ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితినాటి చంద్రుణ్ని చూసినవారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకోవాలి.

‘లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలలో ఆయనను స్మరిస్తాం. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి, మొదటిరోజున పూజించినట్లే పూజించాలి.

క్రోధాసురుణ్ని వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి.

నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి.

గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది. కాబట్టి అయిదోనాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే.

ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణగి ఏకదంత గణపతిని శరణువేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధిచెప్పి, పాతాళానికి పంపుతాడు. నేటిపూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే.

మత్సరాసురుడు సింహరూపం పొంది, గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు. గణపతి కనికరించి, ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. నేటి పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే.

పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే! పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ అంతరార్థం.

తొమ్మిదోనాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే.

గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడిగా మార్చడమే!