e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జనగాం సర్కారు దవాఖానల్లోనే మెరుగైన సేవలు

సర్కారు దవాఖానల్లోనే మెరుగైన సేవలు

సర్కారు దవాఖానల్లోనే మెరుగైన సేవలు

ప్రైవేట్లకు వెళ్లి నష్టపోవద్దు
ప్రతి మండలంలో ఐసొలేషన్‌ సెంటర్లు
ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నాం
ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఓపిక పట్టాలి
తడిసిన ప్రతి గింజనూ కొంటాం..
రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
తొర్రూరు యూపీహెచ్‌సీలో ఐసొలేషన్‌సెంటర్‌ ప్రారంభం
దేవరుప్పుల పీహెచ్‌సీ తనిఖీ

జనగామ, మే 15 (నమస్తే తెలంగాణ) /తొర్రూరు/ దేవరుప్పుల : సర్కారు దవాఖానల్లోనే మెరుగైన సేవలు అందుతున్నాయని, ప్రైవేట్లకు వెళ్లి నష్టపోవద్దని, ఈ మేరకు అధికారులు కూడా ప్రజల్లో నమ్మకం కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. జనగామ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కే నిఖిల, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులతో కొవిడ్‌ నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై శనివారం సమీక్షించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్‌ నివారణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జ్వర సర్వేలో 5,510 మందికి హెల్త్‌కిట్లు అందించినట్లు తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో కొవిడ్‌ ఓపీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, లక్షణాలున్న 1,889 మందికి హెల్త్‌ కిట్లు అందించామన్నారు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గని 54 మందికి స్టెరాయిడ్స్‌ కూడా ఇవ్వడం ప్రారంభించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానలకు తరలించేందుకు ఏడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని, పడకలు, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు కొరత లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టామని, ప్రతి మండలంలో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసి, వసతులు కల్పించామని చెప్పారు. జిల్లా కేంద్రంలో 8247847692 నంబర్‌తో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, హెల్త్‌ కిట్లు అందించిన వారికి నేరుగా ఫోన్‌ చేసి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌ తరహాలోనే జనగామ ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందుతున్నదని ప్రజలకు సూచించారు.
పీహెచ్‌సీ తనిఖీ
దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి దయాకర్‌రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, కొవిడ్‌ కిట్లు, వ్యాక్సిన్‌ తీరును పరిశీలించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా ప్రైవేట్‌ దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా కుంగిపోద్దని సూచించారు. లక్షణాలు కనిపించిన రోజు నుంచే ప్రభుత్వం అందించే మందులు వాడుతూ ఐసొలేషన్‌లో ఉంటే త్వరగా నయమవుతుందని చెప్పారు. టెస్టుల పేరిట కాలయాపన చేయొద్దని సూచించారు.
ఎర్రబెల్లి ట్రస్ట్‌ ద్వారా సేవలు
పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా కరోనా రోగులకు సేవలు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. భోజన వసతులు ఏర్పాటు చేయగా, కొన్ని చోట్ల బలవర్ధక ఆహారం అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి మాస్కులు అందించే ప్రక్రియ చేపట్టామని తెలిపారు. దేవరుప్పులలో కొవిడ్‌ బాధితులకు డ్రైఫ్రూట్స్‌ అందిస్తున్న పల్లా భార్గవి సుందరరాంరెడ్డి, శ్యామల విక్రంరెడ్డిని మంత్రి అభినందించారు. ఇక్కడ ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా సుందరరాంరెడ్డి, సర్పంచ్‌లు ఈదునూరి రమాదేవి, బిళ్ల అంజమ్మ, మండల వైద్యాధికారి పారిజాత, నాయకులు దయాకర్‌, మల్లేశ్‌, చింత రవి, యాదవరెడ్డి, గిరియాదవ్‌ ఉన్నారు.
తొర్రూరులో కొవిడ్‌ సేవలు ప్రారంభం
తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని యూపీహెచ్‌సీలో కొవిడ్‌ సేవల కోసం ఏర్పాటు చేసిన 30 పడకల ఐసొలేషన్‌ సెంటర్‌ను మంత్రి ఎర్రబెల్లి, మహబూబాబాద్‌ కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం 20 బెడ్లకు సరిపడా ఆక్సిజన్‌ సిలిండర్లను, ఇతర పరికరాలను ఏర్పాటు చేయగా మంత్రి వాటిని పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో తొర్రూరు యూపీహెచ్‌సీకి 10 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందజేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ 20 ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తహసీల్దార్‌ వేంరెడ్డి రాఘవరెడ్డిని అభినందించారు. నలుగురు వైద్యులు, నలుగురు ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు మూడు షిప్టుల వారీగా కరోనా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.

డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైతే తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎల్‌ రమేశ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రాజేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, జడ్పీఫ్లోర్‌ లీడర్‌ మంగళపల్లి శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జీ మురళీధర్‌, తహసీల్దార్‌ వీ రాఘవరెడ్డి, ఎంపీడీవో బీ భారతి, మున్సిపల్‌ కమిషనర్‌ గుండె బాబు, వైద్యాధికారి డాక్టర్‌ దిలీప్‌, మీరజ్‌, రేణుక, విజయ్‌కుమార్‌, వేదకిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్కారు దవాఖానల్లోనే మెరుగైన సేవలు

ట్రెండింగ్‌

Advertisement