e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home Top Slides నాడు పనుల్లేక వలసలు.. నేడు ఒక్క ఊరి నుంచే ౩ రాష్ట్రాలకు ఎగుమ‌తులతో బిజీ

నాడు పనుల్లేక వలసలు.. నేడు ఒక్క ఊరి నుంచే ౩ రాష్ట్రాలకు ఎగుమ‌తులతో బిజీ

వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం తువ్వాలలు, చేతిరుమాళ్లు, ధోవతుల తయారీకి కేంద్రంగా మారింది. గతంలో ఇక్కడ నేత కార్మిక కుటుంబాలు ఉపాధి లేక సూరత్‌, ముంబై, భీవండికి వలస వెళ్లగా, ప్రస్తుతం స్థానికంగా పని దొరుకుతుండడంతో స్వగ్రామాలకు చేరుకున్నాయి.

సుమారు 70 కుటుంబాలు ఉన్న చోటనే వస్త్రాలు నేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి. అక్కడ మరమగ్గాలపై పనిచేసిన అనుభవం కలిసివస్తుండడంతో కార్మికులు నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ఇలా ఇల్లందలో చుట్టుపక్కల మండలాలకు చెందిన 300 కుటుంబాల మహిళలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు మార్కెటింగ్‌ లేక నేసిన ఉత్పత్తులు నెలల తరబడి అమ్ముడుపోక నష్టపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉత్పత్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తుండడంతో ఇప్పుడు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

మహిళలకు మస్తు పని..

- Advertisement -

తువ్వాలల తయారీలో మహిళా కార్మికులు కూడా ఉపాధి పొందుతున్నారు. మరమగ్గాలపై తువ్వాలలు తయారు కాగానే ఒక్కో తువ్వాలను వేరుచేసి మిషన్‌పై కుట్లు వేయడం, తువ్వాలలు, చేతిరుమాళ్లు, లుంగీలు, ధోవతులను మడతపెట్టడం, చివర్లు కుట్టే పనులతో మహిళలకు ప్రతిరోజూ చేతినిండా పని ఉంటున్నది. ఇలా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో కార్మికులు తువ్వాలలను మరమగ్గాలపై తయారు చేస్తున్నారు. ఇటు మరమగ్గాలు నడిపించే కార్మికులతో పాటు మహిళలకు ఉపాధి దొరుకుతుండడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు.

ప్రధాన నగరాలకు ఎగుమతి..

ఇల్లందతో పాటు వర్ధన్నపేట, రాయపర్తి, కొడకండ్ల మండలాల్లోనూ వీటిని తయారుచేస్తున్నారు. గ్రామానికి చెందిన పెద్దూరి మహేశ్‌ అనే కార్మికుడు ఆయా గ్రామాల్లో ఇంట్లో మరమగ్గాలున్న వారికి దారం, ఇతర తయారీ సామగ్రి సమకూర్చి పనులు అప్పగిస్తాడు. ఆ తర్వాత వారి నుంచి నేసిన వస్ర్తాలను సేకరిస్తాడు. వాటిని రాష్ట్రంలోని 11 జిల్లాలతోపాటు అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, ముంబై, బళ్లారి, హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ తదితర ప్రధాన నగరాలకు ఎగుమతి చేస్తున్నాడు. కార్మికులకు మార్కెట్‌ ధర ఆధారంగా చెల్లిస్తుండడంతో వస్ర్తాల తయారీ మరింతగా ఊపందుకుంటున్నది. నిపుణులైన కార్మికులు వస్ర్తాలను తయారుచేస్తుండడంతో తువ్వాలలకు మంచి గిరాకీ ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఊళ్లె పని మంచిగున్నది..

తెలంగాణ రాకముందు భీవండిల 20 ఏండ్లు మరమగ్గాల మీద పనిచేసిన. పైసలకు శాన ఇబ్బందయ్యేది. ఇప్పుడు మా ఊరు ఇల్లందలోనే పని చేసుకుంటున్న. వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకుంట సంతోషంగా ఉన్న. నెలకు రూ.8 వేల నుంచి 10వేల దాక సంపాదిస్తున్న. ప్రభుత్వం నెలకు రూ.2వేల పింఛన్‌ కూడా ఇస్తాంది. రంది లేకుంట బతుకుతాన. భీవండిలో రోజుకు 15 గంటలు పనిచేస్తే పానం మంచిగుండకపోయేది. ఈడ రోజుకు 8 గంటలే. ఆరోగ్యం కూడా బాగుంటాంది.

– అవదూత సత్తయ్య, కార్మికుడు

ముందే ఆర్డర్లు వస్తున్నయ్‌..

తువ్వాలలు, చేతిరుమాళ్లకు మంచి గిరాకీ ఉంది. మాల్‌ మంచిగ నేస్తున్నం కాబట్టి వ్యాపారులు ముందే ఆర్డర్లు ఇస్తున్నరు. సంగెం, రాయపర్తి, వర్ధన్నపేట మండలాలతో పాటు కొడకండ్ల మండలంలో కూడా కార్మికులతో తయారుచేయిస్తున్న. రెడీ అయినంక 11 జిల్లాలతో పాటు అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, ఒడిశా, ముంబై నగరాల్లోని వ్యాపారులకు పంపిస్తున్న. ఇల్లందలో కార్ఖాన మొదలైనంక.. ఇక్కడినుంచి భీవండి, సూరత్‌కు పోయినోళ్లు మళ్లీ వచ్చిన్రు. అందరూ ఇక్కడ్నే పనిచేస్తున్నరు. మహిళలకు కూడా మంచి పని దొరుకుతాంది.

పెద్దూరి మహేశ్‌, వస్ర్తాల విక్రయదారుడు, ఇల్లంద

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana