మామిడి పండ్ల‌తో ఇలా చేయండి..

జుట్టు రాల‌డం ఇట్టే త‌గ్గిపోతుంది

పోషకాల్లో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్‌, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌- సి, ఎ, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమిన్‌-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి.

ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది.

మామిడి పండ్లలో మాంగిఫెరిన్‌, టర్పెనాయిడ్స్‌, పాలీఫెనాల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ నుంచి జుట్టును రక్షిస్తాయి.

మామిడిలో ఉండే గల్లోటానిన్స్‌ వంటి ఫైటోకెమికల్స్‌ కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలోని పొయెటిన్‌ కేశాలను నిగనిగలాడేలా చేస్తుంది.

మామిడి పండ్ల ప్యాక్‌ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కేశాలకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

చుండ్రుకు మామిడి ప్యాక్‌ చక్కటి పరిష్కారం. దీనితోపాటుగా జుట్టు పలచబడకుండా, చివర్లు చిట్లకుండా కాపాడుతుంది.

ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, ఒక మామిడిపండు గుజ్జును వేసి కలపాలి. దానిని తల నుంచి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. 

30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో సెలూన్‌కు వెళ్లకుండానే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఒక మామిడి పండు గుజ్జులో తగినంత కలబంద జెల్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆముదం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ ప్యాక్‌ను తల నుంచి చివరి వరకు పట్టించాలి.

కొద్ది నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు డ్యామేజ్‌ సమస్యే ఉండదు. కుదుళ్లకు పోషణ అందడంతో పాటు, చివర్లు చిట్లి పోకుండా ఉంటాయి.