శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-rural - Jan 24, 2021 , 02:25:56

పాకాల ఆయకట్టులో నాట్లు షురూ

పాకాల ఆయకట్టులో నాట్లు షురూ

  • 11 వేల ఎకరాలకు తైబందీ ఖరారు
  • అదనంగా 3500 ఎకరాల్లో సాగుకు యత్నం

ఖానాపురం, జనవరి 23: జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు కలిగిన పాకాల సరస్సు కింద యాసంగి వరినాట్లు ప్రారంభమయ్యాయి. సంగెం, తుంగబంధం, జాలుబంధం పరిధిలో 11 వేల ఎకరాలకు అధికారులు తైబందీ ఖరారు చేసి గత నెల 21న నీటిని విడుదల చేశారు. నార్లు ఏపుగా ఎదిగి నాటు దశకు చేరుకోవడంతో అన్నదాతలు నాట్లు వేస్తున్నారు. అధికశాతం రైతులు కూలీలతో నాట్లను వేయిస్తుండంగా.. కొందరు డ్రమ్‌సీడర్‌ విధానంలో వరిసాగు చేస్తున్నారు. పాకాల సరస్సులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సంగెం 1, 3, 4 కాల్వల ద్వారా నీటి పారకంలో 8 వేల ఎకరాలు, తుంగబంధం కాల్వ ద్వారా నీటి పారకంలో రెండు వేల ఎకరాలు, జాలుబంధం కాల్వ పరిధిలో వెయ్యి ఎకరాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో అధికారులు తైబందీ ఖరారు చేశారు. కానీ, తుంగబంధం, మాటువీరారం, సంగెం, జాలుబంధం కాల్వల పారకంలో అదనంగా మరో మూడు వేల నుంచి 3500 ఎకరాల్లో రైతులు సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో సంగెం, తుంగబంధం కాల్వల చివరి ఆయకట్టు రైతులకు ఆఖరి తడులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తైబందీ మేరకు రైతులు సాగు చేసుకుంటే నీటి సమస్య ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

త్వరగా నాట్లు పూర్తి చేసుకోవాలి

యాసంగిలో దొడ్డు రకాలనే సాగు చేసుకోవడం పాకాల ఆయకట్టు రైతుల ఆనవాయితీ. వీటి పంటకాలం 120 రోజులు. పాకాల ఆయకట్టులో యాసంగిలో వరినాట్లు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. దీంతో వర్షాకాలం ఆరంభంలో కోతకు వస్తున్నాయి. నాట్లను ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేసుకుంటే  మే మొదటి, రెండో వారంలో పంటలు కోతకు వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఇంకా నార్లు పోయొద్దని, అవసరమైతే  పెరిగిన నారును కొనుగోలు చేసుకుని నాట్లు వేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు.

VIDEOS

logo