e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు బృహత్‌ వన సంకల్పం

బృహత్‌ వన సంకల్పం

బృహత్‌  వన సంకల్పం

ప్రతి మండలంలో10 ఎకరాల్లో మెగా పార్కుల ఏర్పాటు
పచ్చదనంతోపాటు ఆహ్లాదాన్ని పెంపొందించేలా చర్యలు
యాదాద్రి మోడల్‌ ఫారెస్టు నమూనాలో అడవుల సృష్టి
ఒక్కో పార్కులో 31 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక
ఇప్పటికే జిల్లాలోని 17 మండలాల్లో స్థలాల గుర్తింపు

యాదాద్రి భువనగిరి, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యానికి శ్రీకారం చుట్టింది. యాదాద్రి మోడల్‌ ఫారెస్టు తరహాలో అడవులను సృష్టించి పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు ఆహ్లాదాన్ని పెంచేలా మండలానికో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పది ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా.. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మెగా పార్కులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రూ.40లక్షలతో ఏర్పాటు చేసే బృహత్‌ ప్రకృతి వనాల్లో 31వేల మొక్కలను పెంచనుండగా.. వాకింగ్‌ ట్రాక్‌తోపాటు, పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. జిల్లాలోని17 మండలాల్లో ఇప్పటికే స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. బృహత్‌ ప్రకృతి వనాలకు కార్యరూపం ఇచ్చే దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

జిల్లాలోని 17 మండలాల్లోనూ మండలానికి ఒకటి చొప్పున బృహత్‌ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 సంవత్సరంలో చేపట్టనున్న హరితహారంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. చౌటుప్పల్‌ వద్ద ఉన్న తంగేడు వనం వద్ద యాదాద్రి మోడల్‌ ఫారెస్టులో భాగంగా సహజ సిద్ధమైన అడవిని సృష్టించగా ఇది సత్ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే విధానాన్ని అవలంబించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రతి పంచాయతీలో ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లో మొక్కలను పెంచి చిన్నపాటి అడవులను సృష్టించారు. ఇదే స్ఫూర్తితో మరింత విస్తీర్ణంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం కేసీఆర్‌ ప్రతి మండలంలో పది ఎకరాల విస్తీర్ణంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో స్థలం అందుబాటులో లేని పక్షంలో ఆ మండలంలోని ఏదైనా గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

ఒక్కో వనంలో 31 వేల మొక్కలు
సహజ సిద్ధమైన అడవిని సృష్టించే రీతిలో మెగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నారు. ఏడాది పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా అడవి జాతి మొక్కలు నాటనున్నారు. ఇందుకుగాను అటవీశాఖ సహకారాన్ని తీసుకోనున్నారు. చింత మొక్కలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారు. వీటితోపాటు ఉసిరి, రేగు, నేరేడు, చీమ చింత, పనస, వేప, టేకు, ఇప్ప, వెలగ, చందనం, కుంకుడు, అందుగా, నెమలి నార, సీతాఫలం, జామ, దానిమ్మ, నిమ్మ, ఈత, తాటి, హెన్నా, కరివేపాకు, వెదురు జమ్మి, వావిలి వంటి పొదల జాతి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే తంగేడు, పారి జాతం, తిప్ప తీగ, అడ్డసారం, పొడ పత్రీ వంటి ఔషధ మొక్కలు నాటనున్నారు. వనం చుట్టూ బయో ఫెన్సింగ్‌గా వెదురు, గచ్చకాయ, గోరింట వంటి మొక్కలను మూడు వరుసల్లో మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో నాటుతారు. మొత్తంగా పది ఎకరాల విస్తీర్ణంలో ఇరవై జాతులకు సంబంధించిన 31వేల మొక్కలు నాటేలా ప్రణాళికను రూపొందించారు.

ఆహ్లాదాన్ని పంచేందుకు సకల సదుపాయాలు
పది ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మెగా ప్రకృతి వనాల్లో కల్పిస్తున్నారు. ఏకంగా 6.86 ఎకరాల్లో నలు వైపులా ప్లాంటేషన్‌ను చేపట్టి దట్టమైన అడవిని సృష్టించనున్నారు. అలాగే 0.75 ఎకరం స్థలాన్ని పిల్లల ఆట స్థలం కోసం కేటాయిస్తున్నారు. 0.69 ఎకరాల స్థలంలో వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలంలో 10 ఫీట్ల వెడల్పుతో పాదచారుల కోసం బాటను ఏర్పాటు చేయడంతోపాటు నీటి సదుపాయాలను కల్పించనున్నారు. అంతర్గతంగా 8 ఫీట్ల అడుగుల వెడల్పుతో బాటలు ఏర్పాటు చేస్తారు. ప్రకృతి వనం చుట్టూ మూడు వరుసల్లో 1.58 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటనుండగా..0.14 ఎకరం స్థలంలో బయో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కలు నాడడం, నీటి వసతి, మొక్కల నిర్వహణ, సంరక్షుడి నియామకం వంటి వాటికి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను వెచ్చిస్తున్నారు. ఒక్కో వనానికి రూ.40లక్షల వరకు వ్యయం కానున్నది.

17 మండలాల్లో పూర్తయిన స్థలాల ఎంపిక
జిల్లాలో బృహత్‌ ప్రకృతి వనాల కోసం 17 మండలాల్లోనూ స్థలాల ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. రెండు మండలాల్లో మినహా అన్నిచోట్లా 10 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. భువనగిరి మండలంలోని తుక్కాపూర్‌ (సర్వే నెం.123), ఆలేరు మండలంలోని టంగుటూరు (సర్వే నెం.191), ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి (సర్వే నెం.279), బీబీనగర్‌ మండలంలోని గుర్రాలదండి (సర్వే నెం.44), బొమ్మలరామారం మండలంలోని మల్యాల (సర్వే నెం.199), చౌటుప్పల్‌ మండలంలోని మల్కాపూర్‌ (సర్వే నెం.114), గుండాల మండలంలోని సీతారాంపురం (సర్వే నెం.179), తుర్కపల్లి మండలంలోని రాంపుర్‌తండా, మోత్కూరు మండలంలోని దాచారం (సర్వే నెం.148), నారాయణపురం మండలంలోని కొత్తగూడెం (సర్వే నెం.151), పోచంపల్లి మండలంలోని .జిబ్లక్‌పల్లి (సర్వే నెం.374), రాజాపేట మండలంలోని సింగారం (సర్వే నెం.181), రామన్నపేట మండల కేంద్రం (సర్వే నెం.584), వలిగొండ మండలంలోని సుంకిశాల (సర్వే నెం.68), యాదగిరిగుట్ట మండలంలోని దాతరుపల్లి(సర్వే నెం.218)లో అనువైన స్థలాలు ఎంపిక చేశారు. స్థలాలు అందుబాటులో లేక మోటకొండూరు మండల కేంద్రం(సర్వే నెం.543)లో ప్రకృతి వనానికి 9.12 ఎకరాలను, అడ్డగూడూరు మండలంలోని కోటమర్తి(సర్వే నెం.118/122) లో 8 ఎకరాలను మాత్రమే సేకరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బృహత్‌  వన సంకల్పం
బృహత్‌  వన సంకల్పం
బృహత్‌  వన సంకల్పం

ట్రెండింగ్‌

Advertisement