మంగళవారం 02 మార్చి 2021
Warangal-rural - Jan 25, 2021 , 00:17:35

కూరగాయల సాగు లాభాలు బాగు

కూరగాయల సాగు లాభాలు బాగు

  • ఆర్థికంగాఎదుగుతున్న రైతులు 
  • నగర సమీప గ్రామాల్లో పెరిగిన సాగు

గీసుగొండ, జనవరి 24 : వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం వరంగల్‌ పట్టణానికి సమీపంలో ఉండడం రైతులకు కలిసి వస్తోంది. పండించిన కాయగూరలు మార్కెట్లో నేరుగా విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. మార్కెట్‌ అనువుగా ఉండడంతో పాటు రవాణా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మండలంలో గత ఏడాదికంటే ఈ సారి కూరగాయల సాగు పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. 24 గంటల కరంటుతో పాటు కెనాల్‌ ద్వారా ప్రభుత్వం నీరు అందిస్తుండడం తమకు కలిసొస్తుందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి, పసుపు, మిరప పంటలు పాడవడంతో వాటిని మధ్యలోనే తీసేసి రెండో పంటగా వంకాయ, బెండకాయ, కాకరకాయ, దోసకాయ, సోరకాయ, టమాట, దొండకాయ, బీరకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, చిక్కుడు, మిర్చితో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఏ కూరగాయల పంటైనా 45 నుంచి 60 రోజుల్లో కాపు వస్తుందని రైతులు అంటున్నారు.  మార్కెట్లోనూ కూరగాయలకు డిమాండ్‌ ఉండడంతో ఎకరా వంకాయ సాగులో ఇప్పటికే లక్షా 50 వేల రూపాయల వరకు లాభం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. వర్షంతో పంటలు పాడవగా కూరగాయల సాగుతో ధైర్యం వచ్చిందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

రూ.లక్ష వరకు లాభం వచ్చింది

నాకున్న భూమిలో వంకాయ, కాకరకాయ పంటలు సాగు చేశా. అరెకరంలో వంకాయ సాగు చేస్తే ఖర్చులు పోను ఇప్పటి వరకు రూ.లక్ష వరకు లాభం వచ్చింది. చివరి వరకు మరో రూ.50 వేలు లాభం  వచ్చేలా ఉంది. కాకరకాయ సాగులో రూ.50 వేల వరకు లాభం వచ్చింది. ప్రతి సంవత్సరం కూరగాయలు సాగు చేస్తున్నం. ఇప్పటి వరకు నష్టం రాలేదు. 

 - గోనె పద్మ, గంగదేవిపల్లి

24 గంటల కరంటుతోనే సాధ్యం  

బావుల్లో నీళ్లు, ప్రభుత్వం 24గంటల కరంటు ఇస్తుండడంతోనే రెండో పంటగా కూరగాయలు సాగు చేస్తున్నం. మాకు వరంగల్‌తో పాటు నర్సంపేట మార్కెట్లు అందుబాటులో ఉండడం కలిసివస్తోంది. ఎకరం భూమిలో టమాట పంట వేశాం. ఎప్పుడూ లేనంత ఈ సారి పంట బాగా పండింది. 

- ఆంగోతు రజిత, హర్జ్యతండా

VIDEOS

logo