మహారాష్ట్రలో పుణె, అహ్మద్‌నగర్‌, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్‌ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను దర్శించుకోవడం ఆనవాయితీ.

మహాగణపతి ఆలయం తర్వాత మళ్లీ మోరేశ్వర్‌ను దర్శించుకోవడంతో అష్ట వినాయక పరిక్రమ పూర్తవుతుంది. ఇలా చేస్తే అష్ట వినాయకుల అనుగ్రహంతో అష్టకష్టాలూ తొలగిపోయి, సకల శుభాలనూ పొందుతారనేది భక్తుల విశ్వాసం.

పుణె నుంచి 60km దూరంలో ఉన్న మోర్‌గావ్‌లో కొలువుదీరిన గణపతి మోరేశ్వర్‌ లేదా మయూరేశ్వర్‌. ఈ పట్టణం ఒకప్పుడు నెమళ్ల (మయూరాలు)కు ప్రసిద్ధిచెందిందని, అందుకే మోర్‌గావ్‌ అనే పేరు వచ్చిందని అంటారు.

ఈ ఆలయం అహ్మద్‌నగర్‌ జిల్లాలోని సిద్ధటేక్‌లో ఉంది. ఎనిమిది వినాయక మందిరాల్లో ఏడింటిలో వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉండగా, ఒక్క సిద్ధటేక్‌లో మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలను తీర్చే కామధేనువు.

ఈ మందిరం రాయ్‌గఢ్‌ జిల్లా పాలి గ్రామంలో ఉంది. తన భక్తితో వినాయకుడిని మెప్పించిన బళ్లాలుడు అనే యువకుడి పేరుమీద ఇక్కడి స్వామికి, ‘బళ్లాలేశ్వర్‌’ అనే పేరు నిలిచిపోయింది. తమ కోరికలు నెరవేరడానికి అకుంఠిత భక్తితో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

పుణెకు దగ్గర్లో ఉన్న మహద్‌ గ్రామంలో కొలువుదీరిన మూర్తి వరద వినాయకుడు. ఇక్కడి స్వామి తన దగ్గరికి వచ్చే భక్తులకు విజయాలను ప్రసాదిస్తాడు. ఇక్కడ ఆలయంలో నందాదీపంగా పిలిచే ఒక నూనె దీపం 1892 నుంచి అఖండంగా వెలుగుతూ ఉందని విశ్వసిస్తారు.

ఈ ఆలయం పుణె నుంచి 25 Km దూరంలో ఉంది. ఓసారి కపిల మహర్షి కోసం గుణాసురుడితో గణపతి పోరాడాడు. ఆ యుద్ధంలో చింతామణి సాయంతో  వినాయకుడు గెలుస్తాడు. అందుకే చింతామణి గణపతి అనే పేరు స్థిరపడింది. ఇక్కడి స్వామిని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు.

పుణె సమీపంలోని లేన్యాద్రి గుహల్లో కొలువుదీరిన గణపతే గిరిజాత్మజుడు.మిగిలిన మూర్తులకు భిన్నంగా, గుహ కుడ్యానికి మలచిన రూపాన్ని కలిగి ఉంటాడు ఇక్కడి స్వామి. 18 గుహల సముదాయంలో 7వ గుహలో గిరిజాత్మజుడు కొలువై ఉన్నాడు.

పుణె నాసిక్‌ మార్గంలో ఓజార్‌ పట్టణంలో వెలసిన దేవుడు విఘ్నహరుడు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలనుకునే వాళ్లు విఘ్నహరుణ్ని పూజిస్తారు.

Gray Frame Corner

పుణెకు 50Km దూరంలో రంజన్‌గావ్‌లో కొలువుదీరాడు. ఇక్కడి దేవుడిని మహాగణపతి రూపంలో కొలుస్తారు. త్రిపురాసుర సంహారానికి ముందు పరమేశ్వరుడు  విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఇక్కడే తన కొడుకైన గణపతిని ప్రార్థించాడని స్థల పురాణం.