రాష్ట్ర అవతరణ తర్వాత పుట్టిన బిడ్డల్లో చాలామంది ఐదారేండ్ల పిల్లలే! ఆ చిన్నారులకు ఏ ఫర్‌ యాపిల్‌తో పాటు ఏ ఫర్‌ ‘అమరవీరులు’ అనీ చెప్పాలి. బి ఫర్‌ ‘బతుకమ్మ’ అన్నదీ తెలియజెప్పాలి. మన గడ్డకో చరిత్ర ఉందని, ఈ నేల త్యాగాల ఫలమనీ బోధించాలి.

ఆత్మాభిమాన అక్షరాభ్యాసానికి అవతరణ దినోత్సవాన్ని మించిన సుముహూర్తం ఏముంటుంది? ప్రారంభించండి మలి ఉద్యమ తొలి పాఠం! చెప్పించండి జై తెలంగాణ నినాదం!

అమరవీరులు

a

60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు జోహార్‌! తొలిదశ ఉద్యమం (1969)లోనే దాదాపు 400 మంది ప్రాణాలు అర్పించారు. మలిదశ నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది.

బతుకమ్మ, బోనాలు

b

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలు బోనాలు, బతుకమ్మ పండుగలు. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది.

చంద్రబాబు

C

శత్రుదేవో భవః మన కడుపు కొట్టినవాడు, మన ఉనికిని ప్రశ్నించినవాడు, మన బువ్వ లాక్కున్నవాడు, మన నీళ్లు దోచుకున్నవాడు, మన నిధులు తన్నుకెళ్లినవాడు.. మన బలమేమిటో మనకు గుర్తుచేశాడు.

చంద్రబాబు

C

చంద్రబాబు రెండు కండ్ల సిద్ధాంతం వల్లె వేసినందుకే తెలంగాణ ప్రజానీకం మూడోకన్ను తెరిచింది. ప్రతినాయకుల ప్రస్తావనతోనే ఏ గెలుపు కథకైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది.

ధూంధాం

d

రెండో దశ ఉద్యమంలో ‘ధూంధాం’లు దుమ్మురేపాయి. ఆ ఆటలు, ఆ పాటలు, ఆ కేకలు, ఆ అరుపులు.. ఉద్యమావేశానికి ఇంధనం అయ్యాయి. కొత్త పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. కొత్త గాయకులు పుట్టుకొచ్చారు. అదో పెద్ద సాంస్కృతిక సైన్యం!

ఎంప్లాయ్‌మెంట్‌

e

తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష పుట్టిందే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే సిద్ధాంతం మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు ప్రతి చోటా తీవ్ర అన్యాయమే జరిగింది. ముఖ్యంగా నియామకాల విషయంలో!

Feb 18, 2014

f

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు. చారిత్రక ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోద ముద్ర లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ మద్దతు తెలిపింది. రాష్ట్రపతి రాజముద్ర తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

గవర్నెన్స్‌

g

తెలంగాణ సాధించడం ఒక ఎత్తు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని కోరుకున్నట్టు తీర్చిదిద్దుకోవడం మరొక ఎత్తు. గవర్నెన్స్‌ అంటే అదే! పాలనా పరంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సర్కారుగా మన్ననలు అందుకుంటున్నది.

గవర్నెన్స్‌

g

కాళేశ్వరంతో నేల సస్యశ్యామలమైంది. యాదాద్రితో మనకంటూ ఓ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. కట్టుదిట్టమైన పోలీసింగ్‌తో శాంతికి భద్రత లభించింది. ధరణితో కబ్జాలకు కళ్లెం పడింది. రైతుబంధుతో ఆత్మహత్యలు ఆగాయి. ప్రతి పథకం తెలంగాణ తల్లి మెడలో పచ్చల పతకమే!

