e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జనగాం జైలు ఖాళీ

జైలు ఖాళీ

జైలు ఖాళీ

వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి ఖైదీల తరలింపు పూర్తి
చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు భారీ మిషన్లు
జైలులో పూర్తి కావొస్తున్న కూల్చి వేతలు
పెట్రోల్‌ పంపుల నిర్వహణకు 20 మంది..

పోచమ్మమైదాన్‌, జూన్‌ 11: వరంగల్‌ కేంద్ర కారాగారం ఖాళీ అయింది. జైలులో ఉన్న ఖైదీల తరలింపు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అలాగే, జైలు లోపల ఉన్న భారీ యంత్రాలు, పరికరాలు, ఇతర మిషనరీల తరలింపు కూడా పూర్తి కావడంతో జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించిన విషయం విదితమే. అనంతరం కేబినెట్‌ తీర్మానం మేరకు సెంట్రల్‌ జైలు భవనాలను కూల్చి వేసి, నగర శివారులో నూతన కారాగారం కోసం నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, జైలు స్థలంలో మల్టీసూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు యుద్ధప్రాతిపదికన ఖైదీలు, మిషనరీ తరలింపు ప్రక్రియను ఈనెల ఒకటిన ప్రారంభించారు. జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేది పర్యవేక్షణలో సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ రాయ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ భరత్‌కుమార్‌, ఇతర జైలు అధికారులు వేగంగా పనులు చేపట్టారు. జైలులో ఉన్న 875 మంది ఖైదీలను రాష్ట్రంలోని వేర్వేరు జైళ్లకు పది రోజులు పాటు తరలింపు ప్రక్రియను కొనసాగించారు. మిగతా 20 మంది ఓపెన్‌ ఎయిర్‌ జైలు ఖైదీలను పెట్రోల్‌ బంకుల నిర్వహణ కోసం ఇక్కడే ఉంచారు.
కేటగిరీల వారీగా తరలింపు
మవోయిస్టులు, కరుడు కట్టిన ఖైదీలను చర్లపల్లి, చంచల్‌గూడకు, సాధారణ ఖైదీలను నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని సెంట్రల్‌ జైళ్లకు, అండర్‌ ట్రయల్‌ ఖైదీలను వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని సబ్‌ జైళ్లకు తరలించారు. ఖైదీల తరలింపు ప్రక్రియలో ఎలాంటి సమస ్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడంతో జైళ్ల శాఖ డీజీ జైలు, పోలీసు అధికారులను అభినందించారు. జైలులోని వివిధ రకాల పరిశ్రమలకు సంబంధించిన యంత్రాలు, ఇతర పరికరాలను కూడా భారీ వాహనాల్లో చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లకు తరలించారు. కాగా, ఈ నెల 15లోపు జైలు స్థలాన్ని ఆరోగ్య శాఖకు అప్పగించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
వివిధ జైళ్లకు తరలిన ఖైదీల వివరాలు
చర్లపల్లి జైలుకు 225 మంది, ప్రత్యేక జైలుకు 58 మంది, హైదరాబాద్‌ సెంట్రల్‌ జైలుకు 116 మంది, ప్రత్యేక మహిళా జైలుకు 44 మంది, ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు 58 మంది, నిజామాబాద్‌ జిల్లా జైలుకు 148 మంది, ఖమ్మం జిల్లా జైలుకు 152 మంది, కరీంనగర్‌ జిల్లా జైలుకు 19 మంది, మహబూబాబాద్‌కు 54 మంది, ఆసిఫాబాద్‌ జైలుకు ఒకరిని తరలించారు. అలాగే, సెంట్ర ల్‌ జైలులో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని కూడా ఇతర జైళ్లకు డిప్యూటేషన్‌పై పంపినట్లు, కొందరు ఉద్యోగులను వారి కోరిక మేరకు సబ్‌ జైళ్లకు పంపినట్లు తెలుస్తున్నది. మొత్తానికి 200 మంది వరకు వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని సబ్‌ జైళ్లకు, మరో 67 మందిని చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు పంపినట్లు సమాచారం.
అర్ధరాత్రి వరకూ కొనసాగిన కూల్చివేతలు
ప్రస్తుత కారాగారంలో ఉన్న ఖైదీలు, మిషనరీ తరలింపు ప్రక్రియ పూర్తయింది. అయితే, జైలులో పెద్ద ఎత్తున నిజాం కాలం నాటి నిర్మాణాలు ఉండడంతో వాటి కూల్చివేతలు జాగ్రత్తగా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు కూల్చివేతలు జరిగినట్లు తెలిసింది. ఇంకా మిగిలిన నిర్మాణాల కూల్చివేతను శనివారం తెల్లవారుజాము వరకు పూర్తి చేసినట్లు సమాచారం. జైలులో 98 బ్యారక్‌లు ఉన్నాయి. వీటిలో 16 బ్యారక్‌లు జీవితశిక్ష పడిన ఖైదీలకు, 12 అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు, 24 సింగిల్‌ సెల్స్‌, 43 హై సెక్యూరిటీ బ్యారక్‌లు, మూడు సెక్యూరిటీ బ్యారక్‌లు ఉన్నాయి. వీటిని దశలవారీగా, పకడ్బందీ ప్రణాళికతో కూల్చివేస్తున్నట్లు సమాచారం.
హై సెక్యూరిటీ బందోబస్తు
జూన్‌ 1 నుంచి ఖైదీలు, మిషనరీల తరలింపు, కూల్చివేత కార్యక్రమాలు ఉండడంతో హై సెక్యూరిటీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. శుక్రవారం పూర్తిస్థాయిలో తరలింపు, కూల్చివేతలు ఉండడంతో జైలు అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున జైలు చుట్టూ బందోబస్తు చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జైలు ఖాళీ

ట్రెండింగ్‌

Advertisement