లండన్: ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్నవారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ విషయాన్ని యూరోపియన్ వైద్య నియంత్రణాధికారులు తెలిపారు. పురుషుల్లో చాలా సాధారణంగా ఆ సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొన్నది. అయినా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ స్థాయిలో లాభం జరుగుతున్నట్లు యురోపియన్ ఏజెన్సీ తెలిపింది. ఆ రెండు టీకాలు తీసుకునేవారిలో గుండె కణాల్లో వాపు వస్తున్న కారణంగా పేషెంట్లు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవడం, గుండె మంట లాంటి లక్షణాలు కూడా కొందరిలో నమోదు అవుతున్నట్లు తేలింది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాలని యురోపియన్ ఏజెన్సీ సూచించింది. ఫైజర్ టీకా తీసుకున్న 17.7 కోట్ల మందిలో.. 145 మందికి మయోకార్డిటిస్, 138 మందిలో పెరికార్డిటిస్ లాంటి లక్షణాలు కనిపించినట్లు అధికారులు చెప్పారు.
మోడెర్నా టీకా తీసుకున్న 2 కోట్ల మందిలో 19 మయోకార్డిటిస్, 19 పెరీకార్డిటిస్ కేసులు నమోదు అయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లో మయోకార్డిటిస్ లక్షణాలు కనిపించే ఛాన్సు ఉంది. mRNA టెక్నాలజీతో తయారైన వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుండె కణాల్లో వాపును గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆస్ట్రాజెనికా, జాన్సన్ టీకాలతో ఆ సమస్య లేదన్నారు.