e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home యాదాద్రి జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు
  • పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి నిర్ధారణ పరీక్షలు
  • రూ.కోటి వ్యయంతో సదుపాయాలు, అత్యాధునిక పరికరాలు
  • రోజుకు 500 వరకు టెస్టులు.. ఒక్క రోజులోనే ఫలితం
  • నేడో, రేపో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు
  • ఉచిత టెస్టులతో జిల్లా వాసులకు తీరనున్న వ్యయప్రయాసలు

యాదాద్రి భువనగిరి, జూలై 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నిర్ధారణకు రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకటి ర్యాపిడ్‌ యాంటిజెన్‌, రెండోది ఆర్‌టీ పీసీఆర్‌. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష ఫలితం దాదాపు పావుగంటలోనే వస్తోంది. ఈ టెస్టు వల్ల కరోనా నిర్ధారణ సరిగాలేని కారణంగా చాలా మంది ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలనే చేయించుకుని నిర్ధారణకు వస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో నెగటివ్‌ రావడంతో చాలా మంది సాధారణంగా జనసమూహంలో తిరిగేస్తున్నారు. దీనివల్ల కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతుండటం.. పరిస్థితి సైతం విషమిస్తూ వస్తోంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలా మంది ర్యాపిడ్‌ టెస్టులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఒకవేళ ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్నప్పటికీ రెండు, మూడు రోజులకు కూడా ఫలితం రావడంలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, జిల్లా కేంద్రంలోనూ త్వరలోనే ఈ కేంద్రం కార్యరూపంలోకి రానున్నది.

24 గంటల్లోనే ఫలితం..
జిల్లాలో ప్రస్తుతానికి ఎయిమ్స్‌లోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను చేస్తున్నారు. నమూనాలను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపిస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం నమూనాలనిచ్చిన వారు ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఫలితాలు వచ్చేసరికి రెండు, మూడు రోజులకు పైనే పడుతున్నది. ఈ క్రమంలో సకాలంలో చికిత్స అందక రోగుల ఆరోగ్యం సైతం విషమిస్తోంది. అయితే ఇక నుంచి ఆ ఇబ్బందులు తీరనున్నాయి. సత్వరమే ఫలితాలను పొందవచ్చు. జలుబు, దగ్గులాంటి లక్షణాలున్న వారు, కరోనా సోకిన వారితో కాంటాక్ట్‌ అయిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తి కచ్చితత్వాన్ని తేల్చే ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్న 24 గంటల లోపే ఫలితం తెలుసుకుని జాగ్రత్తపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల సత్వరమే చికిత్సను అందించి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని వారంటున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను హోంక్వారంటైన్‌లోనే ఉంచేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారిని మాత్రం జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఇంటికే ఉచితంగా కిట్లను అందజేస్తున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారా సెటమాల్‌, యాంటీ బయాటిక్స్‌, విటమిన్‌-సీ, ఈ, డీ3 తదితర వాటితోపాటు శానిటైజర్‌, మాస్కులు, గ్లౌజులను కిట్లలో ఉంచి బాధితులకు అందజేసి ఆదిలోనే కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

- Advertisement -

అత్యాధునిక పరికరాలతో…
భువనగిరిలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రూ.కోటి వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతోఆర్టీపీసీఆర్‌ కేంద్రం రూపుదిద్దుకుంటున్నది. టెస్టుల కోసం ఆర్‌ఎన్‌ఏ, పీసీఆర్‌, బయోసేఫ్టీ క్యాబినెట్‌, ల్యామినార్‌ క్యాబినెట్‌, మైనస్‌ 20, మైనస్‌ 80 రిఫ్రిజిరేటర్స్‌, మైక్రోస్పిన్‌, సెంటర్‌ ఫ్రీజర్స్‌ వంటి అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. పాథాలజిస్ట్‌తోపాటు ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, డీఈవోల నియామకాలను సైతం చేపట్టారు. కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక పరికరాలతో కూడిన వైరాలజీ ల్యాబ్‌ను నెలకొల్పడంతో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వైరస్‌లతో ప్రబలే కరోనాతోపాటు డెంగీ, హెచ్‌ఐవీ వంటి వ్యాధులను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఈ ల్యాబ్‌ దోహదపడనున్నది. జిల్లాలో 23 వరకు ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను జిల్లా కేంద్ర దవాఖానలోని ల్యాబ్‌కు పంపి 24 గంటల్లోనే ఫలితాలను అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రతి నిత్యం ఇక్కడి కేంద్రంలో 500 వరకు టెస్టులు చేసే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. నిమ్స్‌ నుంచి నమూనాలను తెచ్చి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రైవేటుగా ఆర్టీపీసీఆర్‌ టెస్టుల కోసం రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వెచ్చించాల్సి వస్తోంది.అయితే ఇక్కడి ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి ల్యాబ్‌ రావడంతో ఉచితంగానే టెస్టులు చేయించుకుని కచ్చితమైన ఫలితాలను తక్కువ సమయంలోనే పొందే వెసులుబాటు కలుగనున్నది. కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఇక్కడి ల్యాబ్‌ జిల్లా వాసులకు గొప్ప ఉపశమనాన్ని కలిగించనున్నది.

ప్రారంభానికి ఏర్పాట్లు…
ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పూర్తిగా ఉచితంగానే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైరాలజీ ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యాన్ని అందించే అవకాశం కలుగుతుంది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. రెండుమూడు రోజుల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి అఫ్రూవల్‌ వచ్చిన వెంటనే ల్యాబ్‌లో టెస్టులను అధికారికంగా ప్రారంభించనున్నాం.

  • రవి ప్రకాశ్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ఏరియా దవాఖాన
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు
జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు
జిల్లాలోనే.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement