మహిళలు స్వయంఉపాధి పొందేందుకు న్యాక్ శిక్షణ కేంద్రం ఎంతగానో తోడ్పడుతున్నది. ములుగు ప్రధాన కేంద్రంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ ట్రైనింగ్ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఔత్సాహిక మహిళలకు ఉచితంగా శిక్షణ, రోజుకు రూ.300 గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు నైపుణ్యం చూపిన వారికి సర్టిఫికెట్ అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. 30 మందికి ఒక బ్యాచ్ చొప్పున ప్రతి 90 రోజులకు మహిళలు, యువతులకు ట్రైనింగ్ ఇస్తుండగా ఇప్పటికే 470 మందికి శిక్షణ ఇచ్చింది. ఇందులో కుట్టు మిషన్‌తో పాటు ఎలక్ట్రికల్, ప్లంబర్, పెయింటర్, తాపీమేస్త్రీ వంటి విభాగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తూ వారికి ఉపాధికి భరోసా ఇస్తున్నది.
ములుగు రూరల్, అక్టోబర్ 14 : మహిళలను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాకేంద్రంలోని న్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వయంఉపాధిలో భాగంగా మహిళలకు 90రోజుల పాటు ఉచితంగా కుట్టుశిక్షణను అందించి నైపుణ్యం సాధించిన వారికి సర్టిఫికెట్తో పాటు కుట్టుమిషన్‌ను సైతం ఉచితంగా అందిస్తున్నది. భవన నిర్మాణరంగ కార్మికులకు ఉచిత శిక్షణ సమయంలో రోజుకు రూ.300 గౌరవ వేతనాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు 120మందికి పైగా మహిళలు, యువతులు కుట్టు శిక్షణ పొంది భవిష్యత్తుకు ఢోకా లేకుండా భరోసాతో ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రతి 90 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ అందిస్తున్నారు. అందులో 30మంది మహిళలు, యువతులు ఉంటారు. శిక్షణ పొందాలనుకునే వారు ములుగు జిల్లాకేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో ఉన్న న్యాక్ సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలి. ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను సమర్పించి శిక్షణకేంద్రంలో చేరాల్సి ఉంటుంది. న్యాక్ సెంటర్లో శిక్షణ పొందాలనుకునే మహిళల భర్తలు తప్పనిసరిగా లేబర్ కార్డు పొంది ఉండాలి. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. గత సంవత్సరం 15 రోజుల శిక్షణలో భాగంగా నిర్మాణ రంగంలో 350 మందికి, కుట్టుశిక్షణలో 120మందికి తర్ఫీదు అందించారు. ఈ ఏడాది కుట్టుశిక్షణలో 58మందికి, భవన నిర్మాణ రంగంలో 60 మందికి శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో కావాల్సిన స్టేషనరీని న్యాక్ సెంటర్ వారే ఉచితంగా అందిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందిస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో భవిష్యత్తుల్లో ఉపయోగకరంగా మారనున్నది.
సద్వినియోగం చేసుకొని..
పర్యాటక ప్రాంతమైన ములుగు జిల్లాలో మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు గాను గత సంవత్సరం జిల్లాకేంద్రంలో న్యాక్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. న్యాక్ సెంటర్ నిర్వాహకులు కరపత్రాలు, పత్రిక ప్రకటనల ద్వారా న్యాక్ సెంటర్లో అందించే ఉచిత శిక్షణపై విస్తృత ప్రచారం చేశారు. ధ్రువీకరణ పత్రం, ఉచిత కుట్టుమిషన్ల వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించడంతో క్రమక్రమంగా న్యాక్ సెంటర్లో శిక్షణ పొందేందుకు మహిళలు ముందుకొచ్చారు. ఇప్పటివరకు దాదాపు 150 మంది శిక్షణను సద్వినియోగం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం లేబర్ కార్డుతో పాటు సంబంధిత సర్టిఫికెట్ అందిస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉదయం, సాయంత్రం టీతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, హెల్మెట్, షూ సౌకర్యాలను ఉచితంగా అందిస్తారు.
స్వయంఉపాధితో ఆర్థికాభివృద్ధి
న్యాక్ శిక్షణతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. శిక్షణకు వచ్చే ప్రతి ఒక్కరికి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటున్నాం. నిర్మాణ రంగం వారికి 15రోజుల శిక్షణ, కుట్టు మిషన్ వారికి మూడు నెలల శిక్షణ ఇస్తున్నాం. అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వారు ఎంచుకున్న ఉపాధి మార్గాల్లో వారిని ఉత్తమమైన అభ్యర్థులుగా తీర్చిదిద్దుతున్నాం.
– స్నేహలత, సీనియర్ ఇన్స్ట్రక్టర్, సెంటర్ ఇన్చార్జి
త్వరలో మరిన్ని ఉపాధి అవకాశాలు
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి, కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో న్యాక్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లోని మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ ఇస్తున్నాం. ములుగు, జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ శిక్షణ అందిస్తుండగా హెడ్ ఆఫీస్ ములుగులో ఉన్నది. రాబోయే రోజుల్లో ములుగులో 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతకు మూడు నెలల ట్రైనింగ్‌తో ఉపాధి కల్పిస్తాం. అలాగే ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్న వారికి సైతం హైదరాబాద్‌లో ఒక సంవత్సరం పాటు శిక్షణ, వసతి, భోజనంతో కూడిన శిక్షణను అందిస్తాం. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం నిర్మాణరంగం. – గోలి రమేశ్, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్
శిక్షణ బాగుంది..
న్యాక్ శిక్షణ బాగుంది. ప్రతి రోజూ సెంటర్‌కు వస్తూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా. ట్రైనర్స్ కూడా చాలా బాగా చెబుతున్నారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడమే గాక శిక్షణ పూర్తి అయిన తర్వాత మిషన్ ఇవ్వడం చాలా సంతోషం. దీని వల్ల ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా సొంతంగా ఉపాధి పొందేలా టైలరింగ్ చేయవచ్చు.
– సూర్యదేవర సుహాసిని
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రభుత్వం లేబర్ డిపార్టమెంట్ ద్వారా ఈ శిక్షణను అందించడం ద్వారా నాలాంటి వారికి స్వయం ఉపాధి దొరుకుతోంది. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న మేలు చాలా గొప్పది. ట్రైనింగ్ తర్వాత కుట్టుమిషన్ తీసుకున్న వెంటనే మా కాలనీలో టైలరింగ్ చేయడం మొదలు పెడుతాను.
– మరాఠి లక్ష్మి