హమారా హైదరాబాద్‌

h

ఈ మహానగరం తెలంగాణ ఆత్మ! బహుళజాతి సంస్థల చిరునామా. కొలువుల ఖజానా. అభివృద్ధి నమూనా. ఔషధ నగరి. ఐటీ పురి. తెలంగాణ ప్రజలు గోల్కొండ కోటకు రాళ్లెత్తారు. చార్మినార్‌ నిర్మాణానికి పునాదులు తవ్వారు. మన కులీ, మన నిజాం.. ఈ నగర సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.

నా ఆత్మ గౌరవం

I

తెలంగాణ భాషను చూసి నవ్వారు. తెలంగాణ సంస్కృతిని గేలి చేశారు. తన గడ్డమీదే తెలంగాణ బిడ్డ ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాల్సిన పరిస్థితి. కాబ‌ట్టే, తెలంగాణ ఉద్యమం ‘నేను.. నా జాతి’ అన్న ఆత్మగౌరవ నినాదాన్ని భుజానికెత్తుకుంది.

జయశంకర్‌ సార్‌

j

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌.. తెలంగాణ స్వేచ్ఛకోసం తుదిశ్వాస విడిచే వరకూ పోరాడారు. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన మాట, రాత, ఆలోచన, అంతర్మథనం.. ఎప్పుడూ తెలంగాణ చుట్టే!

కేసీఆర్‌

K

ఒక ఉక్కు సంకల్పం. స్వరాష్ట్ర సాధన కోసం బరిగీసి, కొట్లాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల వెతలు, బాధలు తీరాలం రాష్ట్ర సాధనే మార్గమని నమ్మి, చావునోట్లో తలపెట్టి, మృత్యువును గెలిచి.. స్వరాష్ర్టాన్ని సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ..  తెలంగాణ జాతిపిత!

లక్ష్యం

L

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి, అంతలోనే పడిపోతున్నాయి. అనేక పోరాటాలు మొదలైనంత వేగంగానే కనుమరుగై పోతున్నాయి. కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ నడిపిన తీరు ఓ నాయకత్వ పాఠం.

మిలియన్‌ మార్చ్‌

m

తెలంగాణ ఉద్యమచరిత్రలో మర్చిపోలేని మైలురాయి మిలియన్‌ మార్చ్‌. 2011 మార్చి 10న తెలంగాణ ప్రజానీకం చేపట్టిన మహత్తర కార్యక్రమం ఇది. ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక ధైర్యాన్నిచ్చింది.

నమస్తే తెలంగాణ

n

తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తయితే, ఆ ఉద్యమాన్ని భుజానికెత్తుకొని ప్రజల్లోకి తీసుకెల్లే మాధ్యమం ఒక ఎత్తు. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని మీడియా సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు పన్నాయి. 

నమస్తే తెలంగాణ

n

మనకంటూ సొంతంగా ఓ మాధ్యమం, మన యాస భాషలకు, పోరాటాలకు కొంగొత్తగా ఊపిరులూదే పత్రిక కావాలన్న లక్ష్యంతో పదేండ్ల క్రితం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆవిర్భవించింది. ఉద్యమం నుంచి ప్రగతిపథం వరకూ ప్రతీ బాధ్యతనూ విజయవంతంగా నిర్వహిస్తున్నది.

ఉస్మానియా యూనివర్సిటి

o

తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ పోరాటం వరకూ ఇక్కడినుంచే యువతకు దిశా నిర్దేశం. మొత్తం ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఓయూ. లాఠీ దెబ్బలనూ, తుపాకుల మోతలనూ తట్టుకుని, తల ఎగరేసిన తెలంగాణ జెండా ఉస్మానియా!

పెద్ద మనుషుల ఒప్పందం

P

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి కోస్తా, రాయలసీమ, తెలంగాణ… అన్ని ప్రాంతాల నాయకులూ ఓ అంగీకారానికి వచ్చారు. అయితే, తెలంగాణ అభివృద్ధిపై స్థానిక నాయకులకు కొన్ని సందేహాలు రావడంతో వాటిని నివృత్తి చేసేందుకు 14 అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. అదే ‘పెద్ద మనుషుల ఒప్పందం’.

