e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home నల్గొండ ఊరు నిలబడింది..

ఊరు నిలబడింది..

  • నేడు ‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు
  • ఏండ్ల తర్వాత తండా దారికి మోక్షం
  • ప్రస్తుతం మున్సిపాలిటిలో వార్డుగా గుర్తింపు

నీరున్న చోటే నాగరికత ఉంటుంది.. వనరులున్న చోటే వ్యవసాయం వర్ధిల్లుతుంది.. వసతులున్న చోటే జన జీవనం వికసిస్తుంది.. ఆ 15కుటుంబాలున్న ఆ తండా మౌలిక సౌకర్యాలు లేక ఏండ్ల తరబడి చీకటిలో మగ్గిపోయింది. ఊరంతటికీ ఒకే ఒక్క బోరు ఉండగా తాగునీటికి వ్యవసాయబావులే దిక్కయ్యాయి. విద్యుత్‌, రోడ్లు ఎలాంటి సౌకర్యాలు లేక ఉనికి కోల్పోయింది. వ్యవసాయానికి సైతం అవస్థలు తప్పకపోవడంతో 6కుటుంబాలు వసలబాట పట్టాయి. ఇదంతా గతం.

తిరుమలగిరి, సెప్టెంబర్‌ 13 : మండలంలోని నందాపురం ఆవాసం రామునిబండ తండా అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో జరుగుతున్న మార్పునకు అద్దం పడుతున్నది. గతంలో తండాలో విద్యుత్‌ లైన్లు లేవు. తండా మొత్తానికీ ఒక్కటే బోరు ఉన్నా అది సరిగా పనిచేయక వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకునే వారు. తేలుకాటుకు గురైన ఓ బాలుడు కుటుంబసభ్యులు కాలినడక తిరుమలగిరికి తీసుకొచ్చేలోగా వైద్యం అందక ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో తండా యువకులకు అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేయడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. దాంతో 6కుటుంబాలు వ్యవసాయ భూములు, ఆస్తులు తెగనమ్మి జనగాం జిల్లా నవాబుపేటకు వలసవెళ్లి స్థిరపడ్డారు.

రాష్ట్రం రాకతో మారిన రూపురేఖలు..

- Advertisement -

రాష్ట్రం ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈదుల పర్రె తండా నుంచి రామునిబండతండా వరకు, గ్రామం నుంచి 365 నంబర్‌ జాతీయ రహదారి వరకు మట్టిరోడ్డు నిర్మించింది. రూ.3లక్షలతో సీసీ రోడ్డు, విద్యుత్‌ లైన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేసింది. మిషన్‌ భగీరథ ఓవర్‌ హెడ్‌ ట్యాంకు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నది. ఈ నేపథ్యంలో వలసలు ఆగి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. ప్రగతి పనుల్లో తండా రూపురేఖలు మారిపోయాయి. మౌలిక వసతుల కల్పనతో తమ సమస్యలు తీరాయని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కానీ, నేడు.. స్వరాష్ట్రంలో ఆ తండా ప్రగతి పథంలో పయనిస్తున్నది. గ్రామానికి రోడ్డు సౌకర్యం సమకూరింది. నల్లాల ద్వారా తాగునీరు ఇంటింటికీ అందుతున్నది. విరామం లేకుండా 24గంటల కరంటు సరఫరా అవుతున్నది. సమీపంలోని కుంట నీటితో జలకళ సంతరించుకున్నది. పచ్చని
పొలాలతో ఆయకట్టు కళకళలాడుతున్నది. తిరుమలగిరి మున్సిపాలిటీలో విలీనమైన 9వ వార్డుగా ఉనికిని చాటుతున్నది.

పెరిగిన భూగర్భ జలాలు.. పుష్కలంగా నీళ్లు

తాగునీటి కోసం గతంలో వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీరుండేది కాదు. వ్యవసాయం కత్తిమీద సాములా ఉండేది. నేడు మిషన్‌ కాకతీయతో చెరువులు, కుంటల్లో నీరు చేరి భూగర్భ జలాలు పెరిగాయి. 24గంటల కరంటుతో బోర్లు నిండుగా పోస్తుండడంతో వరితో పాటు పత్తి, కంది, పెసర పంటలు సాగు చేస్తున్నారు.

మున్సిపాలిటీలో విలీనం..

తిరుమలగిరి మున్సిపాలిటీలో విలీనమైన రామునిబండ తండాలో భూముల ధరలు పెరిగాయి. నాడు దారి కూడా లేక ఎకరం లక్ష రూపాయల లోపు పలికిన ధర నేడు రూ.20లక్షలకు చేరింది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రవాణా పరంగా ప్రజల కష్టాలు కూడా తీరుతున్నాయి.

పల్లె ప్రగతితో దశ మారింది…

ఉమ్మడి రాష్ట్రంలో తండాలు గ్రామాలకు దూరంగా విసిరేసినట్లుగా ఉండేవి. పట్టించుకునే నాథుడే లేక గిరిజనులు సమస్యలతో సావాసం చేసేవారు. వానకాలంలో మురుగు నిలిచి ఈగలు, దోమలు విజృంభించేవి. సీజనల్‌ వ్యాధులతో జనం అల్లాడిపోయేవారు. కానీ, పల్లె ప్రగతితో మౌలిక వసతులు సమకూరాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీట వేస్తూ నిధులు విడుదల చేస్తున్నది. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. సీసీ రోడ్లు, విద్యుత్‌ లైన్లు ఏర్పాటయ్యాయి. వెరసి ప్రశాంత వాతావరణంలో తండాలు కనువిందు చేస్తున్నాయి.

సమస్యలన్నీ తీరుతున్నయి..

మా తండ ఇప్పుడు మున్సిపాలిటీలో వార్డుగా ఎక్కింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి అయితున్నది. మరిన్ని పనులు పూర్తిచేస్తారన్న నమ్మకం ఉన్నది. అన్ని సమస్యలు పోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారే ఉండాలి. గీ ప్రభుత్వం రాకుంటే మొత్తం కష్టాలే ఉండేది. ఇప్పుడు అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – ధరావత్‌ రంగమ్మ, రామునిబండతండా

కేసీఆర్‌ సారు దయవల్లనే బాగుపడ్డాం..

కేసీఆర్‌ సారు వచ్చినంక ఆయన దయవల్లనే మా తండా బాగుపడ్డది. ఏండ్ల సంది తండాకు బాట సరిగ్గా లేక చాలా బాధపడ్డాం. ఇప్పుడు మట్టి రోడ్డు వచ్చింది గానీ వానలొస్తే గుంతలు అయితుంది. నెల్లిబండ తండా నుంచి బీటీ రోడ్డు వేయిస్తే బాగుంటుంది. అప్పడు నీళ్ల గోస ఉండె… ఇప్పుడు మిషన్‌ భగీరథ నీళ్లు తాగుతున్నం. మా తండాలోనే ట్యాంకు కట్టినరు ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వస్తున్నయి. – ధరావత్‌ రాములు, రైతు, రామునిబండతండా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana