శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Oct 23, 2020 , 08:02:22

హెల్మెట్‌ ఉంటేనే రోడ్డుపైకి..

హెల్మెట్‌ ఉంటేనే రోడ్డుపైకి..

  • లేకుంటే బండి స్వాధీనం
  • హెల్మెట్‌ తెచ్చుకుంటేనే తిరిగి అప్పగింత
  • జరిమానాలు వేయం.. హెల్మెట్‌ తీసుకువస్తేనే వాహనం ఇస్తాం
  • వాహనదారుడి ప్రాణాలను కాపాడటమే..
  • అవగాహన కల్పిస్తున్న సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు

వాహనదారుల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. హెల్మెట్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చే వాహనదారులను ఆపి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. జరిమానా వెయ్యడానికి బదులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, హెల్మెట్‌ తెచ్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. హెల్మెట్‌తో వచ్చిన వారికే బండి ఇస్తున్నారు. లేదంటే ఆర్టీఏ ఆఫీసుకు పంపిస్తున్నారు.

హెల్మెట్‌లేని ప్రయాణం సురక్షితం కాదు.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్‌ లేకపోవడంతోనే మృతి చెందుతున్నారు... దీంతో పోలీసులు హెల్మెట్‌ను తప్పనిసరి చేశారు.. అయితే దీనిపై కొందరు ఆరోపణలు గుప్పిస్తుండటంతో పోలీసులు దానికి స్వస్తి చెప్పి.. సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక జరిమానాలు విధించకుండా వారిలో అవగాహన కల్పించి.. హెల్మెట్‌ పెట్టుకుంటేనే రోడ్డుపైకి అనుమతిస్తున్నారు.. ఎవరైనా హెల్మెట్‌ లేకుండా రోడ్డుపైకి వస్తే.. హెల్మెట్‌ తీసుకొచ్చిన తర్వాతనే వాహనం అప్పగిస్తున్నారు. 

హైదరాబాద్‌ :  వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇక నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేయొద్దని నిర్ణయించుకున్నారు. అవగాహన కల్పించి.. వారితో సురక్షిత ప్రయాణాన్ని చేపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా మొదట రహదారులపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు. రాజీవ్‌ రహదారి, నిజామాబాద్‌ హైవే, నర్సాపూర్‌ రోడ్డు, బెంగళూరు హైవే, పటాన్‌చెరు రోడ్డు, ఇలా కొన్నింటిని ఎంపిక చేసుకుని.. అక్కడ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తిష్ట వేస్తున్నారు. అవగాహన కల్పించడంలో భాగంగా హెల్మెట్‌లు ధరించని వారిని గుర్తించి.. ముందుగా వారి వాహనాలను స్వాధీనం చేసుకుని హెల్మెట్‌లను తీసుకువచ్చిన తర్వాతనే వాహనాన్ని తిరిగి.. వారికి అప్పగిస్తున్నారు. లేదంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్‌టీఏ అధికారులకు సిఫార్సు చేసి.. వారికి అప్పగిస్తున్నారు.  ద్విచక్రవాహనంపై ప్రయాణించే సమయంలో ఇద్దరు హెల్మెట్‌లు ధరించాలని.. లేదంటే ద్విచక్రవాహన ప్రయాణాన్ని రోడ్లపైకి అనుమతించమని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి ప్రారంభమైన ఈ ప్రయత్నంలో భాగంగా దాదాపు 500మందికి పైగా వాహనదారులు హెల్మెట్‌ తీసుకుని వచ్చి.. తాము హెల్మెట్‌ ధరించే వాహనం నడుపుతామని  ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది హెల్మెట్‌ ఇంట్లో మర్చిపోయామని.. మరోసారి వేసుకుంటానని చెప్పినా పోలీసులు వినడంలేదు.. ఇంటికి వెళ్లి తీసుకువస్తేనే వాహనం ఇస్తామని చెబుతుండగా.. ఆలాగే తీసుకొచ్చి వాహనాలను తీసుకెళ్తున్నారు. హెల్మెట్‌ చూపించడం కాదు.. వాటిని ఎలా పెట్టుకోవాలి, నాణ్యమైన హెల్మెట్‌ను ఎలా గుర్తించాలని అని కూడా పోలీసులు వివరిస్తున్నారు. 

ఆ అపవాదు మాకు వద్దు..

ఈ నిబంధనలను పాటించని వాహనదారులపై జరిమానా విధిస్తే చాలా మంది.. ఆ డబ్బంతా పోలీసులే తీసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ జరిమానాలు వారి భద్రత కోసం అని అనుకోవడం లేదు. ట్రాఫిక్‌ పోలీసులు వసూలు చేసే జరిమానాలు అన్ని ప్రభుత్వానికి చెల్లుతాయి. అంతేగానీ పోలీసులు వ్యక్తిగతంగా వాడుకోరు. మా అంతిమ లక్ష్యం వాహనదారుల ప్రాణాలను కాపాడటమే. అంతేగాని వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కాదు. హెల్మెట్‌ లేకుంటే రోడ్డు పైకి అనుమతించం. అలా చేసేవారి వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. వాహనదారుడు హెల్మెట్‌ తీసుకుని వస్తేనే ఆ వాహనాన్ని తిరిగి ఇస్తాం. లేదంటే ఆర్‌టీఏకు సిఫార్సు చేసి వారికి అప్పగిస్తాం. - ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, డీసీపీ, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం