e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home నల్గొండ ఐదేండ్లలో..39అడుగులు

ఐదేండ్లలో..39అడుగులు

  • పైపైకి ఉబికివస్తున్న పాతాళ గంగ
  • కరువు ప్రాంతమైన సంస్థాన్‌ నారాయణపురం మండలంలో 11.47 మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు
  • జిల్లా ఏర్పాటు తర్వాత ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి వర్షపాతం
  • తగ్గిన నీటి వినియోగం.. పెరిగిన పొదుపు ఉపయుక్తంగా మారిన రాష్ట్ర సర్కారు కృషి

దశాబ్దాల తరబడి నీటి తడికి తండ్లాడిన కరువు నేలను చీల్చుకుంటూ పాతాళ గంగ పైపైకి ఉబికి వస్తున్నది. జిల్లాలోని 17 మండలాల్లో ఊహించని స్థాయిలో భూగర్భ జల మట్టం పెరిగింది. 2016 ఆగస్టులో 16.76 మీటర్ల లోతులో ఉన్న నీటి జాడ.. ఈ ఏడాది ఆగస్టు నాటికి 4.92 మీటర్లపైకి చేరింది. ఐదేండ్ల కాలంలో 39 అడుగుల మేర ఎగబాకింది. జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల వైపు రైతాంగం మొగ్గు చూపడం, నీటి వినియోగం తగ్గి, పొదుపు పెరుగడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని భూగర్భ జల శాఖ అధికారులు చెప్తున్నారు.

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్‌ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్నేండ్లుగా భూగర్భ జలాల వృద్ధి నామమాత్రంగానే ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం ఊహించని రీతిలో భూగర్భ జలమట్టం పెరిగింది. కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన సంస్థాన్‌నారాయణపురం మండలంలో కూడా గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో 24 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 12 అడుగులకు ఎగబాకాయి. ఆత్మకూరు(ఎం), మోటకొండూరు మండలాల్లోనూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరిగాయి. 2016 నుంచి 2021 వరకు ఆగస్టు నెలలో భూగర్భ జలమట్టం వ్యత్యా సం 39 అడుగులు ఉండగా.. సరాసరిగా 23 అడుగుల మేరకు జలమట్టం పెరిగింది.

ఈ సంవత్సరమే రికార్డుస్థాయిలో..

- Advertisement -

జూన్‌, జూలైలో జిల్లాలో సాధారణ వర్షపాతం 449.1 మి.మీ కాగా ఈ ఏడాది 720.3మి.మీ కురిసి సాధారణం కంటే 60 శాతం అధికంగా నమోదైంది. జిల్లా ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం. గత పదేళ్లలో సాధారణం కంటే కాస్త అటూ ఇటుగా వర్షపాతం నమోదవుతోంది. 30 ఏళ్లలో ఎప్పుడూ ఎరుగని వరదను ఈ సారి జిల్లా ప్రజలు చూశారు. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో ఉన్న 1,382 చెరువులు పూర్తిస్థాయిలో నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బోరు బావుల్లో పుష్కలంగా నీరు లభిస్తున్నది. దీంతో ప్రస్తుతం జిల్లాలో తాగు, సాగు నీటి ఇబ్బందులు లేకుండా పోయాయి.

మెరుగుపడిన పరిస్థితులు

భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా నీటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఫలించడంతో జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగు పడ్డాయి. మిషన్‌ భగీరథతో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడం, ఉపాధిహామీ పథకంలో భాగంగా నీటి నిల్వకు సంబంధించిన పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి వాటితో భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మూసీ పరవళ్లకు తోడు గోదావరి జలాలు సైతం జిల్లాకు రావడం కొంతవరకు కలిసొచ్చింది. 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం రైతులకు తోడ్పాటు నందించడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ సారి జిల్లాలో 4.42 లక్షల ఎకరాల్లో సాగును అధికారులు అంచనా వేయగా అంతకు మించి సాగతువుతున్నాయి.

ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయి

జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం సంతో షకరం. ఎన్నోఏళ్లుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్న మండలాల్లోనూ ఈ ఏడాది ఆశాజనకంగా భూగర్భ జలాలు పెరిగాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో కూడా 11.47 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. భూగర్బ జలాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నీటి సంరక్షణ చర్యలు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి.- జ్యోతి కుమార్‌, డిఫ్యూటీ డైరెక్టర్‌, భూగర్బ జలవనరుల శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana