సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : పుట్టపాక గ్రామ చేనేత కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. పుట్టపాక కళాకారులు తయారు చేసిన తేలియా రుమాల్ డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీరె, డబుల్ ఇక్కత్ డాబి బోన్ దుప్పటి వస్ర్తాలు జాతీయ స్థాయిలో ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మ శ్రీ అవార్డులతో పాటు పలు జాతీయ అవార్డులు వరించాయి. ప్రస్తుతం తేలియా రుమాలు డబుల్ ఇక్కత్ చీరెకు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైంది. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌కు అవార్డు వరించింది. జాతీయ స్థాయిలో చేనేత ,జౌళి శాఖ 2018 సంవత్సరానికి హస్తకళల పురస్కారానికి 18 మంది చేనేత కళాకారులను ఎంపిక చేసింది. రాష్ట్రం నుంచి పుట్టపాక గ్రామానికి చెందిన తండ్రీకొడు కు లు నేసిన తేలియా రుమాలు డబుల్ ఇక్కత్ చీరె అవార్డుకు ఎంపికైంది.
చార్జీల కోసం నీళ్ల బిందెలు కుదువ పెట్టాడు..
నిరుపేద కుటుంబానికి చెందిన పెద్దవెంకయ్య నాలుగో తరగతి వరకు చదువుకున్నాడు. 18వ ఏటా గుజరాత్‌కు వలస వెళ్లి డిజైన్ గ్రాఫ్ నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి ఒక పక్క మగ్గం నేస్తూ మరో పక్క వివిధ రకాల డిజైన్లు గీసేవాడు. 1978లో చెన్నై లోని వీవర్స్ సర్వీస్ సెంటర్లో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న రెండు నీళ్ల బిందెలను రూ.150కు కుదువ పెట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉద్యోగం రాకపోవడంతో తిరిగి వచ్చి ఇష్టమైన డిజైనింగ్ రంగంలో మెళకువలు నేర్చుకున్నాడు. ఎలాంటి డిజైన్ అయినా వేయడంలో దిట్ట. ఇప్పటి వరకు 10 వేలకు పైగా డిజైన్లు వేశాడు. వెంకయ్య వేసిన డిజైన్లు చేనేత కళాకారులు వేరే జిల్లాలు, మండలాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అతడి దగ్గర డిజైన్లను కొనుగోలు చేసిన వారు ఇప్పటి వరకు పదుల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు.అవార్డు కోసం దరఖాస్తు పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చాలా సార్లు అవకాశం చేజారిందని వెంకయ్య పేర్కొన్నారు. డిజైనింగ్ విభాగంలో 2018లో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు.
శీతాకాలం వేడిగా, ఎండకు చల్లగా..
వేసవిలో సైతం చల్లగా శీతాకాలంలో వెచ్చగా అనిపించే తేలియా రుమాలు చీరె తయారీ చాలా ప్రత్యేకమైనది. తేలియా రుమాలులో వాడే రంగులన్నీ ప్రకృతి సిద్ధంగా లభించేవే. కరక్కాయ, హీరాకాసు, ఆలం,లేక్, అలిజేరిన్తో ఎరుపు,నీలం, పసుపు మొదలైన రంగులన్నీ చెట్ల నుంచి తయారు చేస్తారు. నూనెలు, సహజ సిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలు చీరెకు ఔషధ గుణాలూ అందుతాయి కాబట్టే వేసవి తాపం నుంచి తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఒక తేలియా రుమాల్ చీరెను తయారు చేయడానికి 10నెలల సమయం పడుతుంది. చీరె ఖరీదు రూ.లక్ష వరకు ఉంటుంది.గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యేకంగా చీరెను కొనుగోలు చేస్తుంటారు.
30 ఏండ్ల కల నెరవేరింది..
65 ఏండ్లుగా మగ్గం, డిజైన్ పని చేస్తున్నా.10 నెలలు నేను నా కొడుకు కుటుంబ సభ్యులు కష్టపడి తేలియా రుమాలు చీరెను తయారు చేశాం. రసాయన రంగులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా లబించే రంగులను వాడం. నా కొడుకుతో కలిసి జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. నా 30 ఎండ్ల కల నెరవేరింది.
అవార్డు రావడం సంతోషంగా ఉంది
మాది నిరుపేద చేనేత కుటుంబం.మా నాన్న తన చిన్నతనం నుంచి డిజైన్లు బాగా వేసేవారు. నేనే చదువుకుంటూనే నాన్న దగ్గర డిజైన్లు, మగ్గం పని నేర్చుకున్నా. మా నాన్న దగ్గర డిజైన్లు కొనుగోలు చేసిన వారికి చాలా మందికి అవార్డులు వరించాయి. చీరెతయారికి 10నెలలు కష్టపడ్డాం. నాన్నతో కలసి తేలియా రుమాల్ చీరెకు జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది.