e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home యాదాద్రి వర్షంలో ప్రయాణం.. ఈత సరదాతో ప్రాణాపాయం

వర్షంలో ప్రయాణం.. ఈత సరదాతో ప్రాణాపాయం

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 25 : వర్షా కాలం మొదలైంది.. ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతున్నది. ఇప్పటికే బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ప్రతి మండలంలో చాలా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అలుగులు పోస్తుండటంతో ప్రజలు, యువకులు, చిన్న పిల్లలు అక్కడికి వెళ్లి సరదాగా ఫొటోలు దిగడం లాంటివి చేస్తుంటారు. కొంత మంది అనుకోని పనుల మీద వర్షం పడుతున్నా కూడా ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.

ఈతకు వెళ్లడం చాలా ప్రమాదం
వర్షాలు కురుస్తుండటంతో దాదాపు అన్ని గ్రామాల్లో వ్యవసాయ బావులు, ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల్లో నీరు నిండుగా ఉంటున్నాయి. జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్‌కు సంబంధించిన కాల్వలతోపాటు ఇతరత్రా కాల్వల్లో నీరు ఉండటంతో సరదాగా ఈత కొట్టడానికి యువకులు, విద్యార్థులు వెళ్తుంటారు. ఈ కాల్వల్లో లోతు తెలియకపోవడంతో ఈతకెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలో గత వారం రోజుల క్రితమే సరదాగా ఈతకు వెళ్లి విషాదాన్ని మిగిల్చిన రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

బస్వాపురం రిజర్వాయర్‌లో…
భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం శివారులోని నృసింహ రిజర్వాయర్‌ చూడటానికి వెళ్లి నీట మునిగి ఇద్దరు బాలురు మృతి చెందారు. రిజర్వాయర్‌ వద్ద చెప్పులు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సాయంతో పోలీసులు రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఏకంగా భువనగిరి రూరల్‌ ఎస్‌ఐ సైదులు నీటిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీశారు.

రాచకొండ గుట్టల్లో…
సంస్థాన్‌నారాయణపురంలోని రాచకొండ ప్రాంతంలో ఫొటో షూట్‌ కోసం హైదరాబాద్‌ నుంచి కొంత మంది స్నేహితులు వచ్చారు. రాచకొండ రామాలయం పక్కన ఉన్న రాయసముద్రం చెరువులోకి సరదాగా దిగగా, ఒక యువకుడు ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులోకి పడిపోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు. ఇదే ప్రదేశంలో నాలుగు నెలల కిందట ఇలాగే విహార యాత్రకు వచ్చి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కూడా చోటుచేసుకున్నది.

నీటితో సరదా వద్దు..
ఇలా సరదాగా వెళ్లి మృత్యువాత పడిన ఘటనలతో చాలాచోట్ల విషాదం చోటుచేసుకున్నది. వీటితో పాటు వర్షం వచ్చినప్పుడు చాలా వరకు రోడ్ల మీద నీరు నిండుతుంది. రోడ్‌ డ్యాంలు, వాగుల వద్ద రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వరదలు రోడ్డు మీది నుంచి పొంగుతున్న క్రమంలో అదే రోడ్డు మీది నుంచి ప్రయాణించడం కూడా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రవాహం ఎక్కువ స్థాయిలో వస్తే గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. గత 8 నెలల కిందట కూడా జిల్లాలో భారీ వర్షం పడి నాగిరెడ్డిపల్లి వద్ద వర్షపు నీరు అధికంగా ప్రవహించే క్రమంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. దీంతో వారు ఆ ప్రవాహాంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది పలువురు రక్షణ సిబ్బంది అత్యంత కష్టం మీద వారిని సురక్షితంగా కాపాడారు. ఇలా వర్షం పడిన సందర్భంలో చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

అప్రమత్తత అవసరం
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగడం, చెరువులు నిండి అలుగులు పోస్తున్న సందర్భంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. సరదాకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. రహదారులపైన వర్షపు నీరు ప్రవహిస్తుంటే అక్కడి నుంచి వెళ్లకపోవడం చాలా శ్రేయస్కరం. చెరువులు, కాల్వల వద్ద ఈతలకు అస్సలే వెళ్లకూడదు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గమనిస్తూ ఉండాలి.

  • కే.నారాయణరెడ్డి,
    డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana