గొంతు నొప్పి వస్తుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

చాలామంది దగ్గును, గొంతునొప్పిని లెక్కలోకి తీసుకోవడం లేదు. సమస్య మొదలైనప్పుడే సరైన పత్యం చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్టు తింటూ తీరా నొప్పి ముదిరాక వైద్యులను సంప్రదిస్తున్నారు. 

ఇలా దగ్గు, గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గొంతునొప్పి బాధిస్తున్నప్పుడు అన్నం తినడం కూడా కష్టం అవుతుంది. నొప్పికి తోడు దగ్గు మొదలైతే ఇక నరకమే.

గొంతు నొప్పి ఉన్నప్పుడు నారింజ, నిమ్మ, టమాట తదితర పుల్లని పదార్థాలు తీసుకోకూడదు. ఇవన్నీ గొంతుకు చికాకు కలిగించేవే. ఫలితంగా గొంతులో అసౌకర్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది.

చాలామంది గొంతు నొప్పిని లెక్కచేయకుండా ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, ప్యాకేజ్డ్‌ జ్యూస్‌ వంటివి తీసుకుంటారు. ఇవి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. రసాయన ప్రభావం వల్ల నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

గొంతు నొప్పి ఉన్నప్పుడు మసాలాల జోలికి వెళ్లకూడదు. దీనివల్ల పొడి దగ్గు కాస్తా తీవ్రమైన దగ్గుగా పరిణమిస్తుంది.

కొంతకాలం పెరుగుకు దూరంగా ఉండటమే మేలు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉన్నమాట నిజమే అయినా.. అదే సమయంలో కఫం ఎక్కువై తెరలు తెరలుగా దగ్గు వస్తుంది.

వేయించిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి శత్రువులు. ఇవి గొంతులో దురదకూ కారణం అవుతాయి. పైగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. 

నిజానికి, నొప్పి మొదలైన రోజే వైద్యుడ్ని సంప్రదించడం ఉత్తమ మార్గం.