e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు జోరువాన

జోరువాన

జోరువాన

బుధవారం రాత్రి కుండపోతలా కురిసిన వర్షం
భువనగిరి మండలంలో అత్యధికంగా 150.8మి.మీ.ల వర్షపాతం నమోదు
జిల్లా సరాసరి వర్షపాతం 82.8మి.మీ.లు
మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ధర్మారెడ్డి కాలువ, బునాదిగాని కాల్వలకు గండ్లు
రహదారులపై నీరు ప్రవహించడంతో పలుచోట్ల రవాణాకు అంతరాయం.. గ్రామాల మధ్య తెగిపోయిన సంబంధాలు
ముసురుతో ఇండ్లకే పరిమితమైన జనం
వరదల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు
సహాయ చర్యల కోసం టోల్‌ ఫ్రీ నం.1950, 08685-234020 నంబర్లకు కాల్‌ చేయండి : కలెక్టర్‌ పమేలాసత్పతి

యాదాద్రి భువనగిరి, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ముసురుకున్నది. బుధవారం రాత్రి కురిసిన వర్షం కుండపోతను తలపించింది. ఓ వైపు గోదావరి.. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీకి వాన నీళ్లు తోడవ్వడంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడా పంట పొలాలు నీట మునిగాయి. పట్టణాలు, పల్లెల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా స్తంభించింది. వలిగొండ మండలంలో ధర్మారెడ్డి కాల్వకు, బీబీనగర్‌ మండలంలో బునాదిగాని కాల్వకు గండ్లు పడ్డాయి. రహదారులు కోతకు గురయ్యాయి. కల్వర్టుల మీదుగా పొంగిపొర్లుతున్న వరద నీటితో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కలెక్టర్‌ పమేలాసత్పతి డీసీపీ నారాయణరెడ్డితో కలిసి వలిగొండ, బీబీనగర్‌ మండలాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అత్యధికంగా భువనగిరి మండలంలో 150.8మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. మోటకొండూరు, అడ్డగూడూరు మినహా జిల్లా వ్యాప్తంగా మరో 14 మండలాల్లోనూ ఆశించిన మేరలో వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాలు మెట్ట పంటలకు మేలు చేకూర్చేలా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. కంటిపై కునుకులేకుండా చేస్తున్న వర్షాలతో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. వర్షం నీళ్లతో పలు చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, పలు చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం సంగ్యం వద్ద ధర్మారెడ్డి కాలువకు గండి పడగా, బీబీనగర్‌ మండలంలో బునాదిగాని కాలువకు మూడు చోట్ల గండి పడింది. దీంతో పొలాల మీదుగా వర్షం నీరంతా వృథాగా పోయాయి. వలిగొండ- తుమ్మలగూడెం గ్రామాల మధ్య రోడ్డుపై వరద పోటెత్తడంతో భువనగిరి-నల్లగొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోగా, రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామ శివారులో రోడ్డు కోతకు గురవ్వడంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరద ఉధృతితో బీబీనగర్‌- పోచంపల్లి మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. చిన్నేరు వాగు సైతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా జలాల్‌పూర్‌- మోహర్‌ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యాదగిరిగుట్ట మం డలంలోని చొల్లేరు- మర్రిగూడెం గ్రామాల ప్రధాన వారధిగా ఉన్న కల్వర్టు పైనుంచి వర్షం నీరు పోటెత్తడంతో స్థానికులు, పొలం పనులకు వెళ్లిన రైతులు జమ్మాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

- Advertisement -

104 మి.మీ.ల అత్యధిక వర్షపాతం
వానకాలం సీజన్‌లో వర్షాలు ఆశించిన స్థాయిలో కు రుస్తున్నాయి. జూన్‌ 1నుంచి జూలై 15వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 174.8మి.మీ.లు కాగా, 356.0మి.మీ.ల మేర వర్షం కురిసింది. కురవాల్సిన దానికంటే 104 మి.మీ.ల వర్షం ఎక్కువగా కురిసింది. వర్షాధారంగా వేసిన పత్తి, కందులు, ఆము దం, జొన్న పంటలకు ఈ వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నం : 1950, 08685-234020 ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తూ పలు చోట్ల వరదలు పెరుగుతున్నందున కలెక్టర్‌ పమేలా సత్పతి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హెడ్‌ క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని, పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. ప్రజలు సాయం కోరటం, ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్‌లో ఒకటి, జిల్లా ఇరిగేషన్‌ కార్యాలయంలో మరో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ అధికారులను ప్రత్యేకించి నియమించామని, వారు 24 గంటలు విధుల్లో ఉంటారని, టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చని ఆమె సూచించారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జోరువాన
జోరువాన
జోరువాన

ట్రెండింగ్‌

Advertisement