నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3;తీరొక్క పూలు తెచ్చి.. పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చి.. ఊరూవాడా ఊరేగింపై.. ఆలయాలు, చెరువు గట్ల వద్దకు కదిలి.. అందరొక్క చోట చేరి లయబద్ధంగా చేసిన బృందగానాలతో నింగీ.. నేల పులకించిపోయాయి. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..’ అంటూ మొదలుపెట్టి, ‘పోయిరా గౌరమ్మ పోయిరావమ్మా.. యాడాదికోసారి వచ్చిపోవమ్మా’ అంటూ సాగనంపి.. ఆత్మీయంగా వాయినాలు ఇచ్చిపుచ్చుకోగా చెరువు, చెలక పరవశించిపోయాయి. ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదిరోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ ఉత్సవాలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. పలుచోట్ల ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడగా స్థానికుల్లో జోష్ నిండింది. వరంగల్ ఉర్సు రంగలీల మైదానం వద్ద సంబురాలు హోరెత్తాయి.
జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం సోమవారం అంబరాన్నంటింది. ఉదయం నుంచే ఊరూరా సందడి నెలకొన్నది. తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడడంతో ఆయా ప్రాంతాలు మర్మోగాయి. అనంతరం బతుకమ్మలను వాగులు, చెరువుల్లో నిమ్మజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. సత్తులు పంచుకొని తిన్నారు. పలుచోట్ల వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని బతుకమ్మ ఆడి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పోలీసులు, మున్సిపాలిటీ, పంచాయతీ పాలకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
బతుకమ్మ విశ్వవ్యాప్తం; మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సద్దుల సందర్భంగా తొర్రూరు పెద్ద చెరువు వద్ద మంత్రి సోమవారం కోలాటమాడి స్థానికులను ఉత్తేజపరిచారు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ పుట్టింటి గౌరవాన్ని నిలిపే ఆడబిడ్డను పూలతో పేర్చిన గౌరమ్మలో మనం ఆరాదించే గొప్ప సంస్కృతి తెలంగాణకే సొంతమన్నారు. ఒక తండ్రిలా, సోదరుడిలా ఆడబిడ్డలకు అండగా ఉన్న సీఎం కేసీఆర్ను ఆందరూ ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరారు. చెరువు వద్ద ఏర్పాట్లు బాగున్నాయని మున్సిపాలిటీ పాలకవర్గాన్ని, అధికారులను అభినందించారు. అంతకుముందు పర్వతగిరిలోని మంత్రి స్వగృహంలో బతుకమ్మను కచ్చురంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి బతుకమ్మ కాసేపు బతుకమ్మ ఆడారు. పాలకుర్తి మండలంలోని వావిలాల, దర్దేపల్లి, పాలకుర్తి, గూడూరులో మంత్రి బతుకమ్మ ఆడి స్థానికులను ఉత్సాహ పరిచారు.