e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home యాదాద్రి వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త

వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త

వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త
  • సీజనల్‌ వ్యాధులు సోకే ప్రమాదం
  • ముందుగానే టీకాలు వేయించడం ఉత్తమం
  • చిన్నపాటి జాగ్రత్తలతో వ్యాధులు దూరం

యాదాద్రి అగ్రికల్చర్‌, జూలై 14 : మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వానకాలంలో వచ్చే రోగాల నుంచి పశువులను కాపాడుకోవచ్చు. తొలి దశలోనే పశువులకు వచ్చిన రోగాన్ని గుర్తిస్తే కొంతమేరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవచ్చని పశువైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పశువులు అనారోగ్యానికి గురైతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాల టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962కు సమాచారం అందించి చికిత్సలు చేయించవచ్చు.

వానకాలంలో వ్యాధుల సంక్రమణ అధికం
వానకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు, వాతావరణం కలుషితమవుతాయి. ముఖ్యంగా పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుల మందలో వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, నోరు, కళ్ల నుంచి వచ్చే ద్రవాల ద్వారా కూడా ఇతర పశువులు వ్యాధిబారిన పడుతాయి. సీజనల్‌ వ్యాధులను రైతులు కనిపెడుతూ.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

అందుబాటులో సంచార పశువైద్యశాల..
రాష్ట్ర ప్రభుత్వం పశువులు జబ్బులకు లోనైతే తక్షణమే వైద్య సహాయం అందించేందుకు సంచార వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చింది. పశువులు, మేకలు, గొర్రెలు అనారోగ్యానికి గురైతే రైతులు వెంటనే 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోను ద్వారా సమాచారం అందిస్తే సంచార వైద్యశాల వాహనం అక్కడికి వచ్చి వైద్యులు చికిత్స చేస్తారు. ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల అద్భుత ఫలితాలను ఇస్తున్నది. ఈ వాహనం గ్రామీణ ప్రాత పశుపోషకులకు చాలా ఉపయోగపడుతుంది.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి..

గొర్రెల్లో వైరస్‌తో కలిగే వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి ప్రధానమైనది. దీనినే మూతి వ్యాధి, కూత రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి క్యూలికాయిట్‌ అనే దోమ కాటు ద్వారా సోకుతుంది. ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు ఉండే వాతావరణంలో నీలి నాలుక వైరస్‌ అభివృద్ధి, వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడిన గొర్రెలు మేత మాని నెమరు వేయడం మానేస్తాయి. జ్వరం ఎక్కువగా ఉండి మొహం, పెదవులు వాచి ఉంటాయి. నోటి భాగం లోపల ఎర్రబడి పొక్కులు ఏర్పడతాయి. నాలుక వాచి నీలిరంగులోకి మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారం రోజుల తర్వాత గిట్టల నుంచి రక్తం కారి గొర్రె కుంటుతుంది. ఆహారం తీసుకోక వ్యాధి సోకిన గొర్రె పదిరోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది.

నివారణ చర్యలు..
వ్యాధి సోకిన గొర్రెను సకాలంలో గుర్తించి వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. నోటిలోని పుండ్లను ఒక శాతం బోరిక్‌యాసిడ్‌ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బోర్లిగ్లీసరిన్‌ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు రాగి, మక్కజొన్న జావ, ఆకులను ఆహారంగా ఇవ్వాలి. ఐదురోజుల పాటు ఒక్కో గొర్రెకు యాంటీబయాటిక్‌ టీకాలను వేయించాలి.

జలగ వ్యాధి..
జలగ వ్యాధి పరాన్న జీవులతో వస్తుంది. వ్యాధి బారిన పడిన పశువుల పేడ ద్వారా జలగల గుడ్లు నేల మీద పడతాయి. ఈ ప్రదేశాల్లో మెలచిన గడ్డిని పశువులు మేయడం ద్వారా ఈ గుడ్లు పశువుల కాలేయంలోకి వెళ్లి వ్యాధిని కలిగిస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు ఆకలి మందగిస్తుంది. దవడ కింద నీరు వచ్చి వాపు వస్తుంది. పేడ పలుచగా ఉండి దుర్వాసన వస్తుంది. వ్యాధి సోకిన పశువులు పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తాయి.

వ్యాధి నివారణ చర్యలు..
వ్యాధి సోకిన పశువును గుర్తించి వైద్యుని సలహాలతో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధికి సంబంధించిన మందులు సకాలంలో వాడితే వ్యాధిని త్వరగా నిర్మూలించవచ్చు.

చిటుకు వ్యాధి..
దీనినే మెడరసం వ్యాధి అని కూడా అంటారు. ఇది ఎక్కువగా గొర్రెలకు సోకుతుంది. మేకలకు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. నేలలో, పశువుల పేగుల్లో నివసించే ఒకరకం బాక్టీరియాతో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పెద్ద గొర్రెలకు మాత్రమే ఈ వ్యాధి వస్తుంది. చాలా సేపు ఆకలితో ఉండి ఒకే సారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం ద్వారా, వేసవి కాలం ముగిసి తొలకరి జల్లుల సమయంలో ఒకేసారి ఎండుమేత నుంచి పచ్చి మేతకు మారడంతో ఈ జబ్బు వస్తుంది. అప్పుడే పుట్టిన గొర్రెలకు సైతం తల్లి నుంచి బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది.

నివారణ చర్యలు..
ఈ జబ్బు రాకుండా ఉండేందుకు వానకాలం ఆరంభంలోనే టీకాలు వేయించాలి. మూడు నెలలు దాటిన ప్రతి గొర్రెపిల్లకూ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. రెండు మాసాల అనంతరం బూస్టర్‌ డోస్‌ వేయించాలి. గొర్రెలకు నట్టల మందు వేసి అప్పుడప్పుడు తూకం వేయాలి. నివారణ మందు లేకపోవడంతో ఈ జబ్బు సోకిన గొర్రెలు సాధారణంగా చనిపోతాయి.

గొంతువాపు వ్యాధి..
ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా అంటారు. వానకాలంలో పశువులకు సూక్ష్మజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. కలుషితమైన మేత, నీటి ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. పశువులు, జీవాల్లో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతాయి. ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాధి సంక్రమిస్తుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పైగా ఉంటుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కండ్ల నుంచి ఊసు వస్తుంది.

నివారణ చర్యలు..
వానకాలం ముందు జూన్‌, జూలై మాసాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి బారిన పడిన పశువుల పాకలను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేయాలి.

గాలికుంటు వ్యాధి..
వైరస్‌ ప్రభావంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెల ల్లో ఈ వ్యాధి పశువులకు ఎక్కువగా సోకుతుంది. కలుషితమైన గాలి ద్వారా వ్యాపిస్తుంది. దేశవాళి పశువుల కన్నా సంకరజాతి దూడల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. తల్లిపాల ద్వారా దూడలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువుల ఉష్ణోగ్రత 104 నుంచి 108 డిగ్రీల వరకు ఉంటుంది. నోరు, గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి చొంగ కారడం ఈ వ్యాధి లక్షణాలు, పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గుతుంది.

నివారణ చర్యలు..
నోటిలోని పుండ్లకు బోరిక్‌ పౌడర్‌, గ్లిజరిన్‌ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లను పర్మాంగనేట్‌ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనే రాయాలి. ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మాసాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయించినట్లయితే పశువులు వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త
వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త
వ్యాధుల కాలం.. జీవాలు జాగ్రత్త

ట్రెండింగ్‌

Advertisement