కుతుబ్‌ షాహీ అసఫ్‌ జాహీ

Q

కుతుబ్‌ షాహీ వంశస్థులుకులీ కుతుబ్‌ షా గోల్కొండ కేంద్రంగా జెండా ఎగరేశాడు. భాగ్యనగరాన్ని నిర్మించారు. తెలంగాణ కవులను గౌరవించారు. అసఫ్‌ జాహీలూ అంతే! మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హైదరాబాద్‌ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దాడు.

రుద్రమదేవి

r

కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వీరనారి రాణి రుద్రమదేవి.రుద్రమదేవి స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.

సకల జనుల సమ్మె

s

తెలంగాణ ఉద్యమచరిత్రలో మరో మైలురాయి సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె దాదాపు 42 రోజులపాటు ఉధృతంగా సాగింది.

తెలంగాణ తల్లి

t

మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రతీకగా తెలంగాణ తల్లికి ఓ రూపాన్నీ, ఆహార్యాన్నీ కల్పించారు కేసీఆర్‌. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007 నవంబర్‌ 15న తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు.

యూనియన్‌ టెరిటరీ

u

విభజన తప్పదని అర్థమైపోయింది. తెలంగాణ అనివార్యమని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ఆంధ్ర పాలకులు కుటిల ఎత్తులూ, నక్కజిత్తులూ మానలేదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే వాదనను తెరమీదికి తెచ్చారు. రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాలంటూ వితండ వాదం చేశారు. చివరికి, ఆ పప్పులేం ఉడకలేదు.

విద్యుత్‌

v

ఉద్యమం సమయంలో ఆంధ్రపాలకులు చూపిన బూచి కరెంటు! ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ చీకటిమయం అవుతుందని భయపెట్టారు. కేసీఆర్‌ ఆ కట్టుకథల్ని చెత్తబుట్ట పాలు చేశారు. విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నది తెలంగాణ.

వాటర్‌

w

స్వరాష్ట్రం వచ్చేవరకూ మనదిఆత్మహత్యల తెలంగాణే. రాష్ట్రం సిద్ధించాక జననేత సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాలు బంగారు తెలంగాణవైపు నడిపిస్తున్నాయి. ఎవుసం ఓ పండగలా మారింది.

ఎక్స్‌-ఫ్యాక్టర్‌!

x

కొన్ని అనుకోని పరిణామాలూ తెలంగాణ ఉద్యమానికి కలిసొచ్చాయి. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో పతనం అంచున ఉన్నది. తెలంగాణకు మొగ్గు చూపితే కనీసం ఒక ప్రాంతంలో అయినా బతికించుకోవచ్చని సోనియమ్మ ఆశ!

ఎక్స్‌-ఫ్యాక్టర్‌!

x

పేలాలు ఏరుకోవడంలో పేరు గాంచిన భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కొంత లాభపడాలని చూసింది. ఇంకా ఆలస్యం చేస్తే, పరిస్థితి అదుపు తప్పుతుందని, ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారనీ ప్రధానికి నివేదిక అందింది.

ఎక్స్‌-ఫ్యాక్టర్‌!

x

వీటన్నిటికి మించి కేసీఆర్‌ నేతృత్వంలోని ఉద్యమం మరింతగా బలపడుతున్న పరిస్థితి. ఇదీ తెలంగాణ ప్రకటన సమయానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉన్న వాతావరణం.

వైఎస్‌ఆర్‌

y

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగు లేని నేత వైఎస్‌ఆర్‌. ఆయన మాటల్లో, చేతల్లో తెలంగాణ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించేది. అసెంబ్లీ సాక్షిగానే ఉద్యమనేతలతో ఎకసెక్కాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. 

జిందాబాద్‌! జిందాబాద్‌!! ఉద్యమస్ఫూర్తికి జిందాబాద్‌! జాగృతజాతికి జిందాబాద్‌!

z