e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జిల్లాలు ముసిరి ముంచెత్తి

ముసిరి ముంచెత్తి

ముసిరి ముంచెత్తి
                - 

రోజంతా ముసురు..
మధ్యమధ్యలో కుండపోత పోటెత్తిన వాగులు..
అలుగు దుంకుతున్న చెరువులు
నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
పలుచోట్ల నీట మునిగిన పంటలు.. దెబ్బతిన్న రహదారులు
కాజ్‌వేలపై నుంచి వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
మానుకోట, రూరల్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం
జనగామ జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ అధికారయంత్రాంగం అప్రమత్తం
మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణ కంట్రోల్‌ రూంల ఏర్పాటు
గ్రేటర్‌ వరంగల్‌లో ప్రత్యేక చర్యలు

- Advertisement -

వరంగల్‌, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రుతు పవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మూడు రోజులుగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. రోజంతా ముసురు.. మధ్యమధ్యలో కుండపోత వర్షాలతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు మత్తళ్లు దంకుతున్నాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కాజ్‌వేల పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్‌ వరంగల్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెగని వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లలో టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మంగళవారం రాత్రి ముసురుతో మొదలై మూడు రోజులుగా ఏకధాటిగా పడుతూనే ఉన్నది. నీటి వనరులు జలకళను సంతరించుకోగా, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చెరువులు మత్తడి పోస్తుండగా, మరికొన్ని పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 30 అడుగులకు, రామప్ప చెరువు 31 అడుగులకు చేరింది. బొగత జలపాతం 50 అడుగుల పైనుంచి జాలువారుతున్నది. గోదావరికి వరద పెరుగడంతో తుపాకులగూడెం సమ్మక్కబరా జ్‌లో 40గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపసముద్రం చెరువు నీటిమట్టం 21అడుగులకు చేరింది. సింగరేణి ఏరియాలోని ఓసీపీ-2, 3 గనుల్లో 8600 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో పాకాల సరస్సు నీటిమట్టం 21 అడుగులకు చేరింది. శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు 19అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరి అలుగుపోస్తున్నది. నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువులోకి భారీగా వరదనీరు చేరుతున్నది. జనగామ జిల్లాలోని కోలుకొండ, యశ్వంతాపూర్‌, ఆకేరు, పోచన్నపేట, బయ్యన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. గండిరామవరం, మల్లన్నగండి రిజర్వాయర్లు నిండడంతో గేట్లు ఎత్తా రు. జిల్లాలో సుమారు 700 నిం డినట్లు అధికారులు తెలిపారు.

వర్షాలతో ప్రజలు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌తో కలిసి మేయ ర్‌ గుండు సుధారాణి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌, సాగునీరు, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లలో టోల్‌ ఫ్రీ నంబర్లను ఏర్పా టు చేశారు. పర్యవేక్షణ, సహాయక చర్యల కోసం మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. గ్రేటర్‌ వరంగల్‌లో వానల పరిస్థితిపై చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, మేయర్‌ సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, నరేందర్‌, ధర్మారెడ్డి, రాజయ్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల కోసం అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. వరద నీరు వేగంగా బయటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకో కుండా అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పోలీసులను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వరద ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా స్థానిక పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

మహబూబాబాద్‌ జిల్లాలో గురువారం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌ మండలంలో 76.20 మిల్లీ మీటర్లు, గంగారంలో 74.20, బయ్యారంలో 73.60, కురవిలో 72.30, గూడూరులో 70, డోర్నకల్‌లో 68.50, మరిపెడలో 66.80, గార్లలో 64.30, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో 64.90 మిల్లీ మీటర్లు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో 63.30మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. వరంగల్‌ మహానగరంలో ఓ మోస్తరు వానలు పడ్డాయి. వరంగల్‌ మండలంలో 46.20 మిల్లీ మీటర్లు, ఖిలా వరంగల్‌ మండలంలో 46 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా నిరంతరంగా వానలు పడుతుండడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. పొలాల్లో వరద నీరు చేరడంతో నాట్లు వేసే పరిస్థితి లేదు. వానలు ఇలాగే కొనసాగితే మెట్ట పంటలకు కొంత ఇబ్బందికరంగా మారనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముసిరి ముంచెత్తి
ముసిరి ముంచెత్తి
ముసిరి ముంచెత్తి

ట్రెండింగ్‌

Advertisement