్లో గట్టిపోటీ ఉన్నా అంతిమంగా పీఠంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆసీనులు కానున్నట్లు పార్టీ వర్గాల అంచనా. ఇప్పటికే జిల్లాలోని ఆయా వార్డుల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. గులాబీ పార్టీని ఓడించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా విపక్షాలకు ఓటమి తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తే గెలిచినట్లే..

టీఆర్‌ఎస్‌ చరిష్మా ముందు ఏ పార్టీ నిలదొక్కుకోలేక పోతున్నది. శాసనసభ ఎన్నికల్లో  ప్రజలు తిరుగులేని తీర్పును ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆదే తీర్పు ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు పెరిగిన నమ్మకం, సీఎం కేసీఆర్‌ వ్యక్తిత్వం, జనాకర్షణ.. ఇలా ఎన్నో విషయాలు గులాబీ పార్టీకి  పట్టం కట్టడానికి కారణమవుతున్నట్లు తెలుస్తున్నది. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి, పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మోత్కూరులో గాదరి కిశోర్‌కుమార్‌, చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు , నిధులు మంజూరు చేయించడం వంటివి టీఆర్‌ఎస్‌ గెలుపునకు మార్గం సుగమం చేస్తున్నాయి. ముఖ్యంగా రూ. 2000 కోట్లతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్యాత్మికత వైభవం సంతరించుకోవడం, చౌటుప్పల్‌లో ఐటీ పార్కు, భువనగిరి బస్వాపూర్‌ జలాశయం వంటి ప్రధానాంశాలు టీఆర్‌ఎస్‌ గెలుపుకు బాటలు వేస్తున్నాయి.  టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తే చాలు వార్డు కౌన్సిలర్‌గా గెలిచినట్లే అనే ధీమాతో నేతలు ఉన్నారంటే పార్టీకి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు ప్రజలను దగ్గర చేశాయి. జిల్లాలోని ఆరు  మున్సిపాలిటీల్లో 104 వార్డులకు పోటాపోటీగా టీఆర్‌ఎస్‌ టికెట్లు అడుగుతున్నారు. జిల్లాలో మొత్తం నామినేషన్లు 719 దాఖలు కాగా 225 నామినేషన్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే దాఖలు చేశారు. ఇక మిగతా పార్టీల  నామినేషన్లు  కేవలం 150లోపే రావడం గమనార్హం.  

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి..

ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ వరకు పార్టీ బీ ఫారాలు దాఖలు చేసే అవకాశం ఉంది. కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు సైతం రెండో సెట్‌ టీఆర్‌ఎస్‌  పేరుతో నామినేషన్లు వేశారు.  ఈ క్రమంలో తమకు బీ ఫారం ఇస్తే టీఆర్‌ఎస్‌లో చేరడానికి వివిధ పార్టీల నేతలు దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది.  అయితే ఎన్నికల వేళ పార్టీలోకి వెళ్తే టికెట్‌ వస్తుందో.. రాదో అనే అనుమానంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న వారు ఉన్నారు. కొంతమంది  టికెట్‌ రాకున్నా టీఆర్‌ఎస్‌లో చేరడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌ రాష్ట్ర యువజన విభాగం నాయకులు తమ అనుచరులతో ప్రభుత్వ విప్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. భవిష్యత్‌లో రాజకీయ పదవులను పొందవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దాదాపుగా ఖారారయ్యారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు తమ తమ బీ ఫారాలను ఎన్నికల అధికారులకు అందించాల్సిన నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీ  బీ ఫారాలను అందజేస్తున్నారు.

అసంతృప్తులకు బుజ్జగింపుల పర్వం

జిల్లాలోని  ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరునున్నాయి. ఆయా స్థానాల్లో టికెట్‌ కోసం ఆశావహులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నారు. అధికార పార్టీ టికెట్‌ ఇస్తే చాలు గెలుపొందవచ్చనే గట్టి నమ్మకంతో ఉన్నా టీఆర్‌ఎస్‌లో పోటీ ఎక్కువగానే ఉంది. దీంతో టికెట్‌ ఎవరికి ఇవ్వాలో అర్థంకాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో  స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని వారికి సముదాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ ఆదేశాలిచ్చారు. రాబోయే రోజుల్లో వారికి సముచ్చిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రెబల్‌ అభ్యర్థులు పోటీని విరమించేలా ప్రయత్నాలు చేసి, రాబోయే ఎన్నికలు అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని ఆయా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు కేటీఆర్‌ సూచనలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుజ్జగింపు పనిలో పడ్డారు. నామినేషన్ల ఘట్టం ముగిసి విత్‌డ్రాలకు ఒకరోజే గడువు ఉండడంతో ఎమ్మెల్యేలు  రంగంలోకి దిగి నామినేషన్లు వేసిన వారితో రహస్య మంతనాలు జరుపుతున్నారు. కొందరు అందుబాటులో లేకపోవడంతో ఇండ్లకు వెళ్లి మరీ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కో ఆప్షన్‌ సభ్యులు, సింగిల్‌ విండో పదువులు, ఇంకా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇచ్చే నామినేటెడ్‌ పదువుల్లో ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. దీంతో రెబల్‌ అభ్యర్థులు మెత్తబడుతున్నారు. అధికార పార్టీని వీడటానికి కొందరు ఇష్టపడడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇచ్చిన హామీలను కొందరు వెనుకడుగు వేస్తుండగా, మరికొందరు స్వచ్ఛందంగా తప్పుకుంటామని చెబుతున్నారు.  

ఎమ్మెల్యే వద్ద బీ ఫాంలు..

మోత్కూరు మున్సిపాలిటీ మినహా  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన బీ ఫారాలు ఎమ్మెల్యేలు తమ వద్దనే ఉంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలకు దిశానిర్దేశం చేసి వారికి బీఫారాలు అందించారు. వెంటనే అభ్యర్థులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న వార్డుల్లో బీ ఫారాలు అందజేశారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల్లో బీఫారాలను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌  ఆదివారం అందజేశారు. ఇక మిగతా మున్సిపాలిటీ పరిధిలో కొందరిని బుజ్జగించి మిగతా వారికి  బీఫారాలు అందిస్తామని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి రెండు రోజుల కిందటే నియోజకవర్గ కేంద్రాలకు చేరుకున్న ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వారికి, పనులు చేసే వారికే ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో వారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొందరు రెబల్స్‌ను బుజ్జగించి, అసంతృప్తిగా ఉన్న ఆశావహులను బుజ్జగించిన తర్వాత బీ ఫారాలు ఇవ్వాలని ఎమ్మెల్యే భావిస్తున్నారు. వార్డుల వారీగా జరిగిన సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసినా 14 వరకు బీ ఫారాలు సమర్పించేందుకు గడువు ఉండడంతో పార్టీ అభ్యర్థుల జాబితా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాత్రం నామినేషన్ల విత్‌ డ్రా గంట ముందు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కేసీఆర్‌ పథకాలే పరమావధిగా ప్రచారం..

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను ఇంటింటి చెబుతూ ఓట్లను అడుగాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇంటింటా ప్రచారం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలే మరమావధిగా ప్రచారం సాగుతున్నది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు స్వయసహాయక ప్రోత్సాహకాలు, మిషన్‌భగీరథ, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌, మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక వసతులు కల్పనకు  ఒక్కో మున్సిపాలిటీకి  రూ. 20 కోట్ల నిధులు విడుదల వంటి అభివృద్ధి పనులు ఇంటింటికీ  తిరిగి ప్రచారం చేస్తున్నారు.

పొత్తుల కోసం పాకులాట

నామినేషన్లు విత్‌ డ్రా చేసుకునే వీలున్న నేపథ్యంలో పలు ప్రతిపక్ష పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ను సొంతంగా ఎదుర్కోలేక విపక్ష పార్టీలు ఏకం కావడానికి చర్చలు జరుపుతున్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దే అని తెలిసి కూడా విపక్షాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీలు పొత్తులు పెట్టుకోగా భువనగిరి, పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఆయా పార్టీలు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి.

VIDEOS

logo